
జులై 3 నుంచి పర్సంటేజీ విధానం అమలు చిరంజీవి హామీతో నిర్ణయాన్ని ప్రకటించిన ప్రదర్శనకారులు ‘పెద్ది’ సినిమాతోనే పర్సంటేజీ విధానాన్ని అమలు చేయాలని పట్టుబట్టిన తెలంగాణ సింగిల్ స్క్రీన్ థియేటర్ యాజమాన్యాలు వెనక్కి తగ్గాయి. జులై 3 వరకూ అద్దె ప్రాతిపదికనే ప్రదర్శనలు నిర్వహించాలని నిర్ణయించాయి. అయితే జూన్ 30 లోపు తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి (ఛాంబర్) ఆధ్వర్యంలో ఏర్పాటైన ఉప కమిటీ కొత్త పర్సంటేజీ విధానంపై నిర్ణయం తీసుకోవాలని, జులై 3 నుంచి అమలు చేయాలని కోరాయి. ఈ విషయాన్ని తెలంగాణ ప్రదర్శనకారుల తరఫున తెలంగాణ స్టేట్ చలన చత్ర వాణిజ్య మండలి ఓ ప్రకటనలో తెలిపింది. ప్రదర్శనకారులు బుధవారం మరోమారు అగ్ర కథానాయకుడు చిరంజీవితో సమావేశమయ్యాక ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఉపకమిటీ కాలపరిమితిలోగా పర్సంటేజీ విధానంపై నిర్ణయం తీసుకొనేలా, ఆ ప్రక్రియని తాను పర్యవేక్షిస్తానని చిరంజీవి ఇచ్చిన హామీ మేరకు ప్రదర్శనకారులంతా ఈ నిర్ణయం తీసుకొన్నట్టు తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి శ్రీధర్ ఆ ప్రకటనలో తెలిపారు. దీంతో ‘పెద్ది’ సినిమా సజావుగా విడుదల అవుతుందని అందులో పేర్కొన్నారు. జులై 3 నుంచి కేవలం పర్సంటేజీ పద్ధతిలోనే ప్రదర్శనలు జరుగుతాయని అందులో తెలిపారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.