
ప్రపంచవ్యాప్తంగా మరోసారి యుద్ధ భయం ఆర్థిక మార్కెట్లను కుదిపేస్తోంది. ముఖ్యంగా ఇరాన్-అమెరికా మధ్య పెరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులు గ్లోబల్ ఇన్వెస్టర్లలో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఈ ప్రభావం నేరుగా బంగారం, వెండి మార్కెట్‌పై పడుతోంది. సాధారణంగా ప్రపంచంలో అనిశ్చిత పరిస్థితులు నెలకొంటే పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్ల నుంచి డబ్బును ఉపసంహరించుకుని బంగారం వంటి సురక్షిత పెట్టుబడుల వైపు వెళ్తారు. ప్రస్తుతం అదే ట్రెండ్ కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా వరుసగా పెరిగిన బంగారం ధరలు సామాన్యులకు చుక్కలు చూపించాయి. పెళ్లిళ్లు, శుభకార్యాలు పెట్టుకున్నవారు బంగారం కొనాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. కానీ ఇవాళ మాత్రం మార్కెట్‌లో స్వల్ప ఊరట కనిపించింది. అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ బలపడటం, కొంతమంది ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడం వల్ల గోల్డ్ ధరల్లో మార్పు కనిపించింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు హైదరాబాద్, విజయవాడ, వైజాగ్‍లో బంగారం ధరలు ఒకేలా కొనసాగుతున్నాయి. 10 గ్రాముల 24 క్యారట్లపై రూ.600 తగ్గి రూ.1,58,290 వద్ద నమోదైంది. అదే 22 క్యారట్ల బంగారం ధర రూ.550 తగ్గి రూ.1,45,100కు చేరుకుంది. అయితే మార్కెట్ నిపుణులు చెబుతున్నదేమిటంటే…ఈ తగ్గుదల తాత్కాలికమే కావచ్చని. ఎందుకంటే అంతర్జాతీయంగా యుద్ధ వాతావరణం ఇంకా పూర్తిగా చల్లారలేదు. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగితే బంగారం ధరలు మళ్లీ భారీగా ఎగిసే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయం, డాలర్ ఇండెక్స్ మార్పులు కూడా గోల్డ్ మార్కెట్‌ను ప్రభావితం చేయనున్నాయి. ఇప్పుడు కొనుగోలుదారుల్లో ఒకటే ప్రశ్న..ఇదే సరైన కొనుగోలు అవకాశమా? లేక ఇంకొన్ని రోజులు ఆగాలా? ప్రస్తుతం ధరలు కొద్దిగా తగ్గినా, మార్కెట్‌లో అస్థిరత మాత్రం కొనసాగుతూనే ఉంది.
