
ఐపీఎల్ 2026 సీజన్ మొదలైనప్పుడు అందరి చూపు వైభవ్ సూర్యవంశీపైనే.. ఈ కుర్రాడు ఎలా ఆడతాడు? ఎవరిపై ఆధిపత్యం ప్రదర్శిస్తాడనే చర్చ. అందరి అంచనాలకు తగ్గట్టుగానే విరుచుకుపడ్డాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ వంతు.. ఈ టీమ్ఇండియా స్టార్ ఆటగాడు అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలకడంతో ఎలా బ్యాటింగ్ చేస్తాడోనని అంతా ఆసక్తిగా తిలకించారు. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ ఆటతీరుపైనా అభిమానులు మాట్లాడుకున్నారు. ఆఖరికి హార్దిక్ పాండ్య గురించి కూడా సోషల్ మీడియాలో చర్చ నడిచింది. పైన పేర్కొన్న ప్లేయర్ల జాబితాలో ఒకే ఒక్క స్టార్ ప్లేయర్ పేరు మొదట్లో మిస్ అయింది. కానీ, అతడు మాత్రం చాపకింద నీరులా ఏమాత్రం హడావుడి లేకుండా కామ్‌గా ఉంటూ పరుగుల వరద పారించాడు. తన జట్టును ఫైనల్‌కు చేర్చాడు. అతడెవరో ఈపాటికే అర్థమై ఉంటుందిగా.. అభిమానులు ముద్దుగా ‘ప్రిన్స్’ అని పిలుచుకొనే శుభ్‌మన్ గిల్. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్. వైభవ్ సూర్యవంశీలా భారీ హిట్టింగ్ ఉండదు. విరాట్ కోహ్లీలా దూకుడుగా కనిపించడు. సూర్యకుమార్ యాదవ్‌లా ‘మిస్టర్ 360’ కాదు. కానీ, శుభ్‌మన్ గిల్‌ను చూస్తుంటే వీరందరి కలబోతగా ఉంటాడనడంలో సందేహంలేదు. ముందు ఇన్నింగ్స్‌ను నిర్మించడంపై దృష్టిపెడతాడు. ఒక్కసారి కుదురుకున్నాక దూకుడు పెంచుతాడు. మళ్లీ ఏవైనా కుదుపులు వస్తే తట్టుకొని నిలబడతాడు. ఇప్పుడీ సీజన్లో 441 బంతులు ఎదుర్కొని 160కిపైగా స్ట్రైక్‌రేట్‌తో 722 పరుగులు చేశాడు. ఇందులో 75 ఫోర్లు, 33 సిక్స్‌లు ఉన్నాయి. అంటే స్టాండ్స్‌లో బంతిని పెట్టడం కంటే ఫోర్లుగా మలిచి పరుగులు రాబట్టేందుకే ఎక్కువగా మొగ్గుచూపుతాడు. ఇప్పుడు రాజస్థాన్‌పైనా ఇలాగే సెంచరీతో (104) తన జట్టును గెలిపించాడు. నాకౌట్‌కు చేరుకునే జట్లు ఏవో మాజీలు, నాకౌట్‌కు చేరుకునే జట్లు ఏవో మాజీలు, క్రికెట్ అభిమానులు అంచనా వేసినప్పుడు గుజరాత్ టైటాన్స్ పేరు పెద్దగా వినిపించలేదు. లీగ్ స్టేజ్ ముగిసేసరికి ఏకంగా రెండో స్థానంతో నాకౌట్లోకి అడుగు పెట్టింది. కెప్టెన్‌గా గిల్ తనకున్న బ్యాటింగ్, బౌలింగ్ వనరులను సద్వినియోగం చేసుకున్న తీరు అద్భుతం. బ్యాటింగ్ ఆర్డర్లో తనతోపాటు సాయి సుదర్శన్, జోస్ బట్లర్‌పైనే ఎక్కువ ఆశలు. గత సీజన్లో ఈ ముగ్గురు బ్యాటర్లు కాస్త తడబాటుకు గురి కావడం మనం చూశాం. ఈసారి మాత్రం ముందుండి పరుగులు చేస్తూ జట్టును నడిపించాడు గిల్. తొలి క్వాలిఫయర్‌లో భారీ లక్ష్య ఛేదనలో త్వరగా పెవిలియన్‌కు చేరడంతో గుజరాత్ ఓటమిపాలైంది. కానీ, క్వాలిఫయర్-2లో రాజస్థాన్ నిర్దేశించిన 215 పరుగుల టార్గెట్ విషయంలో గిల్ కాంప్రమైజ్ కాలేదు. సెంచరీతో జట్టుకు విజయం ఖరారు చేసి మరీ వెనుదిరిగాడు. ఫైనల్లోనూ ఇదే ఆటతీరు ప్రదర్శిస్తే ఆర్సీబీని ఓడించి ‘రెండో కప్పు’ను నెగ్గడం జీటీకి పెద్ద కష్టమేం కాదు. టీమ్ఇండియా టెస్టు, వన్డే జట్లకు సారథిగా ఉన్న శుభ్‌మన్ గిల్‌కు టీ20ల్లో మాత్రం చోటు దక్కలేదు. అతడు పొట్టి ఫార్మాట్‌కు సరిపోడని నోళ్లు పారేసుకున్నవారే.. ఇక్కడ ఆటను చూశాక జట్టులో ఉండాల్సిందేనని ముక్తకంఠంతో చెబుతున్నారు. ఇప్పటికే ఈ లీగ్‌లో 700+కిపైగా పరుగులతో రెండో స్థానంలో నిలిచాడు. ఇటు కెప్టెన్‌గానూ గుజరాత్‌ను ఫైనల్‌కు చేర్చాడు. సూర్యకుమార్ యాదవ్ స్థానంలో ఖాళీ కాబోతున్న టీ20 ‘కెప్టెన్సీ’కి గిల్ గట్టిపోటీదారుగా మారాడనడంలో సందేహం లేదు. రాబోయే ఇంగ్లాండ్ పర్యటనకు సారథ్యం అప్పగించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. 2028లో టీ20 ప్రపంచ కప్‌తోపాటు లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్‌లో జట్టును నడిపించాల్సిన బాధ్యత కొత్త నాయకుడిపై ఉండనుంది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in © 1999 - 2026 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved. Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted. This website follows the DNPA Code of Ethics. ఐపీఎల్ 2026 సీజన్ మొదలైనప్పుడు అందరి చూపు వైభవ్ సూర్యవంశీపైనే.. ఈ కుర్రాడు ఎలా ఆడతాడు? ఎవరిపై ఆధిపత్యం ప్రదర్శిస్తాడనే చర్చ. అందరి అంచనాలకు తగ్గట్టుగానే విరుచుకుపడ్డాడు. ఆ...