
ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక, ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలిచే గోదావరి పుష్కరాలను చరిత్రలో నిలిచిపోయే విధంగా నిర్వహించాలని చంద్రబాబు సంకల్పించారు. వచ్చే ఏడాది జరగనున్న ఈ మహా క్రతువును రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా, అత్యంత వైభవంగా నిర్వహించాలని నిర్ణయించారు. గోదావరి పుష్కరాలపై మంగళవారం (జూన్ 2) సచివాలయంలో మంత్రులు, అధికారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన ఈ ప్రతిష్టాత్మక ఉత్సవాల నిర్వహణపై దిశానిర్దేశం చేశారు. ఈ పుష్కరాలు కేవలం ఒక ఆధ్యాత్మిక వేడుకగా మాత్రమే కాకుండా, ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పే ఒక అద్భుతమైన అవకాశంగా మార్చాలన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలు ఏక తాటిపైకి వచ్చి, సమన్వయంతో పనిచేసినప్పుడే ఇంతటి భారీ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలమన్నారు. ఈ సారి జరగబోయే గోదావరి పుష్కరాలకు ఒక ప్రత్యేకమైన చారిత్రక ప్రాధాన్యత తోడుకానుంది. పుష్కరాల నాటికి ఎంతో ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసి, దానిని జాతికి అంకితం ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. పవిత్ర గోదావరి నది తీరానికి వచ్చే కోట్లాది మంది భక్తులకు, పర్యాటకులకు పోలవరం ప్రాజెక్టు ఒక అదనపు ఆధ్యాత్మిక, వినోదాత్మక ఆకర్షణగా నిలుస్తుందని ఆయన వివరించారు. ధవళేశ్వరం బ్యారేజ్ నుండి పోలవరం ప్రాజెక్టు వరకు విస్తరించి ఉన్న సుదీర్ఘమైన సుందర ప్రాంతాన్ని అఖండ గోదావరి కారిడార్ గా అద్భుతంగా అభివృద్ధి చేయాలని ఆయన ఒక సరికొత్త విజన్‌ను అధికారుల ముందుంచారు. ఈ కారిడార్ కేవలం పుష్కరాల కోసమే కాకుండా, భవిష్యత్తులో శాశ్వత పర్యాటక కేంద్రంగా విరాసిల్లేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పుష్కరాల కోసం ప్రభుత్వం కేటాయించే నిధులు, నిర్మించే మౌలిక సదుపాయాలు తాత్కాలికంగా కాకుండా, గోదావరి బేసిన్ ప్రాంతానికి శాశ్వత ఆస్తులుగా మారాలని సీఎం చంద్రబాబు అన్నారు. రహదారుల విస్తరణ, రవాణా సౌకర్యాల మెరుగుదల, ఘాట్ల శాశ్వత నిర్మాణాలు వంటి పనుల ద్వారా ఈ ప్రాంత రూపురేకలు మారిపోనున్నాయి. ముఖ్యంగా, సాంస్కృతిక రాజధానిగా పిలవబడే రాజమహేంద్రవరం నగరం, ఈ పుష్కరాల తదుపరి మౌలిక సదుపాయాల అభివృద్ధితో ఒక ప్రధాన అంతర్జాతీయ మహానగరంగా రూపాంతరం చెందుతుందని ఆయన చెప్పారు. భక్తుల రద్దీని తట్టుకునేలా నగరంలో శాశ్వత ప్రాతిపదికన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలను ఆధునీకరించాలని ఆదేశించారు. పోలవరం, ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ వంటి 6 ప్రధాన జిల్లాల పరిధిలో మొత్తం 525 పుష్కర ఘాట్లను సర్వాంగ సుందరంగా సిద్ధం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గోదావరి పుష్కరాల మహోత్సవంలో దాదాపు పది కోట్ల మంది భక్తులు పవిత్ర స్నానాలు ఆచరిస్తారని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ భారీ జనాభా ప్రవాహాన్ని నియంత్రించడానికి, భక్తుల భద్రత, సౌకర్యార్థం రోడ్డు, రైల్వే ట్రాఫిక్ యాజమాన్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సీఎం ఆదేశించారు. గందరగోళం లేకుండా ఉండేందుకు ప్రతి పుష్కర ఘాట్‌కు క్రమపద్ధతిలో నిర్దిష్టమైన నంబర్లను కేటాయించాలని ఆదేశించారు. దేశం నలుమూలల నుండి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాలని, అలాగే కేంద్ర ప్రభుత్వం నుండి అవసరమైన ఆర్థిక సహాయాన్ని కోరుతూ.. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు ప్రత్యేకంగా లేఖ రాయాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇప్పటికే క్షేత్రస్థాయిలో పర్యటించి చేసిన సిఫార్సులు, సూచనలను ఈ మాస్టర్ ప్లాన్‌లో చేర్చాలని సీఎం స్పష్టం చేశారు. ఈ భారీ ప్రాజెక్టుకు సంబంధించి జూన్ 24 కల్లా పూర్తి స్థాయి సమగ్ర కార్యాచరణ ప్రణాళికను తన ముందు ఉంచాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అదే రోజు ప్రణాళికను ఆమోదించి, 2027 గోదావరి పుష్కరాలకు అధికారికంగా కౌంట్‌డౌన్ ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఇటలీలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులు