
తెలంగాణ ఎగ్జిబిటర్ల కీలక నిర్ణయం ‘పెద్ది’కీ మినహాయింపు లేదు ‘‘రాష్ట్రంలో ఇకపై పర్సంటేజ్ విధానంపైనే సినిమాలు ఆడిస్తామ’’ని తెలంగాణ ఎగ్జిబిటర్లు స్పష్టం చేశారు. ఈ విషయంలో ‘పెద్ది’ సినిమాకి కూడా మినహాయింపు లేదని.. దానికి కూడా పర్సంటేజీ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. ‘‘రాష్ట్రంలో ఇకపై పర్సంటేజ్ విధానంపైనే సినిమాలు ఆడిస్తామ’’ని తెలంగాణ ఎగ్జిబిటర్లు స్పష్టం చేశారు. ఈ విషయంలో ‘పెద్ది’ సినిమాకి కూడా మినహాయింపు లేదని.. దానికి కూడా పర్సంటేజీ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. గత కొన్నివారాలుగా ఈ పర్సంటేజీ, రెంటల్ విధానాలపై నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే శనివారం హైదరాబాద్‌లోని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో తెలంగాణ ఎగ్జిబిటర్లు సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ శ్రీధర్ మాట్లాడుతూ.. ‘‘తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కమిటీతో రెండు మూడు సార్లు చర్చలు జరిగాయి. ‘హరి హర వీరమల్లు’ విడుదల సమయంలోనూ రెండు నెలల్లో మా సమస్యని పరిష్కరిస్తామన్నారు. కానీ, సంవత్సరం అయిపోయింది. నిర్మాతలు కావాలనే ఆలస్యం చేస్తున్నారు. ముందు మూడు వారాలన్నారు. కానీ, ఇప్పుడు మళ్లీ మరో మూడు వారాలు వాయిదా వేస్తున్నారు. ఇకపై పర్సంటేజ్ ప్రకారమే సినిమాలు ఆడిస్తాం. మాకు ‘పెద్ది’ మీద ఏం పగ లేదు. దాన్ని ఈ గొడవ నుంచి మినహాయించాలనుకున్నాం. కానీ, ఆ తర్వాత సమస్య ఎప్పుటికి పరిష్కారమవుతుందన్నది అర్థమవట్లేదు. అందుకే ఈ సినిమాని కూడా పర్సంటేజ్ శ్లాబ్‌లో చేర్చాలని నిర్ణయించుకున్నాం. అవసరమైతే మా సమస్యని చిరంజీవి దృష్టికి తీసుకెళ్లి దీని పరిష్కారం దిశగా కృషి చేస్తాం’’ అన్నారు. అలాగే ‘పెద్ది’ సినిమాకి ఆంధ్రాలో మాత్రమే టికెట్ రేట్ల పెంపు ఉండొచ్చు కానీ, తెలంగాణలో పెంపు ఉండదన్నారు. ఇక్కడ రేట్లు పెంచొద్దని, ప్రేక్షకుల్ని చంపొద్దని సీఎం రేవంత్ రెడ్డి, ఎగ్జిబిటర్లకు, ఛాంబర్‌కు లేఖ ఇచ్చామని తెలిపారు. ఒకవేళ టికెట్ పెంపు నిర్ణయం తీసుకుంటే.. డిమాండ్ సప్లై ఆధారంగా తమ నిర్ణయం ఉంటుందని చెప్పారు. తాము ‘పెద్ది’ లాంటి చిత్రాలకు సెల్యూట్ చేస్తామన్నారు. ప్రస్తుతం 120 మంది థియేటర్ యజమానులు దీనస్థితిలో ఉన్నారని.. ఎగ్జిబిటర్లకి ఆదాయం రావడం లేదని.. కానీ, నిర్మాతలకు 14రకాలుగా ఆదాయం వస్తోందని వివరించారు. దేశవ్యాప్తంగా పర్సంటేజ్ విధానమే నడుస్తుంటే.. ఇక్కడ మాత్రమే రెంటల్ ఎందుకని ప్రశ్నించారు. ఏది ఏమైనా తమకు పర్సంటేజ్ విధానం కావాల్సిందేనని.. అదెంత ఇస్తారో చెప్పాలని తెలంగాణ ఎగ్జిబిటర్లు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగానే తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన అధ్యక్షుడిగా జువ్వాడి శేఖర్‌ను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎగ్జిబిటర్స్ ప్రెసిడెంట్ విజయేందర్ రెడ్డి, బాలగోవింద్ రాజ్, రవీంద్ర గోపాల తదితరులు పాల్గొన్నారు. ‘‘పెద్ది’ సినిమా విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలోని ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ సమస్యలు సృష్టించాలనుకోవడం ఏమాత్రం సరికాద’’ని నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ నట్టికుమార్ స్పష్టం చేశారు. దీనిపై ఆయన శనివారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. నిజానికి సింగిల్ థియేటర్స్ యజమానులు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కొన్ని సమస్యల్ని ఎదుర్కొంటున్నారని.. వాటిని చర్చల రీతిలో పరిష్కరించుకోవాలని తెలిపారు. పర్సంటేజీ విధానానికి సంబంధించిన సమస్య పరిష్కారం కోసం తెలుగు ఫిల్మ్ ఛాంబర్ జోక్యం చేసుకుని.. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్‌తో ఓ సబ్‌కమిటీని ఏర్పాటు చేసిందని.. అయితే దానికి అంగీకరించి, ఇప్పుడు ఉన్నట్లు ఉండి మాట మార్చి, ‘పెద్ది’ విడుదలకు అడ్డుపడటం ఎంత వరకు సమంజసమని తెలంగాణ ఎగ్జిబిటర్లను ప్రశ్నించారు. మంగళవారం రాత్రిలోగా ఎగ్జిబిటర్లు ‘పెద్ది’ విడుదలకు అడ్డు రాకుండా నిర్ణయం తీసుకుంటే ఆనందదాయకమేనని.. లేదంటే బుధవారం నుంచి తాను ఫిల్మ్ ఛాంబర్ ఎదుట ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటానని నట్టి కుమార్ ప్రకటించారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
Summary status: pending