
మేం చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని చెప్పుకోలేకే గతంలో ఓటమి ఇక ఆ ఛాన్స్ జగన్కు ఇవ్వం తాత వేటకొడవళ్లతో.. తండ్రి కత్తులతో రాజకీయం జగన్ గొడ్డళ్లతో దాన్ని కొనసాగిస్తూ రాష్ట్రాన్ని నాశనం చేసేందుకు కుట్రలు విధ్వంసం నుంచి వికాసం వైపు తీర్మానంలో విరుచుకుపడిన మంత్రి అచ్చెన్నాయుడు ఈనాడు, అమరావతి: ‘తెదేపా ప్రభుత్వంలో 2014-19 మధ్య చేసిన అభివృద్ధి, సంక్షేమాలను ప్రజల్లోకి తీసుకెళ్లలేక 2019లో ఓడిపోయాం. జగన్ చెప్పిన అసత్యాలను ప్రజలు నమ్మారు. ఇప్పుడు అలాంటి అవకాశాన్ని జగన్కు ఇవ్వం. ఆయన ఒకటి చెబితే మేం రెండు మాట్లాడతాం. వాస్తవాల్ని ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లి వారిని చైతన్యపరుస్తాం. మళ్లీ జీవితంలో వైకాపా గెలవకుండా ఆ పార్టీని పాతాళంలో పాతిపెడతాం. పసుపుజెండాను నిలబెట్టుకుంటాం’ అని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. మహానాడులో ‘విధ్వంసం నుంచి వికాసం వైపు’ తీర్మానంపై ఆయన ప్రసంగించారు. ‘ప్రజలు అప్రమత్తంగా లేకపోతే రాష్ట్రానికి ఎంత ప్రమాదమో 2019 ఎన్నికలతో తెలిసింది. ఎవరో కొత్తగా పార్టీపెట్టి రాష్ట్రాన్ని ఉద్ధరిస్తామని చెబితే ప్రజలు నమ్మి అధికారాన్ని ఇచ్చారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని రూ.లక్ష కోట్లు దోపిడీ చేశారనే అభియోగం ఉన్న వ్యక్తికి ఓట్లు వేసి గెలిపించడం ప్రజలు చేసిన పొరపాటు’ అన్నారు. అధికారంలోకి రావడానికి ముందు అమరావతే రాజధాని అన్న జగన్... తీరా సీఎం అయ్యాక మూడు రాజధానులు అన్నారు. గత ఎన్నికల్లో ప్రజలు కర్రు కాల్చి వాతపెట్టినా సిగ్గురాలేదు. కేంద్రం పార్లమెంటులో రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించిన తర్వాత కూడా మావిగన్ అంటున్నారంటే ఆయన్ను ఏమనాలి? తన కుటుంబ నేపథ్యమే ఫ్యాక్షన్ పునాదులపై వెలిసిందని జగనే చెప్పారు. ఇప్పుడేమో గొడ్డలి పార్టీ అంటుంటే గింజుకుంటున్నారు. తాత రాజారెడ్డి వేటకొడవళ్లతో రాజకీయాలు తన కుటుంబ నేపథ్యమే ఫ్యాక్షన్ పునాదులపై వెలిసిందని జగనే చెప్పారు. ఇప్పుడేమో గొడ్డలి పార్టీ అంటుంటే గింజుకుంటున్నారు. తాత రాజారెడ్డి వేటకొడవళ్లతో రాజకీయాలు ప్రారంభిస్తే తండ్రి రాజశేఖరరెడ్డి కత్తులతో నడిపారు. జగన్ గొడ్డళ్లతో కొనసాగిస్తూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేందుకు కుట్రలు చేస్తున్నారు. జగన్ సీఎంగా ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేదు. కూటమి ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీని అడ్డుకునేందుకు కోర్టుల్లో కేసులు వేశారు. వీటన్నింటినీ అధిగమించి పారదర్శకంగా నిర్వహించాం. తప్పు జరిగితే పరీక్ష నిర్వహించేటప్పుడో... ఫలితాలు వచ్చాకో ప్రశ్నించాలి. కానీ దొంగలు పడిన ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లు పరీక్ష పూర్తయిన దాదాపు ఏడాది తర్వాత గొడ్డలి పార్టీ నాయకులు అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. జగన్ సీఎం అయ్యాక రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఆర్థిక విధ్వంసానికి పాల్పడ్డారు. 30 ఏళ్లపాటు తానే అధికారంలో ఉండాలని, రాష్ట్రంలో ఇంకో పార్టీ ఉండకూడదని కక్షకట్టి పనిచేశారు. సీపీఎస్ రద్దు, సంపూర్ణ మద్యనిషేధం చేస్తామని చెప్పి చేయలేదు. రూ.13 లక్షల కోట్ల అప్పు పెట్టి వెళ్లిన ఆయన ఎన్నికల హామీల గురించి మాట్లాడుతున్నారు. అది నోరా.. తాటిమట్టా? ప్రజావేదిక కూల్చివేతతో విధ్వంసాన్ని ప్రారంభించిన జగన్.. అన్నక్యాంటీన్లు, రాజధాని అమరావతి, పోలవరం ఇలా దేన్నీ వదిలిపెట్టలేదు. ఐదేళ్లలో ఒక్క పరిశ్రమ తీసుకురాకపోగా ఉన్న వాటిని వెళ్లగొట్టారు. ఒక్క ప్రాజెక్టునూ పూర్తిచేయలేదు. 2014-19 మధ్య తెదేపా హయాంలో నీటిపారుదల ప్రాజెక్టుల పూర్తికి రూ.68 లక్షల కోట్లు ఖర్చుచేశాం. ఇప్పుడు 24 నెలల్లో జగన్ విధ్వంసం చేసిన అన్ని వ్యవస్థలనూ గాడిన పెట్టాం. జగన్ విడుదల చేసిన బుక్లెట్ పేరు(వెన్నుపోటు) ఆయనకే వర్తిస్తుంది. వైఎస్ కుటుంబం బతకలేని పరిస్థితుల్లో ఉండి కాంగ్రెస్పార్టీ ఆదరువుతో సీఎం అయ్యారు. ఆ అధికారాన్ని అడ్డుపెట్టుకుని రూ.లక్ష కోట్లు సంపాదించుకున్న జగన్.. తండ్రి చనిపోయాక తనకు సీఎం పదవి ఇవ్వలేదని పార్టీని వదిలేశారు. అదీ వెన్నుపోటంటే. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.