
విద్యార్థి దశలో లతా మంగేష్కర్‌కు వీరాభిమాని అయిన ఆ యువతి తర్వాతి రోజుల్లో లతాతో సాటిగా పాటలు పాడతానని, ఒక దశలో సినీ పరిశ్రమ లతాకు ప్రత్యామ్నాయంగా తనను చూస్తుందని కలలో కూడా ఊహించి ఉండదు. ఆమె మరెవరో కాదు.. దిగ్గజ నేపథ్య గాయని, పద్మ భూషణ్ అవార్డు గ్రహీత సుమన్ కల్యాణ్‌పుర్(89). ఆమె ఇక లేరు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఆదివారం ముంబయిలో కన్నుమూశారు. 1954 నుంచి 1988 వరకు మూడు దశాబ్దాల కెరీర్లో హిందీ, మరాఠీ, బెంగాలీ సహా వివిధ భాషల్లో ఆమె వందలాది పాటలు పాడారు. బ్రిటిష్ ఇండియాలోని ఢాకాలో 1937లో పుట్టారు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగి అయిన తండ్రి కర్ణాటకలోని ఉడిపి జిల్లావాసి. 1943లో వీరి కుటుంబం బొంబాయికి మారింది. అక్కడే సుమన్ సంగీత శిక్షణ పొందారు. వ్యాపారవేత్త రామానంద్ కల్యాణ్ పుర్తో వివాహమయ్యాక ఆమె సుమన్ కల్యాణ్ పుర్ అయ్యారు. షమ్మీకపూర్ నటించిన ‘బ్రహ్మచారి’ (1968) చిత్రంలోని ‘ఆజ్ కల్ తేరె మేరే ప్యార్ కే చర్చే హర్ జుబాన్ పర్...’ పాట ఆ రోజుల్లో మంచి హిట్ అయింది. రఫీతో కలిసి సుమన్ పాడిన ఈ పాట వింటే అచ్చం లతా పాడినట్టే ఉంటుంది. ఇదొక్కటేనా.. చాలా పాటలు అలాగే ఉంటాయి. అందుకే ఆర్థికంగా లతాను భరించలేని చిన్న నిర్మాతలకు ఆమె వరం అయ్యారు. ‘నా తుమ్ హమే జానో’ (బాత్ ఏక్ రాత్ కీ), ‘తుమ్నే పుకారా ఔర్ హమ్ చలే ఆయే’ (రాజ్ కుమార్), ‘దిల్ ఏక్ మందిర్’ చిత్రంలోని టైటిల్ పాట, ‘మేరా ప్యార్ భీ తూ హై’ (సాథీ), ‘పర్బతోకే పేడో పర్...’ (శగూన్), ‘బెహ్నా నే భాయీకీ కలాయీ సే’ (రేషమ్ కీ డోర్), ‘మేరే మెహబూబ్ నా జా..’ (నూర్ మహల్), ‘జిందగీ ఇంతిహాన్ లేతీ హై’ (నసీబ్) లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్ పాటలు ఆమె ఖాతాలో ఉన్నాయి. 1954లో విడుదలైన ‘మంగు’ చిత్ర గీతంతో సుమన్ నేపథ్య గాయనిగా పరిచయమయ్యారు. అదే ఏడాది నౌషాద్ సంగీతం సమకూర్చిన ‘దర్వాజా’లో అయిదు పాటలు పాడి పాపులర్ అయ్యారు. ఆ కాలపు సంగీత దర్శకులు ఎస్.డి.బర్మన్ నుంచి లక్ష్మీకాంత్ ప్యారేలాల్ దాకా దాదాపు అందరి చిత్రాల్లో పాడారు. నౌషాద్, కల్యాణ్ జీ ఆమెను బాగా ప్రోత్సహించారు. గాయకులకు సైతం పాటల రాయల్టీ చెల్లించాలని పోరాడిన లతా తనతో విభేదించిన రఫీతో 1960లలో కొంత కాలం కలిసి పాడలేదు. ఈ సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్న సుమన్ ఒక్క రఫీతోనే ఏకంగా 140పైగా డ్యూయెట్ పాటలు పాడారు. నాకు వచ్చిన అవకాశాలతో నేను సంతృప్తిగా ఉన్నా. నా స్వరం లతా దీదీ గొంతులా ఉందంటే దానికి నేనేం చేయను! అనేవారామె. చివరిదశలో ముంబయి శివారులోని లోఖండ్ వాలా ఇంటిలో తన పాటలు వింటూ ప్రశాంతంగా రోజులు గడిపారు. సుమన్ కల్యాణ్‌పుర్ మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతాపం వ్యక్తం చేస్తూ పోస్ట్ పెట్టారు. ‘‘భారతీయ సంగీతాన్ని సుసంపన్నం చేసిన సుమన్ మరణం భారతీయ కళా ప్రపంచానికి తీరని లోటు. ఆమె హిందీ, మరాఠీ భాషలతో పాటు అనేక భారతీయ భాషల్లో తన మధురమైన గానంతో శ్రోతలను మంత్రముగ్ధులను చేశారు. ఆమె కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నాను’’ అని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు ముర్ము. ప్రధాని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమాల ద్వారా స్పందిస్తూ ‘‘ప్రముఖ గాయని సుమన్ కల్యాణ్‌పుర్ మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. ఆమె మధురమైన గానంతో మన సాంస్కృతిక ప్రపంచాన్ని సుసంపన్నం చేశారు. ఆమె కుటుంబ సభ్యులు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి’’ అని పోస్ట్ చేశారు. సోమవారం ముంబయిలో మహారాష్ట్ర ప్రభుత్వ లాంఛనాల మధ్య సుమన్ కుమార్తె చారుల్ అంత్యక్రియల్ని పూర్తి చేశారు. ఈ సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై నివాళులర్పించారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in © 1999 - 2026 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved. Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted. This website follows the