IPS Arun Bothra Warning : విదేశీ పర్యటనల్లో కొందరు భారతీయ పర్యాటకులు ప్రవర్తిస్తున్న తీరు, తద్వారా అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ట దెబ్బతినడంపై సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. విదేశాల్లో భారతీయుల అనుచిత ప్రవర్తన కారణంగా భవిష్యత్తులో భారతీయ పౌరులందరికీ వీసా నిబంధనలు మరింత కఠినమయ్యే ప్రమాదం ఉందంటూ ఒడిశాకు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి అరుణ్ బోత్రా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట సంచలనంగా మారాయి. ఎక్స్ వేదికగా ఆయన పంచుకున్న అభిప్రాయాలు ఇంటర్నెట్ యూజర్లలో పెద్ద చర్చకు దారితీశాయి.పాస్‌పోర్ట్ అనేది కేవలం హక్కు కాదు ఒక బాధ్యతంటూ..!ప్రస్తుతం ఒడిశాలో సీఐడీ క్రైమ్ అదనపు డీజీపీగా, రవాణా శాఖ కమిషనర్‌గా సేవలు అందిస్తున్న అరుణ్ బోత్రా.. విదేశీ ప్రయాణాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. "భారతీయ పాస్‌పోర్ట్‌ను కలిగి ఉండటం అనేది కేవలం ఒక హక్కు మాత్రమే కాదు. దానికితోడు విదేశాల్లోని స్థానిక చట్టాలను గౌరవించడం, బహిరంగ ప్రదేశాల్లో పద్ధతిగా ప్రవర్తించడం, దేశ గౌరవాన్ని కాపాడటం వంటి బాధ్యతలు కూడా దాగి ఉన్నాయి" అని ఆయన స్పష్టం చేశారు. విదేశాల్లో దేశ ప్రతిష్టకు భంగం కలిగించేలా ప్రవర్తించే వ్యక్తులు తగిన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని వాదించారు. తీవ్రమైన కేసుల్లో ఇలాంటి వారికి బుద్ధి చెప్పడానికి, ఇతరులకు ఇదొక హెచ్చరికగా మారడానికి కొన్ని సంవత్సరాల పాటు విదేశీ ప్రయాణాలపై తాత్కాలిక ఆంక్షలు విధించడాన్ని కూడా పరిశీలించవచ్చని ఆయన ప్రతిపాదించారు.రీల్స్ పిచ్చి.. కఠినమౌతున్న వీసా నిబంధనలు..విదేశీయులు మన గురించి ఏమనుకుంటారనే దానికంటే, కొందరి అనాగరిక ప్రవర్తన వల్ల సాధారణ భారతీయ పౌరులందరికీ వీసా నిబంధనలు కఠినతరం కావడంపైనే తనకు ఎక్కువ ఆందోళన ఉందని అరుణ్ బోత్రా స్పష్టం చేశారు. ఇందుకు థాయ్‌లాండ్‌ను ఆయన ఒక తాజా ఉదాహరణగా పేర్కొన్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా కంటెంట్ లేదా రీల్స్ కోసం విదేశాల్లోని పబ్లిక్ ప్లేసుల్లో వింత వింత చేష్టలు చేయడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. "విదేశాల్లోని సూపర్ మార్కెట్లలో మనల్ని చూసి అక్కడి స్థానికులు భయపడకూడదు.. మనలో ఎవరు ఎప్పుడు అకస్మాత్తుగా రీల్స్ కోసం డ్యాన్స్ చేయడం మొదలు పెడతారో అని వారు కంగారుపడే పరిస్థితి రాకూడదు" అని ఆయన వ్యాఖ్యానించారు. నెటిజన్లలో మిశ్రమ స్పందన..!ఐపీఎస్ అధికారి చేసిన ఈ వ్యాఖ్యలపై నెటిజన్ల నుంచి భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. అరుణ్ బోత్రా వ్యాఖ్యలను సమర్థిస్తూ ఒక యూజర్.. తాము బ్యాంకాక్ వెళ్లినప్పుడు కొందరు భారతీయులు అర్ధరాత్రి పూట మద్యం తాగి గొడవ చేయడం, పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ పక్కవారి ప్రశాంతతను పాడుచేయడం వంటివి చూశామని రాసుకొచ్చారు. మరో నెటిజన్ స్పందిస్తూ.. దశాబ్దం క్రితం భారతీయుల డ్రైవింగ్ లైసెన్సులు, విద్యా అర్హతలను విదేశాలు ఎంతగానో నమ్మేవని, కానీ ఇప్పుడు కొందరి ప్రవర్తన వల్ల ఆ నమ్మకం సడలిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.అయితే ఈ వ్యాఖ్యలతో కొందరు విభేదించారు. వీసా నిబంధనలు కేవలం భారతీయులకే కాదు, అన్ని దేశాల వారికి మారుతుంటాయని ఒక యూజర్ పేర్కొన్నారు. అంతర్జాతీయ రాజకీయాల్లో ఏ దేశమైనా పర్యాటకుల సివిక్ సెన్స్‌ను కాకుండా.. వారి బ్యాంక్ బ్యాలెన్స్, ఉద్యోగ ఆధారాలను మాత్రమే చూస్తుందని, కాబట్టి ఇలాంటి కొన్ని సంఘటనలను బట్టి అందరినీ అంచనా వేయలేమని వాదించారు. మరి ఐపీఎస్ అధికారి చేసిన కామెంట్లపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. IPS Arun Bothra Warning : విదేశీ పర్యటనల్లో కొందరు భారతీయ పర్యాటకులు ప్రవర్తిస్తున్న తీరు, తద్వారా అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ట దెబ్బతినడంపై సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు ఒక...