ఆపిల్ సైడర్ వెనిగర్‌లో అసిటిక్ యాసిడ్ ఉంటుంది. దీనిలోని ఎసిడిక్ గుణం పుట్టుమచ్చలోని కణజాలాన్ని విచ్ఛిన్నం చేస్తుందని కొందరు భావిస్తారు. అందుకే పుట్టుమచ్చపై నేరుగా యాపిల్ సైడర్ వెనిగర్ రాస్తే అది క్రమంగా ఎండిపోయి పోతుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కానీ చర్మం అంత సులభంగా పనిచేయదు. వెనిగర్ పుట్టుమచ్చపై మాత్రమే కాకుండా చుట్టూ ఉన్న చర్మంపైనా ప్రభావం చూపుతుంది. అందుకే ఇది పుట్టుమచ్చ తొలగించడానికి సురక్షితమైన పద్ధతి కాదు. పుట్టుమచ్చపై పదేపదే లేదా ఎక్కువ మోతాదులో వెనిగర్ రాస్తే చర్మం దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఎర్రబడటం, మంట, నొప్పి, చర్మం పొరలు ఊడటం, వాపు, పొక్కులు వంటి సమస్యలు రావచ్చు. కొన్నిసార్లు కెమికల్ బర్న్ కూడా ఏర్పడవచ్చు. చర్మం మానిపోయిన తర్వాత ఆ ప్రాంతంలో నల్లటి, తెల్లటి మచ్చలు, శాశ్వతమైన స్కార్ కూడా మిగిలే అవకాశం ఉంటుంది. ఇంత చేసినా పుట్టుమచ్చ పూర్తిగా తొలగిపోతుందనే గ్యారెంటీ లేదు. చాలా పుట్టుమచ్చలు ప్రమాదకరం కాకపోవచ్చు. అయితే ఏదైనా పుట్టుమచ్చ అకస్మాత్తుగా పెద్దదవడం, ఆకారం లేదా రంగు మారడం, దురద పెట్టడం, రక్తం రావడం లేదా పైభాగంలో పొర ఏర్పడటం వంటి మార్పులు కనిపిస్తే దాన్ని నిర్లక్ష్యం చేయకూడదని NCI అధ్యయనం పేర్కొంది. కొన్ని పుట్టు మచ్చలు చర్మ క్యాన్సర్ అంటే మెలనోమా క్యాన్సర్‌కు కారణం కావొచ్చు. మిగతా పుట్టుమచ్చలతో పోలిస్తే చాలా భిన్నంగా కనిపించినా డెర్మటాలజిస్ట్‌ను సంప్రదించడం మంచిది. వీటిని మనం తొలగించడానికి ప్రయత్నిస్తే అందులో ఉండే క్యాన్సర్ కణాలు మరింతగా చర్మం లోపలికి వ్యాపించే ప్రమాదం ఉంది. ఇది తప్పనిసరిగా తీవ్రమైన సమస్య ఉందని అర్థం కాదు. కానీ ముందుగా డాక్టర్‌ను సంప్రదించడం మేలు. వెనిగర్‌తో పుట్టుమచ్చను కాల్చడం వల్ల దాని అసలు రూపం కూడా మారిపోవచ్చు. పుట్టుమచ్చ అందంగా కనిపించడం లేదని తొలగించుకోవాలనుకుంటే ఇంటి చిట్కాలను ప్రయత్నించాల్సిన అవసరం లేదు. ముందుగా డెర్మటాలజిస్ట్ దాన్ని పరిశీలిస్తారు. పుట్టుమచ్చ పరిమాణం, ఉన్న ప్రదేశం, రూపాన్ని బట్టి ఏ పద్ధతి సరిపోతుందో నిర్ణయిస్తారు. అవసరాన్ని బట్టి షేవ్ ప్రొసీజర్ లేదా సర్జికల్ ఎక్సిషన్ వంటి మెడికల్ పద్ధతులతో తొలగించవచ్చు. వైద్యపరంగా అనుమానం ఉంటే తొలగించిన కణజాలాన్ని పరీక్షకు కూడా పంపవచ్చు. ఇప్పటికే పుట్టుమచ్చపై ఆపిల్ సైడర్ వెనిగర్ రాసి ఉంటే ఇకపై మళ్లీ రాయకండి. ఆ ప్రాంతాన్ని గిల్లడం, చర్మాన్ని పీకడం మరో DIY చిట్కాను ప్రయత్నించడం కూడా చేయకండి. తీవ్రమైన నొప్పి, పొక్కులు, వాపు, కాలినట్లు కనిపిస్తే వైద్య సలహా తీసుకోవాలి. అలాగే పుట్టుమచ్చలో ఇటీవల మార్పులు కనిపించినట్లయితే ఇంట్లో తొలగించుకునే బదులు డెర్మటాలజిస్ట్‌ను కలవడం మంచిది. ముఖ్య . కొన్ని అధ్యయనాలు, కొందరు నిపుణులు పేర్కొన్న అంశాల ఆధారంగా తెలియజేశాము. వీటిని పాటించే ముందు వైద్య నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. అలాగే వీటిని పాటించడం, పాటించకపోవడం పూర్తిగా మీ వ్యక్తిగత విషయం. సమయం తెలుగు వీటిని ధృవీకరించడం లేదు.