
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎమ్‌డీ) వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలతో పాటు పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎమ్‌డీ తెలిపింది. ముఖ్యంగా ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉందని అధికారులు పేర్కొన్నారు. వర్షం కురిసే సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ప్రజలు చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద నిలబడవద్దని సూచించింది. పొంగిపొర్లుతున్న మూసీ వంటి వాగులు, వంకలను దాటే ప్రయత్నం చేయవద్దని అధికారులు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. రాజధాని హైదరాబాద్ నగరంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని ఐఎమ్‌డీ అంచనా వేసింది. వాహనదారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో రాబోయే మూడు రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎమ్‌డీ తెలిపింది. తీరప్రాంతాలు, ఇతర జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతంలో పిడుగులు పడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉన్నందున మత్స్యకారులు ఐఎమ్‌డీ ఎప్పటికప్పుడు విడుదల చేసే బులెటిన్లను గమనించాలని సూచించింది. దీర్ఘకాలిక పొడి వాతావరణం మరియు ఎల్‌నినో ప్రభావం తర్వాత, గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు ఉష్ణోగ్రతలను తగ్గించాయి. ఈ వర్షాలు భూగర్భ జలాలు పెరగడానికి, వ్యవసాయ రంగానికి కొంత ఊరటనిచ్చాయని అధికారులు తెలిపారు.





