translateexpand_more

Cm Dk Shivakumar News

Latest updates from Telugu Digital news sources.

Samayam Telugu03 Jun, 12:08 pm
జైలు నుంచి కర్ణాటక ముఖ్యమంత్రి పదవి వరకు.. డీకే శివకుమార్ ప్రస్థానం ఇదే

‘రాష్ట్రానికి కొత్త సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తోంది నేను కాదు. ఓ సామాన్య కార్యకర్త’ అంటూ ప్రకటించిన డీకే శివకుమార్ ‌.. తన చిరకాల స్వప్నాన్ని బుధవారం సాకారం చేసుకున్నారు. 2023 ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్‌ పార్టీ.. మూడేళ్ల తర్వాత సిద్ధరామయ్యను సాదరంగా సాగనంపి, డీకేకు అవకాశం కల్పించింది. పార్టీ సంక్షోభంలో ఉన్న ప్రతిసారీ అండగా నిలిచి ట్రబుల్ షూటర్‌గా గుర్తింపు పొందిన డీకే శివకుమార్.. అధిష్ఠానానికి నమ్మినబంటు. చివరకు ఆయన కల నెరవేరింది. చిన్నవయసులో కాంగ్రెస్ నుంచి ప్రస్థానం ప్రారంభించిన డీకే.. ఈ ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. మనీల్యాండరింగ్ ఆరోపణలపై 2019లో అరెస్ట్ అయి 50 రోజుల జైల్లో ఉన్నారు. శివకుమార్ వ్యక్తిగత విషయాలకు వస్తే.. 1962 మే 15న కనకపురలో జన్మించారు. 80వ దశకంలో విద్యార్థి నాయకుడిగా 18 ఏళ్లకే రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్‌ఎస్‌యూఐలో చేరి, 1981-83 మధ్య బెంగళూరు జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. తర్వాత యూత్ కాంగ్రెస్‌లోకి వచ్చి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టారు. డీకే తన రాజకీయ ప్రయాణంలో ఎప్పుడు రిస్క్‌లకు వెనుకాడలేదు. తన 23వ ఏట.. 1985 ఎన్నికల్లో సతానూర్ నుంచి మాజీ ప్రధాని హెచ్‌డీ దెవెగౌడపై కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి 15 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే, 1989 ఎన్నికల్లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. 27 ఏళ్లకే మంత్రి పదవి చేపట్టారు. ఎస్ బంగారప్ప క్యాబినెట్‌లో ఆయనకు రాజీవ్ గాంధీ చోటుకల్పించారు. వరుసగా 8 సార్లు అసెంబ్లీకి ఎన్నికై డీకే.. వొక్కలిగ సామాజిక వర్గంలో తిరుగులేని నేతగా ఎదిగారు. తర్వాత 1999లో ఎస్ఎం కృష్ణ క్యాబినెట్‌లోనూ సముచిత స్థానం దక్కింది. 2013లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో, సిద్దరామయ్య ముఖ్యమంత్రి అయ్యారు. కానీ, గ్రానైట్ అక్రమ తవ్వకాలలో శివకుమార్ ప్రమేయం ఉందన్న ఆరోపణల కారణంగా ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. సిద్దరామయ్య ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆరు నెలల తర్వాత, మంత్రి పదవిని కాంగ్రెస్ అధిష్ఠానం ఒత్తిడితో కేటాయించారు.ఆగస్టు 2017లో ఆయన, ఆయన కుటుంబ సభ్యులకు, వ్యాపార భాగస్వాములకు చెందిన ఆస్తులపై ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించింది. శివకుమార్‌పై రూ. 34 కోట్ల మేర పన్ను ఎగవేత ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై సీబీఐ 2020లో కేసు నమోదుచేసింది. ఇక, మనీల్యాండరింగ్ కేసులో డీకేను ఈడీ సెప్టెంబరు 2019లో అరెస్ట్ చేసి తీహార్ జైలుకు తరలించింది. ఈ కేసులో 50 రోజుల తర్వాత బెయిల్‌పై ఆయన విడుదలయ్యారు. ఆ మరుసటి ఏడాది కేపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 2023 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ ఘన విజయం శివకుమార్ వల్లే సాధ్యమైందని చెబుతారు. అప్పటి బీజేపీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి వ్యతిరేకంగా ఆయన చేపట్టిన ‘పేసీఎం’ ప్రచారం, ప్రభుత్వంలో ఉన్న అవినీతిపై చేసిన దాడి పార్టీకి బాగా కలిసివచ్చాయి.సిద్ధరామయ్య ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా, కర్ణాటక పీసీసీ అధ్యక్షుడిగా రెండు బాధ్యతలను సమర్ధంగా నిర్వహించి, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నించారు. ఈడీ, ఐటీ విచారణలు ఎదుర్కొని జైలుకు వెళ్లినా.. కర్ణాటక రాజకీయాల్లో ఆయన పట్టు ఏమాత్రం సడలలేదు.