
దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం ఉదయం ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దక్షిణ ఢిల్లీలోని మాలవ్య నగర్లో ఉన్న లెమన్ గ్రీన్ రెస్టారెంట్‌లో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగడంతో విదేశీయులతో సహా 21 మంది సజీవదహనమయ్యారు. మృతుల్లో ఎక్కువగా విదేశీయులు ఉన్నట్లు సమాచారం. మరికొంత మంది ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఈ క్రమంలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో రెస్టారెంట్ బేస్‌మెంట్‌లో చిక్కుకుపోయిన పలువురిని అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి సురక్షితంగా రక్షించారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. అగ్నిమాపక అధికారులకు అందిన సమాచారం ప్రకారం.. బుధవారం ఉదయం సుమారు 9:45 గంటల సమయంలో ఈ ప్రమాదం గురించి సమాచారం అందింది. వెంటనే స్పందించిన సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే చర్యలు ప్రారంభించారు. రెస్టారెంట్ బేస్‌మెంట్‌లో ఊపిరాడక అల్లాడుతున్న ముగ్గురిని సిబ్బంది ప్రాణాలతో రక్షించి, క్యాట్స్ అంబులెన్స్‌ల ద్వారా తక్షణమే ఆసుపత్రికి తరలించారు. ఢిల్లీ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇప్పటివరకు మొత్తం 11 మందిని ఈ ప్రమాద స్థలం నుంచి సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఈ ఘోర ప్రమాదంపై ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. బాధితులకు, వారి కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఆమె హామీ ఇచ్చారు. "మాలవ్య నగర్ అగ్నిప్రమాదంలో ఎందరో ప్రాణాలు కోల్పోవడం నన్ను తీవ్రంగా కలచివేసింది. మరణించిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను" అని సీఎం రేఖా గుప్తా పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఢిల్లీ ఫైర్ సర్వీసెస్, ఢిల్లీ పోలీస్, డీడీఎంఏ, క్యాట్స్ అంబులెన్స్ బృందాలు రంగంలోకి దిగాయని ముఖ్యమంత్రి వెల్లడించారు. వారి సత్వర స్పందన కారణంగానే బేస్‌మెంట్, ఇతర ప్రాంతాల నుంచి పలువురిని సురక్షితంగా ఖాళీ చేయించడం సాధ్యమైందని ఆమె కొనియాడారు. ఢిల్లీ ప్రభుత్వం పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోందని, బాధితులకు అవసరమైన అన్ని రకాల వైద్య సహాయాన్ని అందిస్తున్నామని స్పష్టం చేశారు. నెహ్రూ ప్లేస్ ఫైర్ స్టేషన్‌కు చెందిన డివిజనల్ ఆఫీసర్ రవీందర్ స్వయంగా ఘటనా స్థలంలోనే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అయితే ఈ భారీ ప్రమాదానికి గల అసలు కారణాలు ఇంకా తెలియరాలేదు, దీనిపై అధికారులు విచారణ జరుపుతున్నారు.