
Singer Sunitha:తెలుగు సినీ సంగీత ప్రపంచంలో తన మధుర గాత్రంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గాయని సునీత తాజాగా తన కెరీర్, సంగీత రంగంలో వచ్చిన మార్పులు, సోషల్ మీడియా ప్రభావం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మూడు దశాబ్దాలుగా సంగీత ప్రయాణం కొనసాగిస్తున్న ఆమె ప్రస్తుతం కొత్త కాన్సర్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సునీత మాట్లాడుతూ, "టైమ్‌లెస్ విత్ సునీత ఉపద్రష్ట" పేరుతో ప్రత్యేక సంగీత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాత, కొత్త తరాల ప్రేక్షకులను ఆకట్టుకునే పాటలను ఎంపిక చేశామని చెప్పారు. "మాయాబజార్", "మిస్సమ్మ" వంటి క్లాసిక్ చిత్రాల పాటలతో పాటు "గోదావరి" వంటి తనకు ఇష్టమైన సినిమాలకు సంబంధించిన ప్రత్యేక భాగాలను కూడా సిద్ధం చేశామని పేర్కొన్నారు. సంగీత రంగంలో వచ్చిన మార్పుల గురించి మాట్లాడుతూ, "పాటల్లో లోతు తగ్గిందనే భావన కలుగుతోంది. ఒకప్పుడు పాటల సాహిత్యం గురించి గంటల తరబడి మాట్లాడుకునే పరిస్థితి ఉండేది. ఇప్పుడు అలాంటి అవకాశాలు తగ్గాయి" అన్నారు. అయితే ఇప్పటికీ మంచి పాటలు వస్తున్నాయని, "సీతారామం", "మహానటి", "ఉప్పెన" వంటి చిత్రాలు అందుకు ఉదాహరణ అని చెప్పారు. ఏఐ ప్రభావంపై కూడా ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. "భవిష్యత్తులో సంగీతాన్ని ఏఐ ఆక్రమిస్తుందేమోనని కొన్నిసార్లు భయపడుతుంటాను. మార్పు సహజమే అయినా దాన్ని పూర్తిగా అంగీకరించడం అంత సులభం కాదు" అని అన్నారు. సాహిత్యాన్ని ప్రేమించే వ్యక్తిగా సంగీతంలో భావోద్వేగాలు తగ్గిపోవడం బాధ కలిగిస్తోందని తెలిపారు. తన విజయ రహస్యం గురించి మాట్లాడుతూ, "నన్ను ఇంతకాలం నిలబెట్టింది క్రమశిక్షణ. వచ్చిన అవకాశాన్ని ఎప్పుడూ తేలికగా తీసుకోలేదు. ప్రయత్నంలో లోపం ఉండకూడదనే ఆలోచనతోనే ముందుకు వచ్చాను" అని చెప్పారు. సోషల్ మీడియా విమర్శల గురించి స్పందిస్తూ సోషల్ మీడియా విమర్శల గురించి స్పందిస్తూ సునీత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "ఎవరేమన్నా ఇప్పుడు పెద్దగా పట్టించుకోను. ఒకళ్లింట్లో కూరలో ఉప్పు ఎక్కువైనా ‘సునీత ఏంటి ఇలా చేసింది’ అని మాట్లాడే రోజులివి. అది వాళ్ల ఆలోచనా విధానం తప్ప నా సమస్య కాదు" అన్నారు. ఇంకా ఆమె మాట్లాడుతూ, "నేనూ విమర్శల వల్ల బాధపడ్డ రోజులు ఉన్నాయి. ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ కాలక్రమేణా వాటిని ఎదుర్కోవడం నేర్చుకున్నాను" అని చెప్పారు. మహిళలపై సమాజం చూపే వైఖరి గురించి కూడా ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. "విజయవంతమైన మహిళను అర్థం చేసుకునే మనస్తత్వం ఇంకా చాలామందిలో లేదు. ఒక మహిళ కష్టపడి ఎదిగినా దానిపై అనవసర వ్యాఖ్యలు చేసే వారు ఉంటారు" అని అన్నారు. మూడు వేలకుపైగా పాటలు పాడిన సునీత ప్రస్తుతం లక్ష్యాల కంటే ప్రశాంతమైన జీవితానికే ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. "ఆరోగ్యంగా, ఆనందంగా, ప్రశాంతంగా జీవించడమే ఇప్పుడు నా ముఖ్యమైన సంకల్పం" అని తెలిపారు. Singer Sunitha:తెలుగు సినీ సంగీత ప్రపంచంలో తన మధుర గాత్రంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గాయని సునీత తాజాగా తన కెరీర్, సంగీత రంగంలో వచ్చిన మార్పులు, సోషల్ మీడియా ప్రభావం...