
అమరావతి: తెలుగుదేశం పార్టీ (TDP MahaNadu) నాయకులు, కార్యకర్తలంతా ఐక్యతను చాటుకునే వేదిక మహానాడు అని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. మహానాడు ప్రారంభం సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడారు.. ఇప్పటి వరకూ పార్టీ ప్రయాణం, భవిష్యత్తులో తీసుకోవాల్సిన నిర్ణయాలు ఇతర అంశాలను ఈ వేదిక ద్వారా చర్చించుకుందామన్నారు. హైబ్రిడ్ విధానంలో మహానాడు 2026 ద్వారా లక్షల సంఖ్యలో నేతలు, కార్యకర్తలు అనుసంధానమై ఉన్నారని తెలిపారు. దేశంలో వివిధ రాజకీయ పార్టీలు వచ్చి కాలగర్భంలో కలిసి పోయాయని, తెదేపా ఒక్కటే నిత్యచైతన్యంతో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలందరికీ అవకాశాలు కల్పిస్తుందన్నారు. అధికారంలోకి వచ్చిన 23 నెలల్లోనే అన్ని నామినేటెడ్ పదవులూ కార్యకర్తలకు ఇచ్చామని, భవిష్యత్తులోనూ ఇంకా వస్తాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దేలా ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్-2047 రూపొందించారన్నారు. 63 శాతం యువతకు పార్టీలో ప్రాధాన్యత దక్కుతోందన్నారు. 26 ఏళ్లకే రామ్మోహన్ నాయుడు ఎంపీ, తర్వాత కేంద్రమంత్రి అయ్యారన్నారు. గంటి హరీష్ 27 ఏళ్లకు ఎంపీ అయ్యారని వివరించారు. గతంలో అయ్యన్నపాత్రుడు, కళా వెంకట్రావు లాంటి నేతలు చిన్నవయసులోనే పార్టీలో కీలక నేతలుగా ఎదిగారని పల్లా శ్రీనివాసరావు గుర్తుచేశారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.