
ఇంటర్నెట్ డెస్క్: దేశీయ మార్కెట్లు శుక్రవారం ఫ్లాట్‌గా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాలు, భౌగోళిక రాజకీయ అనిశ్చితులతో పెరుగుతోన్న చమురు ధరలు వంటి కారణాలతో మదుపర్లు అప్రమత్తత పాటించారు. దీంతో నేటి సెషన్లో రోజంతా ఒడుదొడుకులతో సాగిన సూచీలు (Stock Market).. చివరకు స్తబ్దుగా ముగిశాయి.
ఈ ఉదయం 77,701 వద్ద స్వల్ప లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్ (Sensex) కాసేపటికి 77,725 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. కానీ, ఆ జోరు ఎంతోసేపు కొనసాగలేదు. కీలక రంగాల్లో మదుపర్లు అమ్మకాలకు దిగడంతో సూచీలు లాభనష్టాల్లో ఊగిసలాడాయి. ఒక దశలో 77,445 కనిష్ఠాన్ని తాకిన సూచీ చివరకు అత్యల్పంగా 3 పాయింట్ల లాభంతో 77,540 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ (Nifty) 20 పాయింట్లు పెరిగి 24,252 వద్ద స్థిరపడింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 3 పైసలు పెరిగి 95.71 వద్ద ముగిసింది.
నిఫ్టీలో పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, హెచ్డీఎఫ్సీ లైఫ్, నెస్లే, కొటక్ మహీంద్రా బ్యాంక్, భారత్ ఎలక్ట్రానిక్స్ షేర్లు స్వల్పంగా లాభపడ్డాయి. మారుతి సుజుకీ, ట్రెంట్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, సిప్లా, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ షేర్లు నష్టపోయాయి. రంగాల వారీగా.. లోహ, ప్రభుత్వ రంగ బ్యాంకింగ్, రియల్టీ షేర్లలో కొనుగోళ్లు జరిగాయి. ఐటీ, ఆటో, మీడియా, ఫార్మా రంగాల షేర్లు ఒత్తిడికి గురయ్యాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





