
ఇంటర్నెట్ డెస్క్: తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అన్నాడీఎంకే (AIADMK) తిరుగుబాటు వర్గం ఎమ్మెల్యేలు (వేలుమణి నేతృత్వంలోని ఎమ్మెల్యేలు) పళనిస్వామితో ఆయన నివాసంలో సమావేశమయ్యారు. అయితే, టీవీకే ప్రభుత్వానికి పార్టీ మద్దతు ఇవ్వాలని వేలుమణి (SP Velumani).. ఇతర ఎమ్మెల్యేలతో కలిసి గతంలో విజ్ఞప్తి చేసిన మాజీ మంత్రి షణ్ముగం మాత్రం ఈ సమావేశానికి గైర్హాజరయ్యారు. అనంతరం వేలుమణి మాట్లాడుతూ అన్నాడీఎంకేలో చీలిక లేదని.. భేదాభిప్రాయాలు మాత్రమే ఉన్నాయని పేర్కొన్నారు. పళనిస్వామికి పూర్తిగా మద్దతిస్తున్నట్లు వెళ్లడించారు. తామందరం ఐక్యంగా ఉన్నామని.. మొదట షణ్ముగంను కలిసిన తర్వాత ఇక్కడికి వచ్చామని తెలిపారు. అనంతరం వేలుమణి బృందం స్పీకర్ జేసీడీ ప్రభాకర్‌ను కలిసింది. అసెంబ్లీలో అంతా ఒకే పార్టీగా పనిచేస్తామని ఆయనకు లేఖ సమర్పించింది. శాసనసభ ఎన్నికల ఫలితాల తర్వాత అన్నాడీఎంకేలో మాజీ మంత్రులు వేలుమణి, సి.వి.షణ్ముగం నాయకత్వంలో 25 మంది ఎమ్మెల్యేలు అధిష్ఠానంపై తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే. టీవీకే (TVK) ప్రభుత్వం ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానానికి మద్దతుగా ఓటు వేసిన వారిని పార్టీ ఫిరాయింపుల చట్టం కింద పదవి నుంచి తొలగించాలని పళనిసామి వర్గం ఎమ్మెల్యేలు సభాపతికి వినతిపత్రం సమర్పించారు. ఈ నేపథ్యంలో తిరుగుబాటు ఎమ్మెల్యేలు మళ్లీ అన్నాడీఎంకే గూటికి చేరడం గమనార్హం. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.