translateexpand_more

Cbse Controversy News

Latest updates from Telugu Digital news sources.

Oneindia Telugu03 Jun, 03:31 am
ఓఎస్ఎం వివాదాల వేళ.. సీబీఎస్ఈకి కొత్త బాస్

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలను తీసుకుంది. ఛైర్మన్, కార్యదర్శిపై బదిలీ వేటు వేసింది. కొత్తవారిని నియమించింది. సీబీఎస్ఈ నూతన చైర్మన్‌గా లోఖండే ప్రశాంత్ సీతారాం నియమితులయ్యారు. కేంద్ర ప్రభుత్వం ఆయన నియామకాన్ని ఖరారు చేసింది. 12వ తరగతి పరీక్షల నిర్వహణ, మూల్యాంకన ప్రక్రియలలోని సాంకేతిక, ఆచరణాత్మక సమస్యలు, జవాబుదారీతనంపై తలెత్తిన వివాదాల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.అప్పటివరకు సీబీఎస్‌ఈ చైర్మన్, కార్యదర్శులుగా వ్యవహరించిన రాహుల్ సింగ్, హిమాన్షు గుప్తాలను హుటాహుటిన బదిలీ చేసింది. ఆ వెంటనే లోఖండే ప్రశాంత్ సీతారాం బాధ్యతలు చేపట్టారు. సీనియర్ బ్యూరోక్రాట్ వరుణ్ భరద్వాజ్ సీబీఎస్‌ఈ కొత్త కార్యదర్శిగా నియమితులయ్యారు. ఆన్ స్క్రీన్ మార్కింగ్ (OSM) సిస్టమ్‌లోని లోపాలు, సాంకేతిక సమస్యలు, చెల్లింపుల గందరగోళం, ధృవీకరణ, పునఃమూల్యాంకన ఫలితాల్లో జాప్యం వంటి ఫిర్యాదులు ప్రభుత్వ చర్యలకు దారితీశాయి.డిజిటల్ మార్కింగ్ విధానంపై విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైన విషయం తెలిసిందే. డిజిటల్ మూల్యాంకనం కోసం అవసరమైన సర్వీసుల కొనుగోళ్లపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది కేంద్రం. దీనికోసం ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ ఛైర్‌పర్సన్ ఎస్ రాధా చౌహాన్ నేతృత్వంలో ఏర్పాటైన ఈ కమిటీ.. ఓఎస్‌ఎం విధానాలు, ఇప్పుడున్న వ్యవస్థను పరిశీలించి, నెలలోగా నివేదికను సమర్పించాల్సి ఉంటుంది.లోఖండే ప్రశాంత్ సీతారాం.. సీనియర్ ఐఎఎస్ అధికారి. ప్రస్తుతం కేంద్ర హోం మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆయన స్వరాష్ట్రం.. మహారాష్ట్ర. 2001 బ్యాచ్‌ ఏజీఎంయూటీ కేడర్ ఐఎఎస్ అధికారి. పూణే విశ్వవిద్యాలయం నుండి మెకానికల్ ఇంజనీరింగ్‌లో బీఈ డిగ్రీని పూర్తి చేశారు. ముంబైలోని ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ (ఎన్‌ఐటీఐఈ) నుండి ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమాను పొందారు.