
కుక్క, పిల్లి ఎదురుపడితే చాలు రచ్చ రచ్చే.. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. శత్రుత్వాన్ని మరిచి, తల్లిలేని పిల్లి పిల్లకు పాలిచ్చి కడుపు నింపింది ఓ శునకం. ఖమ్మం జిల్లాలో మనుషుల్లో నానాటికీ కనుమరుగవుతున్న మానవత్వానికి, ప్రేమకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఈ అరుదైన సీన్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..
ప్రకృతి సహజంగా కుక్క, పిల్లి అంటేనే ఉప్పు-నిప్పు. ఒకదానికొకటి ఎదురుపడితే చాలు, వెంటాడి దాడి చేసుకోవడం సహజం. అలాంటి బద్ధ శత్రుత్వాన్ని పక్కనపెట్టి, మాతృమూర్తిగా మారి ఓ పిల్లి పిల్లకు పాలిచ్చి ఆకలి తీర్చింది ఓ శునకం. మానవత్వం నానాటికీ కనుమరుగవుతున్న నేటి రోజుల్లో, మూగజీవాల మధ్య వెల్లివిరిసిన ఈ స్వచ్ఛమైన ప్రేమ ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం బుద్ధారం గ్రామంలో స్థానికులనే కాక నెటిజన్లను సైతం కట్టిపడేస్తోంది. బుద్ధారం గ్రామానికి చెందిన మేళ్లచెరువు లక్ష్మయ్య అనే గ్రామస్తుడు తన ఇంట్లో ఓ కుక్కను ప్రేమగా పెంచుకుంటున్నాడు. ఇటీవల ఆ ప్రాంతంలో తల్లి దూరమై ఆకలితో అలమటిస్తున్న ఓ పిల్లి పిల్ల కనిపించింది. ఆకలితో నీరసించి అల్లాడుతున్న ఆ పిల్లి పిల్లను చూసిన ఆ పెంపుడు కుక్క.. తన సహజ వైరాన్ని మరిచి మాతృప్రేమను పంచింది. దగ్గరకు తీసుకుని స్వయంగా పాలు తాపుతూ దాని ఆకలిని తీర్చింది.





