
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరలు పెంచడమే తప్ప పంటలను కొనుగోలు చేయడం లేదని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) విమర్శించారు. కనీసం 30 శాతం కూడా సేకరించడం లేదన్నారు. రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి గింజా కొ... హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరలు పెంచడమే తప్ప పంటలను కొనుగోలు చేయడం లేదని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) విమర్శించారు. కనీసం 30 శాతం కూడా సేకరించడం లేదన్నారు. రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి గింజా కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర సచివాలయంలో సీపీఎం, సీపీఐ బృందాలు వేర్వేరుగా సీఎంతో సమావేశమయ్యాయి. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు నేతృత్వంలో ఆయా పార్టీల నేతలు సీఎం రేవంత్‌తో భేటీ అయ్యారు. సుదీర్ఘ కాలం పెండింగ్‌లో ఉన్న కార్మికుల కనీస వేతనాల పెంపు నిర్ణయం తీసుకోవడంపై నేతలు సీఎం రేవంత్‌కు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు, మూసీ ప్రక్షాళన, విద్యారంగ అంశాలపైనా వారి మధ్య చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కారణంగా హమాలీలు వారి స్వస్థలాలకు వెళ్లడంతో ఇక్కడ కొరత ఏర్పడిందన్నారు. మరోవైపు ఎండల తీవ్రత కారణంగా మధ్యాహ్నం సమయంలో పని జరగడం లేదని చెప్పారు. ధాన్యం కొనుగోళ్లపై నిరంతరం సమీక్షిస్తున్నట్లు తెలిపారు. సన్నవడ్లకు రూ.500 బోనస్ ఇచ్చి.. మొక్కజొన్నను మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. మూసీ నిర్వాసితులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, స్థానికంగానే నివాసాలు మంజూరు చేస్తామని సీఎం స్పష్టం చేశారు. ఈ విషయంలో పార్టీలు రాజకీయం చేయడం తగదన్నారు. మూసీ పునరుజ్జీవం చేసి అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. మూసీ కాలుష్యం నల్గొండ జిల్లా ప్రజలకు జీవన్మరణ సమస్యగా మారిందని, అక్కడ ఎదురవుతున్న పరిస్థితులను వివరించారు. ప్రభుత్వ విద్యను ప్రక్షాళన చేస్తున్నామని సీఎం చెప్పారు. విద్యా రంగంలో చేపడుతున్న కార్యక్రమాలను ఈ సందర్భంగా వారికి వివరించారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌ను ఏర్పాటు చేస్తున్నామని చెబుతూ.. రంగారెడ్డి జిల్లా ఆరుట్ల పాఠశాలను ఒకసారి సందర్శించాలని సీపీఎం నేతలను రేవంత్ కోరారు. నాణ్యమైన విద్య అందించే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని.. దానిలో భాగంగా విద్యార్థులకు నాణ్యమైన బ్రేక్‌ఫాస్ట్, భోజనం అందిస్తున్నామని తెలిపారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.