దానికి మరోదారి ఉందేమో చూడాల్సిందమ్మా అని సూరజ్ అనడంతో.. ‘ఏంట్రా వాళ్లపై సింపతీ చూపిస్తావా? లేదంటే నేను తప్పు చేశానని అంటున్నావా? నీకు అలా అనిపించినా సరే.. నువ్వు నా వైపే నిలబడాలి. నేను తప్పు చేసినా సరే నువ్వు ఈ తల్లికే సపోర్ట్ ఉండాలి.. జ్యోత్స్న ఏం చెప్పిందో విన్నావ్ కదా.. మా మమ్మీ శత్రువులు నాకూ శత్రువులు అని అన్నది కదా.. నీకు కూడా అదే వర్తిస్తుంది. వాళ్లకి ఇది సరిపోదు.. ఇంకా అనుభవించేట్టు చేస్తాను’ అని అంటుంది మాలిని. అది కాదమ్మా అని సూరజ్ నచ్చజెప్పే ప్రయత్నం చేసినా కూడా వినిపించుకోదు మాలిని. అటు శివన్నారాయణ.. కార్తీక్ ఇంటికి చేరినా కూడా తన తీరు ఏం మారలేదు. ‘నేను మిమ్మల్ని నమ్మిన తప్పుకి నా కుటుంబం మొత్తం శిక్ష అనుభవిస్తుంది’ అని అంటాడు. ఆ మాటతో కార్తీక్.. ‘సరేతాతా.. మేం తప్పు చేశాం అని అంటున్నావ్ కదా.. మేమే సరిదిద్దుకుంటాం. మా వల్లే మీకు ఈ పరిస్థితి వచ్చిందని అంటున్నారు కదా.. మీరు మా ఇంట్లోనే ఉండండి. నీ కోపం ఏం చేస్తే పోతుందో అదే చేయి కానీ.. నిన్ను మాత్రం ఇక్కడ నుంచి వెళ్లనిచ్చేది లేదు.. నా ఫ్యామిలీ కష్టంలో ఉంటే నేను చూస్తూ ఊరుకోలేను’ అని అంటాడు. వద్దని చెప్తున్నప్పుడు వదిలేయొచ్చు కదా అని అంటుంది జ్యోత్స్న. ఏంటి వదిలేసేదీ.. నేను తాతని కాదు బంధాలు తెంపుకోవడానికి? ఈయన మొదటి నుంచి ఇంతే కదా.. తప్పు చేశాడని అల్లుడ్ని వదిలేశాడు.. మాట వినలేదని మనవడ్ని వదిలేశావ్.. ఎదురు తిరిగిందని కూతుర్ని వదిలేశావ్.. అపార్థం చేసుకుని దీపని వదిలేశావ్.. చివరికి ఆస్తులు, అంతస్తులు, అయినవాళ్లని అందర్నీ వదిలేసి రోడ్డున పడ్డావ్. నీకు వదిలేయడం తెలిస్తే నాకు పట్టుకోవడం తెలుసు. నేను ఏనాడూ ఎవర్నీ వదిలేయలేదు. నా వల్ల తప్పులు జరిగాయి కాదనడం లేదు. దాన్ని సరిదిద్దుకునే అవకాశం ఇవ్వమని అడుగుతున్నా. మీరు ఎక్కడో ఉండటం ఏంటి? ఇక్కడే ఉండండి.. ఇదే మీ ఇల్లు అనుకోండి’ అని అంటాడు కార్తీక్. ఛీ ఛీ మేం ఒక్కరిపై ఆధారపడి బతకం.. ఒకరి రుణం కూడా మేం ఉంచుకోం’ అని అంటాడు ముసలోడు. దాంతో కార్తీక్.. ‘సరే ఉంచుకోవద్దు.. ఇదేం మా సొంత ఇల్లు కాదు కదా.. అద్దె ఇల్లే కదా.. ప్రతినెలా అన్ని ఖర్చుల్లో భాగం పంచుకోండి. అంతేతప్ప.. నా గొంతులో ప్రాణం ఉండగా ఈ ఇల్లు మాత్రం దాటనివ్వను అని అంటాడు. సరే అయితే.. డబ్బులు తీసుకుంటేనే ఇక్కడ ఉంటాం.. ఈ క్షణం నుంచి ప్రతి రూపాయికి లెక్క రాయి పారిజాతం. అన్నీ తిరిగి ఇచ్చేద్దాం. నువ్వు రాస్కో పారిజాతం అని అంటాడు శివన్నారాయణ. దాంతో కార్తీక్.. అందరికీ వేడి నీళ్లు పెట్టి.. మంచి టిఫినె చేయి అని అంటాడు. ఇంతలో దశరథ.. ‘లోపలికి వెళ్దాం పదా నాన్నా.. మన వల్ల ఆడవాళ్లు ఇబ్బంది పడుతున్నారు’ అని చెప్పడంతో.. శివన్నారాయణ ఇంట్లోకి వెళ్తాడు. ఆ తరువాత సూరజ్.. జ్యోత్స్నని వెతుక్కుంటూ వస్తాడు. ఇద్దరూ కలిసి ఓ పార్క్‌లో కలుస్తారు. ఆ తరువాత వీళ్ల మధ్య ఎప్పుడూ నడచే ముచ్చటే నడుస్తుంది. మోసం చేశారని సూరజ్.. పాపం చేశారని జ్యోత్స్న వాదించుకుంటారు. వెళ్లి మీ అమ్మతో చెప్పరా.. శివన్నారాయణ కుటుంబం వాళ్ల కూతురు ఇంట్లో తలదాచుకుందని.. అప్పుడు మా అత్త కుటుంబాన్ని కూడా రోడ్డున పడుతుంది. నీ కళ్లు చల్లబడతాయి అని అంటుంది జ్యోత్స్న. ‘మా అమ్మ గురించి తప్పుగా మాట్లాడొద్దు’ అని అంటాడు సూరజ్. ‘తప్పు చేసేవాళ్లని తప్పు చేశావ్ అనేకదా అంటారు.. మాలిని గారు.. మేన కోడలు పెళ్లిని పీటలపై ఆపేసింది.. ఆడపడుచుపై పగపట్టి రోడ్డుకి లాగింది.. నా జీవితంతో ఆడుకున్నారు ఇంకా సరిపోలేదా?’ అని అంటుంది జ్యోత్స్న. ఇదంతా నాకు తెలియదు.. ముందే తెలిస్తే ఏదోటి చేసేవాడ్ని అని అంటూ ఎమోషనల్ అవుతాడు సూరజ్. బిడ్డ కడుపులో ఉన్నప్పుడు అమ్మ ఆనందంగా ఉంటే బిడ్డ కూడా ఆనందంగా ఉంటుందని అంటారు. చనిపోయిన నాన్న కోసం అమ్మ ఏడుస్తుంటే.. కడుపులో ఉన్న నేను ఎన్ని కన్నీళ్లు కార్చానో తెలుసా?? నా కోసం బతికిన మా అమ్మ అంటే నాకు ఇష్టం. చెడ్డ కొడుకు ఉంటాడు కానీ.. చెడ్డ తల్లి ఉండదు. నేను ఎలాంటి వాడ్నో తెలియదు కానీ.. నా తల్లి మాత్రం చెడ్డది కాదు. ఆమె కన్నీళ్లను ఆపడానికి ఏదైనా చేస్తాను. ఎందుకంటే మా అమ్మ లేకుంటే నాకు ఈ జన్మేలేదు. ఎవరు ఎవరికోసం బతుకుతున్నారో తెలియదు కానీ.. నేను మా అమ్మ కోసమే బతుకుతున్నా. అమ్మ అంటే నిజం.. ఆ నిజమే నా జీవితం అని చెప్పేసి వెళ్లిపోతాడు సూరజ్. దాంతో జ్యోత్స్న.. ‘మీ అమ్మ మిమ్మల్ని మోసం చేసినట్టే నిన్నూ మోసం చేస్తుంది’ అని అనుకుంటుంది. కట్ చేస్తే.. మాలిని ఇంటికి నేరుగా వచ్చి డైనింగ్ టేబుల్‌పై ఎదురుగా కూర్చుని షాకిస్తారు దీప, కార్తీక్‌లు. మాలిని బిత్తరపోయి చూస్తుంటుంది. ఎదురుగా దక్షణమూర్తి కూడా అలాగే చూస్తూ ఉండటంతో.. ‘సినిమా ఇప్పుడే బిగిన్ అయ్యింది తాతా.. నీ దగ్గరకి ఇంటర్వెల్లో వస్తా’ అని అంటాడు కార్తీక్. ఏంటి పిన్నీ.. వీళ్లు ఎవరూ నీతో కలిసి టిఫిన్ చేస్తున్నారు.. మీ చుట్టాలా? అని అడుగుతాడు కార్తీక్. లేదు.. ఈ ఇంటి పని మనుషులు అని అంటుంది మాలిని. ‘ఆహా.. పని వాళ్లని కూడానీతో పాటు కూర్చోబెట్టుకుని తిననిస్తున్నావంటే.. మామూలు విషయం కాదు’ అని అంటాడు కార్తీక్. మేం అందర్నీ ఒకేలా చూస్తాం.. మీ తాతలా కాదు’ అని అంటుంది మాలిని. వీళ్లని ఇక్కడ కూర్చోమన్నది నువ్వు కాదులే పిన్నీ.. ఇంకో మాట చెప్పు అని అంటాడు కార్తీక్. అవును నేను కాదు.. నా కొడుకు అని అంటుంది మాలిని. మీరు ఇంత మంచి వాళ్లు ఎప్పుడు అయిపోయాను పన్నీ అని కార్తీక్ అంటే.. ‘మేం మంచి వాళ్లం కాబట్టేరా.. నా కొడుకు నీ భార్య ప్రాణాలను కాపాడాడు’ అని అంటుంది మాలిని. నిజమే అత్తా.. నీ కొడుక్కి థాంక్స్ చెప్పాలి అని అంటుంది దీప. ఇంతలో కార్తీక్.. ‘నువ్వు ఏం అనుకున్నా పర్లేదు కానీ.. నిన్నో మాట అడగాలని ఉంది.. అసలు నువ్వు ఆడదానివేనా పన్నీ.. మేనకోడలు పెళ్లి ఆపేశావ్.. ఆడపడుచు జీవితాన్ని రోడ్డుకి లాగావ్.. నువ్వు మాత్రం ఇక్కడ పల్లీ చట్నీతో గారెలు తింటున్నావ్’ అని అంటాడు. ఆ మాటతో ఏం మాట్లాడుతున్నావ్ రా అంటూ రంకెలు వేస్తుంది మాలిని. ఆ మాటతో దీప.. నువ్వు చేసిన పాపాలు అత్తా.. అని కౌంటర్ ఇస్తుంది. నీకు ఆరోజే చెప్పాను.. సుమిత్ర కుటుంబం జోలికి రావొద్దు నేను ఊరుకోను అని అని అంటుంది దీప. ఆ మాట విన్న దక్షణమూర్తి.. ‘సుమిత్ర కుటుంబాన్నిరోడ్డుకి లాగడం ఏంటి? నా కూతురు కుటుంబానికి ఏమైంది? అని కంగారు పడతాడు. అటు మాలిని కూడా టెన్షన్ పడుతుంటుంది. మామయ్యకి నిజాలు తెలిస్తే ఊరుకోరు. ఉదయమే కాశీ నుంచి వచ్చారు అని అనుకుంటుంది. ‘అసలు నీకేం హక్కు ఉంది ఆస్తులు లాక్కోవడానికి? రెస్టారెంట్లు రాయించుకోవడానికి? ఇంటిని కూడా లాక్కుని సుమిత్రమ్మ కుటుంబాన్ని నడిరోడ్డుపైకి నెట్టేయడానికి? అని నిలదీస్తుంది దీప. ఆ మాటల్ని విన్న దక్షణమూర్తి ఏమన్నారో తరువాతి ఎపిసోడ్లో చూద్దాం.