
ఇంటర్నెట్‌ డెస్క్‌: బ్రిటన్ మాజీ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ (Boris Johnson), ఇతర అధికారులు త్రుటిలో ప్రమాదం నుంచి బయపడ్డారు. ఉక్రెయిన్‌ పర్యటనలో ఉన్న బోరిస్ జాన్సన్ ప్రత్యేక రైల్లో ప్రయాణిస్తున్న సమయంలో సమీపంలోని రైల్వే క్రాసింగ్‌పై రష్యా డ్రోన్‌ దాడుల (Russian Drone Attack)కు పాల్పడింది. దీంతో అక్కడి ఇంధన స్టేషన్‌ దెబ్బతినగా.. పలు వాహనాలకు మంటలు వ్యాపించాయి. అప్రమత్తమైన లోకోపైలట్లు వెంటనే రైలును ఆపి.. ప్రయాణికులను దించేశారు. దీంతో ప్రాణాపాయం తప్పింది. ఆ రైలులో బోరిస్ జాన్సన్‌తో పాటు స్వీడన్ మాజీ ప్రధాన మంత్రి కార్ల్ బిల్ట్, పలువురు యూరోపియన్‌ నేతలు కూడా ఉన్నారు. అక్కడే మరో రైలులో అమెరికా సీఐఏ మాజీ చీఫ్‌ డేవిడ్‌ పేట్రియాస్‌ కూడా ఉన్నారు. ఇక అక్కడే ఉన్న మరో రైలును పలు డ్రోన్లు ఢీకొట్టినట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. అప్పటికే అధికారులు దానిని ఖాళీ చేయించడంతో ఎవరికీ గాయాలు కాలేదు. రష్యా చేసిన డ్రోన్‌ దాడులను అర్థరహితమైనవిగా బోరిస్ జాన్సన్ పేర్కొన్నారు. క్రెమ్లిన్‌ దాడుల నుంచి తమ ప్రజలను రక్షించుకోవడానికి ఉక్రెయిన్‌కు మరిన్ని ఆయుధాలు అందించాలని బ్రిటన్‌ ప్రభుత్వానికి పిలుపునిచ్చారు (Ukraine Support). వారికి అవసరమైన గగనతల రక్షణ వ్యవస్థలను మనం ఎప్పుడు ఇవ్వబోతున్నామంటూ ప్రశ్నించారు. మిత్రదేశాలు తగిన సాయం చేస్తే.. జెలెన్‌స్కీ ఆ యుద్ధాన్ని వేగంగా ముగించే అవకాశం ఉంటుందన్నారు. పౌర రైల్వేలను (Civilian Railways) కూడా రష్యా లక్ష్యంగా చేసుకోవడంతో.. ఉక్రెయిన్‌ ప్రజలు ప్రతిరోజూ ఇటువంటి ప్రమాదాలను ఎదుర్కొంటూ, భయంభయంగా జీవించాల్సి వస్తోందన్నారు. పుతిన్‌ ఎన్ని కుట్రలు పన్నినా విజయం ఉక్రెయిన్‌దేనని విశ్వాసం వ్యక్తం చేశారు. కొన్నేళ్లుగా రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఉక్రెయిన్‌ విమాన సేవలను నిలిపివేసింది. డ్రోన్‌ దాడులు జరిగే అవకాశం ఉండడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. దీంతో అక్కడి ప్రజలు బస్సులు, రైలు సర్వీసులనే వినియోగిస్తున్నారు. అధికారిక పర్యటనకు వచ్చిన విదేశీ నేతలు సైతం రైళ్లలోనే ప్రయాణిస్తున్నారు. ఇప్పుడు కీవ్‌లోని రైలు సర్వీసులను కూడా మాస్కో లక్ష్యం చేసుకుంటుండడం గమనార్హం. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. బ్రిటన్ మాజీ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్, ఇతర అధికారులు త్రుటిలో ప్రమాదం నుంచి బయపడ్డారు.