
దిల్లీ: సాంకేతికత రంగంలో కీలకమైన క్రిటికల్ మినరల్స్ సరఫరా గొలుసులో చైనా ఆధిపత్యాన్ని అడ్డుకునే దిశగా భారత్-అమెరికా కీలక ముందడుగు వేశాయి. క్రిటికల్ మినరల్స్ సరఫరాకు సంబంధించిన ఫ్రేమ్‌వర్క్‌పై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. దిల్లీ వేదికగా జరుగుతున్న క్వాడ్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం అనుబంధంగా ఈ ఒప్పందం (US-India Deal) కుదిరింది. ప్రస్తుత వాణిజ్య పరిస్థితుల్లో ఈ ఫ్రేమ్‌వర్క్ అత్యంత కీలకమైనదని భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ వెల్లడించారు. ఇది ఇరు దేశాల మధ్య వాణిజ్య సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుందని అమెరికా విదేశీ వ్యవహారాల మంత్రి మార్కో రూబియో తెలిపారు. బలవంతపు మార్కెట్ పద్ధతుల నుంచి సున్నితమైన క్రిటికల్ మినరల్స్ (Critical Minerals) సరఫరా గొలుసులను రక్షించడం, గుత్తాధిపత్యాలను తగ్గించడానికి ఈ ఫ్రేమ్ వర్క్ కింద అమెరికా, భారత్ కలిసి పనిచేయనున్నాయి. అధునాతన తయారీ, ఇంధన వ్యవస్థలు, సాంకేతికత అభివృద్ధి తదితర రంగాల్లో అరుదైన ఖనిజాలు, క్రిటికల్ మినరల్స్ వినియోగం అత్యంత కీలకం. జైశంకర్ అధ్యక్షతన జరిగిన ఈ క్వాడ్ (భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాల కూటమి) సదస్సులో రూబియోతో పాటు ఆస్ట్రేలియా, జపాన్ విదేశాంగ మంత్రులు పెన్నీ వాంగ్, తోషిమిత్సు పాల్గొన్నారు. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, హర్మూజ్ మీదుగా సరకు రవాణా, ఇండో-పసిఫిక్ తదితర అంశాలపై వీరంతా చర్చలు జరిపారు. ఉగ్రవాదాన్ని ఎప్పటికీ సహించవద్దని, ఉగ్రదాడులకు వ్యతిరేకంగా పోరాడే హక్కు అన్ని దేశాలకు ఉందని ఈ కూటమి పునరుద్ఘాటించింది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.