
హైదరాబాద్: తెలంగాణపై తనకు ఎంతో ప్రేమ ఉందని, అది రాజకీయాలకు అతీతమైందని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. తెలంగాణ ప్రజలు తనకు ఎన్నోసార్లు అండగా నిలిచారన్నారు. తెలంగాణ ప్రజలందరికీ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. తనను బెదిరించిన వారికి హెచ్చరికలు జారీ చేశారు. ‘‘ఈ మధ్యన కొందరు నన్ను హైదరాబాద్‌లో ఎలా అడుగు పెడతావ్.. ఇక్కడ నీకేం పని అని అడుగుతున్నారు. అసలు మీరెవరయ్యా నన్ను బెదిరించడానికి..? బెదిరించే వాళ్ల అయ్య జాగీరా.. తెలంగాణ. మీ ఇష్టానికి మాట్లాడితే నేను భయపడాలా? నాపై దాడులు చేస్తామంటున్నారు కదా.. అందుకే నా అడ్రస్ తెలియాలనే ఇంటి వద్ద ప్రెస్‌మీట్ పెట్టా. నాకు తెలంగాణలో బెదిరింపుల కన్నా ఆంధ్రాలోనే బెదిరింపులు ఎక్కువ. తెలంగాణ యువతకు అద్భుతమైన అవకాశాలు రావాలని కోరుకొనే వ్యక్తిని నేను. ఆంధ్రాలో నన్ను తిరగనివ్వం అంటే వారాహి అనుమతి ఇచ్చింది తెలంగాణ ప్రజలే. నాకు ఎన్నో ఏళ్లుగా తెలంగాణ ప్రజలు అండగా నిలిచారు. జనసేనను తెలంగాణ నడిబొడ్డున ఏర్పాటు చేశాం’’ ‘‘తెలంగాణలో పార్టీ బలోపేతం చేయాలని మా నేతలు చాలా సార్లు అడిగారు. ఆంధ్రాలోనే అధికారం కోరుకోని వాడిని. తెలంగాణలో అధికారం ఎందుకు కోరుతాను. నాకు అధికారంపై ప్రేమకాదు.. మార్పుపైనే ప్రేమ. తెలంగాణ ప్రజలకు ఆంధ్రాపై విద్వేషం లేదు. తెలంగాణ ప్రజలు ద్వేషం పెంచుకుంటే ఒక్క ఏపీ వ్యక్తి కూడా ఇక్కడ ఉండేవారు కాదు. తెలంగాణ నలుమూలల నుంచి తిరిగిన వ్యక్తిని.. ఇప్పుడు నన్ను విమర్శించేవాళ్లు ఆదిలాబాద్ అడవుల్లో తిరగలేదు.. నేను తిరిగాను’’ ‘‘నేను తెలంగాణకు వ్యతిరేకిని కాదు.. విభజించిన తీరుకు మాత్రమే వ్యతిరేకిని. సామాజిక తెలంగాణ రావాలని చెప్పి మరీ వచ్చాను. పార్లమెంటు తలుపులు మూసి విభజించిన తీరు తప్పని చెప్పా. తెలంగాణ వ్యతిరేకం అని వైఎస్ చెప్పినా, ఆయనకు ఊడిగం చేశారు. బెదిరింపులకు లొంగిపోయేవాడిని కాదు.. నేను ఇప్పటివరకు ఒక్క తెలంగాణ నాయుకుడిని కూడా ఒక్క మాట అనలేదు. నాకు రెచ్చగొట్టడం ఇష్టంలేదు.. ఎన్నోసార్లు తగ్గి ఉన్నా. గద్దర్ బతికున్న రోజుల్లో మీరంతా ఎక్కడ ఉన్నారు? గద్దర్ వచ్చి తనకు బండి కొనివ్వాలంటే రెండు రోజుల్లో కొనిచ్చాను. గద్దర్ బతికి ఉన్న రోజుల్లో ఆయనకు మీరు ఏం చేశారు?ఒక విశ్లేషకుడి వ్యాఖ్యల వల్ల గొడవ మొదలైంది. ఆ విశ్లేషకుడిపై కేసులు పెట్టిన విషయం నాకు మొదట్లో తెలియదు. నాకు తెలిశాక కేసులు వద్దు వదిలేయమని చెప్పా. ఆ తర్వాత ప్రెస్‌క్లబ్‌లో ప్రెస్మీట్లు పెట్టి నన్ను తిట్టారు. తెలంగాణలో ప్రతి సమస్యకు ఆంధ్రావారే కారణమా’’ ‘‘ప్రత్యేక తెలంగాణ కోరుకున్న మర్రి చెన్నారెడ్డి వల్లే సినీ ఇండస్ట్రీ చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చింది. తెలుగు ప్రజలు 50 ఏళ్లు కలిసి ఉన్న రాజధాని.. హైదరాబాద్. తెలంగాణకు అన్యాయం చేసిన పాలకులను ఉరితీసినా ఫర్వాలేదు. పాలకులు వేరు.. ప్రజలు వేరు.. పాలకులను తిట్టండి.. ప్రజలను కాదు. దేశంలో ఎన్నో ప్రాంతాల్లో తెలుగువారు ఉన్నారు. అక్కడకి ప్రజలు మన తెలుగు ప్రజల్ని పంపిస్తే మన పరిస్థితి ఏమిటి? నేను చెరువును ఆక్రమించుకున్నాననే ఆరోపణలు చేస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి గారికి చెబుతున్నా.. ఒకవేళ నేను కబ్జా చేశానని నిరూపణ అయితే, స్వాధీనం చేసుకోండి. కేసీఆర్ బీఆర్ఎస్ పెట్టి.. ఏపీకి వచ్చినప్పుడు స్వాగతించా. జనసేన మాజీ నేతలను బీఆర్ఎస్లోకి తీసుకున్నా స్వాగతించా. కేవలం 2వేల మందితో సభ పెట్టుకుంటామంటే అనుమతి ఇవ్వరా? విశ్లేషకులు ఇష్టానుసారం మాట్లాడినా మా అభిప్రాయం చెప్పకూడదా? ఇలాంటి విశ్లేషకుల వల్లే కమ్యూనిజం చచ్చిపోయింది’’ ‘‘ఇప్పటి వరకు నిర్ణయించుకోలేదు. మీరు అంటున్నారు గనక చెబుతున్నా. తెలంగాణలో జనసేన ఉంటుంది. మేం ఇక్కడ పోటీ చేస్తాం. అవసరమైతే తెలంగాణలో నేనే తిరుగుతాను. మేమే తిరుగుతాం. ప్రతి సమస్య మీద మాట్లాడతాం. ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటాం. నా తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం. మీరు బెదిరిస్తే భయపడం. తెలంగాణను వ్యతిరేకించిన వారే పదవుల్లో కూర్చొన్నారు. వ్యతిరేకించినవారే ఎమ్మెల్యేలు అయ్యారు’’ అని పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in © 1999 - 2026 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved. Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is