
ఐదు నెలల్లో అదనపు రాబడి రూ.1,348 కోట్లు గతేడాదితో పోల్చితే పెరిగిన ఆదాయం ఈనాడు,హైదరాబాద్‌: స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు కాసుల వర్షం కురుస్తోంది. స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లతో నెలనెలా రాబడి వృద్ధి చెందుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో మొదటి ఐదు నెలలతో పోల్చితే ఈ ఏడాది రూ.1,348 కోట్ల రాబడి పెరిగింది. 2025-26లో ఏప్రిల్‌ నుంచి ఆగస్టు వరకు రూ.6,216 కోట్లు వచ్చింది. 2026-27లో రూ.7,564 కోట్లు నమోదైంది. ఆగస్టులో గతేడాది రూ.1,156 కోట్లు రాగా.. గత నెలలో రూ.1,428 కోట్లు వచ్చింది. దస్తావేజుల సంఖ్య పరంగా చూస్తే కొంత వ్యత్యాసం ఉంది. 2021, 2022 అనంతరం ఈ ఏడాది మే నెలలో భూముల మార్కెట్‌ విలువను రిజిస్ట్రేషన్ల శాఖ సవరించింది. హైదరాబాద్‌ పరిసర జిల్లాల్లో కొన్నిచోట్ల భూముల ధరలు పెరిగాయి. గ్రామీణ జిల్లాల్లో కొన్నిచోట్ల తగ్గాయి. క్షేత్రస్థాయిలో ఉన్న ధరలతో పోల్చితే ప్రభుత్వ విలువ చాలా తక్కువగా ఉండటంతో సవరించారు. ఈ క్రమంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో విలువైన భూముల రిజిస్ట్రేషన్లతో ఒక్కసారిగా రాబడి పెరిగినట్లు అంచనాలు ఉన్నాయి. గత జులైలో 1.70 లక్షల దస్తావేజుల రిజిస్ట్రేషన్లు జరగ్గా.. ఈ జులైలో 4,000 తగ్గి 1.66 లక్షలు రిజిస్ట్రేషన్లు అయ్యాయి. రాబడి మాత్రం రూ.274 కోట్లు పెరిగింది. గత ఆగస్టులో 1.39 లక్షల రిజిస్ట్రేషన్లు కాగా ఈ ఆగస్టులో 7,000 తక్కువగా 1.32 లక్షలు రిజిస్ట్రేషన్‌లు అయ్యాయి. రాబడి మాత్రం రూ.272 కోట్లు పెరిగింది. ఇళ్లు, ఫ్లాట్ల కొనుగోళ్లు పెరగడంతోనే రాబడి వృద్ధి కనిపిస్తోందని రిజిస్ట్రేషన్ల వర్గాలు చెబుతున్నాయి. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





