చిన్నారికి సీపీఆర్‌ చేస్తున్న నర్సు ఉరవకొండ, న్యూస్‌టుడే: గణనాథుని మండపంలో అపశ్రుతి చోటు చేసుకుని చిన్నారి మృతి చెందిన ఘటన ఉరవకొండలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల ద్వారా తెలిసిన వివరాలిలా.. పట్టణంలోని ఇందిరానగర్‌ ప్రధాన వీధిలో ఏర్పాటు చేసిన లంబోదర వినాయక మండపంలో ఆదివారం రాత్రి కొంత మంది చిన్నారులు ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో అదే కాలనీలోని ఎనిమిదో వీధికి చెందిన మౌనిక, సోమనాథ్‌ దంపతుల కుమారుడు సాత్విక్‌(8) ఆడుకుంటూ ప్రమాదవశాత్తు విద్యుత్తు తీగలను ముట్టుకుని విద్యుదాఘాతంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. గమనించిన అక్కడి యువకులు వెంటనే చికిత్స కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఒక్కగానొక్క కొడుకును తలుచుకుంటూ చిన్నారి తల్లి ‘సాత్విక్‌ ఒక్కసారి లే నాన్న’ అంటూ రోదించిన తీరు అందరినీ కలిచి వేసింది. చిన్నారిని ప్రాణాలతో రక్షించేందుకు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడు భరత్, నర్సులు సీపీఆర్‌ చేస్తూ తీవ్రంగా ప్రయత్నించారు. అయినా బాలుడు తిరిగిరాని లోకాలకు వెళ్లి పోయాడు. ఈ ఘటనతో ఇందిరానగర్‌లో విషాదం నెలకొంది. స్థానికులు పెద్ద సంఖ్యలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలి వచ్చారు. ఘటనపై విచారిస్తున్నామని సీఐ మహానంది తెలిపారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.