
ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదివారం తన సెలవు దినాన్ని వినూత్నంగా గడిపారు. రాజకీయాలతో నిత్యం బిజీగా ఉండే ఆయన, కాస్త విరామం దొరకడంతో తన సొంతూరులో రైతుగా మారిపోయారు. వ్యవసాయ పనుల్లో పాల్గొని, క్షేత్రస్థాయిలో పనులను పర్యవేక్షించారు.ఆదివారం తెల్లవారుజామున పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నుంచి సైకిల్‌పై బయలుదేరిన రామానాయుడు, 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన సొంతూరు అగర్తిపాలెం చేరుకున్నారు. అక్కడ తన రొయ్యల చెరువులో మేత వేసి, రొయ్యల ఎదుగుదలను పరిశీలించారు. అనంతరం వరి పొలంలోకి దిగి, ట్రాక్టర్‌తో స్వయంగా దుక్కి దున్నారు. కూలీలతో మాట్లాడారు. ఆ తర్వాత, గ్రామస్థులతో కలిసి శ్రమదానంతో అభివృద్ధి చేస్తున్న హిందూ శ్మశానవాటిక పనుల పురోగతిని సమీక్షించారు.తిరిగి పాలకొల్లుకు సైకిల్‌పై పయనం అవుతుండగా, రోడ్డు పక్కన వేస్తున్న జలజీవన్ మిషన్ పైపులైన్‌ను గమనించారు. భవిష్యత్తులో మరమ్మతుల కోసం కొత్తగా మంజూరైన సిమెంట్ రోడ్డును తవ్వాల్సిన అవసరం రాకుండా, పైప్‌లైన్‌ను పక్కగా వేయాలని ఆర్అండ్బీ అధికారులను అక్కడికక్కడే ఆదేశించారు.ఈ పర్యటన వివరాలను ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు. "సెలవు రోజున కొద్దిపాటి సమయం దొరకడంతో సొంత వ్యవసాయ పనుల్లో పాల్గొనడం ఎంతో సంతృప్తి, ఆనందం కలిగించింది" అని ఆయన పేర్కొన్నారు.