translateexpand_more

Hyderabad Weather Update News

Latest updates from Telugu Digital news sources.

Asianet News Telugu03 Jun, 02:02 am
రుతుపవనాల ఎంట్రీపై ఐఎండీ అలర్ట్.. వచ్చే 4 రోజులు ఈ ప్రాాంతాాల్లో భారీ వర్షాలు

తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో అల్లాడిపోతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ అదిరిపోయే చల్లటి కబురు చెప్పింది. భానుడి భగభగలకు బ్రేక్ పడే టైం వచ్చేసింది. రానున్న 4 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వానలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హైదరాబాద్ కేంద్రం తాజా బులిటెన్‌లో వెల్లడించింది. ఆకాశంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాలు, ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నైరుతి రుతుపవనాల గమనం ప్రస్తుతం చాలా చురుగ్గా సాగుతోంది. మొన్నటివరకు కాస్త స్తబ్దుగా ఉన్న రుతుపవనాలు ఇప్పుడు స్పీడందుకున్నాయి. అరేబియా సముద్రం, బంగాళాఖాతంలోని మరిన్ని ప్రాంతాలకు ఇవి విస్తరించాయి. జూన్ 4వ తేదీ నాటికి ఇవి కేరళతో పాటు తమిళనాడు తీరాన్ని తాకేందుకు పూర్తి అనుకూల వాతావరణం ఏర్పడిందని ఐఎండీ స్పష్టం చేసింది. కేరళ, అరేబియా సముద్రంపై ఉన్న ఉపరితల ఆవర్తనం వల్ల మేఘాలు ఏకంగా 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించాయి. ఈసారి రుతుపవనాలు జూన్ 10 తర్వాత తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. రుతుపవనాల ముందస్తు ఆగమన సూచనలతో తెలంగాణకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. బుధ, గురువారాల్లో రాష్ట్రంలోని ఉత్తర, తూర్పు, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో వానల ప్రభావం చాలా ఎక్కువగా ఉండబోతోంది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలకు అధికారులు ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించారు. ఈ జిల్లాల్లో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మిగిలిన జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. మరోవైపు భాగ్యనగరవాసులకు కూడా వాతావరణ శాఖ చల్లని ముచ్చట చెప్పింది. వచ్చే శుక్రవారం వరకు హైదరాబాద్‌లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని ఐఎండీ తెలిపింది. ప్రముఖ వెదర్ అనలిస్ట్ టి. బాలాజీ అంచనా ప్రకారం.. బుధవారం సాయంత్రం లేదా రాత్రి వేళల్లో హైదరాబాద్‌లోని ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లో చెదురుమదురుగా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. నగరంలో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముంది. కొద్దిరోజుల క్రితం వరకు రాష్ట్రంలో ఎండలు రికార్డులు బ్రేక్ చేశాయి. పలుచోట్ల ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల సెల్సియస్‌ను దాటేసి జనాలను ఉక్కిరిబిక్కిరి చేశాయి. నిన్న సూర్యాపేట జిల్లా గరిడేపల్లిలో 44.8 డిగ్రీలు, నల్గొండలో 43.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే, తాజా వర్ష సూచనతో టెంపరేచర్లు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఇప్పటికే మంగళవారం రాత్రి ఖమ్మం జిల్లా ఏన్కూరులో 7.9 సెం.మీ, తల్లాడలో 6 సెం.మీ, అశ్వారావుపేటలో 4 సెం.మీ చొప్పున భారీ వర్షపాతం రికార్డైంది. రాబోయే మూడు రోజుల్లో ఎండల తీవ్రత మరింత తగ్గి వాతావరణం పూర్తిగా కూల్ కానుంది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమల్లోనూ జూన్ 3 నుంచి 6 వరకు వాతావరణం రసవత్తరంగా మారనుంది. కోస్తాంధ్రా, రాయలసీమల్లో పిడుగులు పడే ముప్పు చాలా ఎక్కువగా ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అటు బంగాళాఖాతంలో గాలుల వేగం గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వరకు ఉండటంతో మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లకూడదని స్పష్టం చేశారు.