
ఇంటర్నెట్‌డెస్క్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం (ఏప్రిల్- జూన్)లో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 7.8 శాతంగా నమోదు కావడంపై ప్రధాని మోదీ (PM Modi) హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు అభినందనలు తెలిపిన ఆయన.. గతంలో చేసిన విజ్ఞప్తినే మరోసారి గుర్తుచేశారు. స్వదేశీ వస్తువులనే కొనుగోలు చేయాలని, విదేశీ ప్రయాణాలు వద్దని, అవసరం లేకుండా బంగారం కొనొద్దని మరోసారి కోరారు. ప్రస్తుతం కిర్గిస్థాన్ పర్యటనలో ఉన్న ఆయన ఈ మేరకు ఇన్‌స్టా వీడియో విడుదల చేశారు.
‘‘దేశ ప్రజలకు అభినందనలు. 7.8% వృద్ధి గొప్ప విషయం. ప్రజల సంకల్ప బలం, కృషికి ఇది నిదర్శనం. ప్రపంచం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో భారత్ ఈ అసాధారణ ఘనతను దక్కించుకుంది. ప్రపంచం యుద్ధంలో మునిగిపోయింది. ఎటుచూసినా యుద్ధ వార్తలే.. సంక్షోభాలే. సరఫరా గొలుసు పూర్తిగా దెబ్బతింది. 2020లో కొవిడ్ తర్వాత నుంచి నేటి వరకు ఎక్కడా స్థిరత్వం కనిపించడం లేదు. అయినా భారత్ పురోగమిస్తోంది’’ అని మోదీ తన వీడియోలో పేర్కొన్నారు.
‘‘పర్యటనల కోసం విదేశాలకు వెళ్లొద్దు. విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్‌లకు దూరంగా ఉండండి. ‘భారత్‌లోనే వివాహం చేసుకోండి’ అనే మంత్రాన్నే మనం పాటిద్దాం. అవసరం లేకపోతే బంగారాన్ని కొనడం మానుకోండి. స్థానికంగా తయారైన వస్తువులు, సేవలు ఎంత ఎక్కువగా ఎంచుకుంటే.. దేశం అంత ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది. మనం స్వావలంబనకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటే.. స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యేనాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదుగుతామనే విశ్వాసం నాకు ఉంది’’ అని మోదీ పేర్కొన్నారు.
‘‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అంచనా వేసిన 7 శాతం కంటే ప్రస్తుత వృద్ధి రేటు ఎక్కువ. అమెరికా- ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయంగా అనిశ్చితులు, ఇంధన సరఫరాకు అవరోధాలు వంటి పరిస్థితులను తట్టుకొని భారత ఆర్థిక వ్యవస్థ రాణించడం విశేషం. ఈ వృద్ధిని దేశ ప్రజలు వేడుకలా నిర్వహించుకోవాలి. అదే సమయంలో వికసిత్ భారత్ దిశగా కృషి చేయాలి. 140 కోట్ల మంది ప్రజల ఐక్యత.. దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తుంది’’ అని ప్రధాని (PM Modi) అన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తమిళనాడులోని కొడైకెనాల్లో సోమవారం రాత్రి ‘గోల్డెన్ మూన్’ (Golden Moon) దర్శనమిచ్చాడు.





