
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందానికి మధ్యవర్తిత్వం వహిస్తున్నామంటూ గొప్పలు చెబుతోన్న పాక్ పరిస్థితి ట్రంప్ (Donald Trump) ప్రతిపాదనతో ఇప్పుడు కుడితిలో పడిన ఎలుకలా మారింది. ఈ శాంతి ఒప్పందానికి ‘అబ్రహం అకార్డ్స్ (Abraham Accords)’ మెలికపెట్టిన అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్.. అందులోకి పాక్‌ను ఆహ్వానించారు. దీంతో మన దాయాది పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది. పైగా ఇందుకు సంబంధించిన పోస్ట్‌లో పాకిస్థాన్ (Pakistan) ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ను ప్రస్తావించకపోవడం ఆ దేశానికి మరింత అవమానకరం. అసలేం జరిగిందంటే.. ఇరాన్‌తో శాంతి చర్చలకు (US-Iran Peace Deal) సంబంధించిన ట్రంప్ తాజాగా తన ట్రూత్ ఖాతాలో సుదీర్ఘ పోస్ట్ చేశారు. అరబ్ దేశాలు చారిత్రక అబ్రహం అకార్డ్స్‌లో తప్పనిసరిగా చేరాల్సిందేనని రాసుకొచ్చారు. ‘‘సౌదీ అరేబియా, ఖతార్, పాకిస్థాన్, తుర్కియే, జోర్డాన్ దేశాలు తక్షణమే అబ్రహం అకార్డ్స్‌పై సంతకం చేయాలి. ఇందులో ఒకట్రెండు దేశాలు ఇందుకు అంగీకరించకపోవచ్చు. కానీ, చాలా దేశాలు సిద్ధంగానే ఉన్నాయి. పశ్చిమాసియాలో ఆర్థిక, సామాజిక పురోగతికి ఈ అకార్డ్స్ (ఒప్పందాలు) ఎంతగానో ఉపయోగపడతాయని ఇదివరకే రుజువైంది. చర్రితలోనే కనీవిని ఎరుగని ఒప్పందాలు ఇవి. పశ్చిమాసియా ఐక్యత, బలాన్ని చాటిచెబుతాయి. దీనిపై సౌదీ, ఖతార్ తొలుత సంతకాలు చేయాలి. మిగతా దేశాలు కూడా వీటిని అనుసరించాలి. ఇరాన్ కూడా ఇందులో చేరితో అది చాలా గొప్ప విషయం అవుతుంది’’ అని ట్రంప్ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయా దేశాధినేతల పేర్లను అమెరికా అధ్యక్షుడు తన పోస్ట్‌లో పేర్కొన్నారు. అయితే, పాకిస్థాన్ విషయానికొచ్చేసరికి ఆ దేశ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ పేరు కాకుండా.. ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ పేరును ప్రస్తావించడం మరింత చర్చనీయాంశమైంది. పాక్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని తొక్కిపెట్టి ఈ సందర్భంగా ఆయా దేశాధినేతల పేర్లను అమెరికా అధ్యక్షుడు తన పోస్ట్‌లో పేర్కొన్నారు. అయితే, పాకిస్థాన్ విషయానికొచ్చేసరికి ఆ దేశ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ పేరు కాకుండా.. ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ పేరును ప్రస్తావించడం మరింత చర్చనీయాంశమైంది. పాక్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని తొక్కిపెట్టి సైనిక పాలన సాగిస్తున్నారనే ప్రచారానికి ట్రంప్ పోస్ట్‌తో బలం చేకూర్చినట్లయ్యింది. పశ్చిమాసియాలో శాంతి, వాణిజ్యం, దౌత్య సంబంధాలను పెంపొందించాలనే లక్ష్యంతో 2020లో అబ్రహం అకార్డ్స్‌ను రూపొందించారు. ఇజ్రాయెల్‌ను గుర్తిస్తూ దాంతో దౌత్య సంబంధాలు బలోపేతం చేసుకునేలా అమెరికా మధ్యవర్తిత్వంతో జరిగిన ఈ ఒప్పందాలపై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, సూడాన్, మొరాకో సంతకాలు చేశాయి. ఇప్పుడు దీన్ని మరిన్ని అరబ్ దేశాలకు విస్తరించాలని ట్రంప్ భావిస్తున్నారు. అయితే, గాజాపై ఇజ్రాయెల్ సైనిక చర్యను మెజార్టీ ముస్లిం దేశాలు తీవ్రంగా ఖండిస్తున్న నేపథ్యంలో.. అబ్రహం అకార్డ్స్లోకి ఆయా దేశాలు చేరుతాయా అనేది సందేహమే. ఇజ్రాయెల్‌తో సాధారణ దౌత్య సంబంధాలు నెరపలేమని ఇప్పటికే సౌదీ పలుమార్లు స్పష్టం చేసింది. పాకిస్థాన్ కూడా ఇజ్రాయెల్‌ను ఇంతవరకూ గుర్తించలేదు. 2020లో అబ్రహం అకార్డ్స్ రూపొందించినప్పుడే నాటి పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను అమెరికా సంప్రదించింది. అయితే, నాడు అందులో చేరేందుకు ఇమ్రాన్ అంగీకరించలేదు. ఆ తర్వాత వచ్చిన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా ఇజ్రాయెల్‌ను గుర్తించేందుకు ససేమిరా అన్నారు. ఇప్పుడు ఇరాన్‌తో అమెరికా శాంతిఒప్పందానికి ఇస్లామాబాద్ మధ్యవర్తిత్వం వహించడంతో ట్రంప్ మరోసారి ఈ అంశాన్ని తెర పైకి తెచ్చారు. ఈ ఒప్పందాలపై సంతకం చేస్తే.. పాక్ స్వదేశంలో రాజకీయంగా, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అందుకే, ట్రంప్ ఆహ్వానాన్ని ఆ దేశం తోసిపుచ్చింది. ‘‘అబ్రహం అకార్డ్స్‌పై పాక్ సంతకం చేయదు. అది మా ప్రాథమిక సిద్ధాంతాలకు విరుద్ధం. ఇది మాకు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు’’ అని పాక్ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్ వెల్లడించారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.