
అతడి అమ్ముల పొదిలో యార్కర్లు.. బ్రహ్మాస్త్రాలు! అతడు సంధించే బౌన్సర్లు.. దూసుకొచ్చే ఫిరంగి గుండ్లు! అతడి బంతుల్లో వేగం.. క్షిపణులకు సరిసమానం! అతడి బౌలింగ్ శైలి వినూత్నం.. బ్యాటర్లకు శరాఘాతం.. మీకు ఈ పాటికే అర్థమై ఉంటుం... మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది. ఈ ఉపోద్ఘాతమంతా బూమ్.. బూమ్.. బుమ్రా గురించే అని. కానీ అతడు ఎందుకో ఐపీఎల్ 2026లో వెనకబడ్డాడు. బౌలింగ్‌లో ఎకానమీ బాగున్నా.. బ్యాటర్లతో అమీతుమీ తేల్చుకోలేకపోయాడు. వికెట్ల వేటలో తేలిపోయాడు. అయితే అతడి బౌలింగ్‌లో మాత్రం పదును తగ్గలేదు! ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో బుమ్రా.. ముంబయి ఇండియన్స్ తరఫున 13 మ్యాచుల్లో బరిలోకి దిగాడు. అతడు 8.37 ఎకానమీతో 294 పరుగులిచ్చాడు. పొట్టి ఫార్మాట్లో ఈ ఎకానమీ మరీ అంత తీసికట్టేమీ కాదు. కానీ.. బుమ్రా కేవలం 4 వికెట్లు మాత్రమే తన ఖాతాలో వేసుకున్నాడు. అలాగే ఏ ఒక్క మ్యాచ్‌లోనూ రెండు వికెట్ల మార్క్‌ను అందుకోలేకపోయాడు. దీంతో అతడి బౌలింగ్ యావరేజ్ 102.50గా నమోదైంది. ఒక టీ20 టోర్నమెంట్లో తీసిన ప్రతి వికెట్‌కూ సగటున 100 కంటే ఎక్కువ పరుగులు ఇచ్చిన మొట్టమొదటి బౌలర్‌గా అవాంఛిత రికార్డును సొంతం చేసుకున్నాడు. బుమ్రా ఈ సీజన్లో 240 లీగల్ బంతులు సంధించాడు. ఇన్ని బంతులు అతడు వేశాడంటే.. అతడు టీమ్‌కు ఎంత ప్రధాన బౌలరో అర్థమవుతుంది. అన్ని మ్యాచుల్లోనూ అతడు తన పూర్తి కోటా ఓవర్లు వేశాడు. అయినప్పటికీ ఎందుకో అతడు వికెట్లు కూల్చడంలో చాలా వెనకబడ్డాడు. అయితే వికెట్లు తీయనంత మాత్రాన బుమ్రా విఫలమైనట్లు కాదని క్రికెట్ పండితులు విశ్లేషిస్తున్నారు. ‘ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన బౌలర్‌గా పేరొందిన బుమ్రా బౌలింగ్‌లో రిస్క్ చేసే సాహసాన్ని బ్యాటర్లు చేయలేదు. దీంతో వారు బుమ్రాను ఆచితూచి ఎదుర్కొన్నారు. అద్భుతమైన బంతులను గౌరవించారు. ఎక్కువగా 1, 2 పరుగులతో స్ట్రైక్‌రొటేట్ చేశారు. ఇలా ప్రత్యర్థి బ్యాటర్లు వారి వారి వ్యూహాల్లో భాగంగానే బుమ్రాపై ఎదురుదాడికి దిగలేదు. దీంతో వారు తమ వికెట్లను కాపాడుకుంటూ ఆత్మరక్షణ మోడ్‌లో ఆడారు. అందుకే బుమ్రాకు ఎక్కువగా వికెట్లు చిక్కలేదు’ అని అంటున్నారు. ఇదే సమయంలో మిగతా బౌలర్లు బ్యాటర్లకు ధారాళంగా పరుగులు సమర్పించారు. బుమ్రా మాత్రం బ్యాటర్ల పరుగుల ప్రవాహానికి ఆనకట్ట కట్టాడు. మిగతా బౌలర్లకు, అతడికున్న ప్రధాన వ్యత్యాసం ఇదే. ఒక బౌలర్ నాలుగు ఓవర్ల స్పెల్‌లో వికెట్ తీయకుండా, 25 నుంచి 30 పరుగులు ఇచ్చినప్పుడు పొట్టి ఫార్మాట్లో అది మంచి ప్రదర్శన కిందే లెక్క. కానీ ఇలాంటి ప్రదర్శనలు ఓవరాల్‌గా టోర్నమెంట్లో గణాంకాలను ప్రభావితం చేస్తాయి. దీంతో బుమ్రా యావరేజ్ 102.50గా నమోదైంది. అందుకే బుమ్రా విషయంలో చూడాల్సింది గణాంకాలు కాదు.. ఘనమైన బౌలింగ్‌ను.. అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సీజన్లో బుమ్రా ఎక్కువగా వికెట్లు తీయలేకపోయినా.. ప్రతి బంతిలోనూ తన బెస్ట్ ఇచ్చాడని అభిమానులూ అతడికి మద్దతుగా నిలుస్తున్నారు. సందేహం వద్దు అతడు ఇప్పటికీ బూమ్.. బూమ్.. బుమ్రానే అంటున్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.