ఇంటర్నెట్డెస్క్: కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) సోదాలు నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం పది ప్రాంతాల్లో ఈడీ దాడులు చేపట్టగా.. వాటిలో మాజీ సీఎం (Pinarayi Vijayan) నివాసం కూడా ఒకటి. మనీలాండరింగ్ కేసు విచారణలో భాగంగా ఈ తనిఖీలు జరిగాయి. కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటిల్ లిమిటెడ్ (CMRL) నుంచి ఎక్స్లాజిక్ సొల్యూషన్స్ సంస్థకు రూ.2.73 కోట్లు దక్కాయి. దానికి బదులుగా ఎలాంటి ఐటీ సేవలు అందించలేదు. ఈ ఎక్స్లాజిక్ సొల్యూషన్స్ విజయన్ కుమార్తె టి.వీణకు చెందిన కంపెనీ. రెండు సంస్థల మధ్య అధికారిక ఒప్పందం ఉన్నప్పటికీ.. అవి మోసపూరితంగా ఉన్నాయని సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (SFIO) తన అభియోగాల్లో పేర్కొంది. 2023 ఆగస్టులో ఆ అంశం వెలుగులోకి వచ్చింది. 2017 నుంచి 2020 మధ్యలో సీఎంఆర్ఎల్ నుంచి రూ.1.72 కోట్లు పొందినట్లు ఆ ఆరోపణల సారాంశం. ఆ నేపథ్యంలో పూర్తిస్థాయి దర్యాప్తు జరపాలని ఎస్ఎఫ్ఐఓకు గతంలోనే కేంద్రం నుంచి ఆదేశాలు అందాయి. ఈ కేసు విషయంలో వీణపై ఈడీ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. ఈ క్రమంలోనే మాజీ సీఎం నివాసం సహా పలు ప్రాంతాల్లో నేడు ఈడీ సోదాలు చేపట్టింది. కొయికోడ్లోని మాజీ మంత్రి మహమ్మద్ రియాస్ నివాసం పైనా ఈ దాడులు జరిపింది. మహమ్మద్ రియాస్.. వీణ భర్త. కేరళ సీఎం వీడీ సతీశన్ క్యాబినెట్లోని ఇద్దరు వ్యక్తులకు కూడా సీఎంఆర్ఎల్ నుంచి నిధులు అందాయని వామపక్ష నేత ఎంఏ బేబీ ఆరోపించారు. సీఎంఆర్ఎల్ చెల్లింపు వివాదంపై రాష్ట్రంలో వివాదం నడుస్తోన్న సమయంలో ఈ వ్యాఖ్యలు వచ్చాయి. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.