
టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ గురించి చాలా ఏళ్లుగా చర్చ జరుగుతూనే ఉంది. ఎందరో నటీమణులు తమకు ఎదురైన చేదు అనుభవాలని ధైర్యంగా బయటకు చెప్పారు. దీనిపై ఓ ఇంటర్వ్యూలో సీనియర్ హీరోయిన్ ఆమని సంచలన వ్యాఖ్యలు చేశారు. హీరోయిన్లకు ఇబ్బందులు సావిత్రి గారి కాలం నుంచే ఉన్నాయి అని ఆమని అన్నారు. ప్రతిచోట మంచి చెడు ఉన్నట్లే ఇండస్ట్రీలో కూడా ఉన్నాయి. దేనిని ఎంచుకోవాలి, దేనివైపు వెళ్ళాలి అనేది మన మైండ్ సెట్ పై ఆధారపడి ఉంటుంది. కష్టపడి హీరోయిన్ గా ఎదిగేవాళ్ళు, అదే విధంగా చెడు పద్దతుల ద్వారా హీరోయిన్ గా ఎదిగేవాళ్ళు కూడా ఉన్నారు అని ఆమని అన్నారు. నేను హీరోయిన్ గా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు అలాంటి సంఘటనలు ఎదురయ్యాయి. కొందరు కొత్త బ్యానర్ స్థాపించి ఆడిషన్స్ కి పిలిచేవాళ్ళు. అవి పేరున్న కంపెనీలు కాదు. అయినా సరే అదృష్టం బావుంటే హీరోయిన్ గా ఛాన్స్ వస్తుంది కదా అని ఆడిషన్స్ కి వెళ్లేదాన్ని. మీకు లోపల ఏమైనా మచ్చలు ఉన్నాయోమో చూడాలి. ఎందుకంటే మీరు మూవీలో స్విమ్ సూట్ వేసుకోవాలి. కాబట్టి బట్టలు తీసి మచ్చలు చూపించండి అని అడిగారు. స్విమ్ షూట్ వేసుకోవాలి అంటే సినిమాలో వేసుకుంటాను. ఇక్కడ మీకెందుకు చూపిస్తాను. ఆ అవసరం ఏంటి అని అడిగేదాన్ని. వాళ్ళ ఉద్దేశం అర్థం అయ్యాక అక్కడి నుంచి వెళ్లిపోయేదాన్ని అని ఆమని తెలిపారు. బహుశా అలాంటి మైండ్ సెట్ ఉండి, తప్పనిసరిగా హీరోయిన్ కావాలి అని అనుకునే అమ్మాయిలు చూపిస్తారేమో. నేను మాత్రం అలా చేయను అని ఆమని అన్నారు. మరో సంఘటన కూడా ఎదురైంది. హీరో డైరెక్టర్ కాదు ఏకంగా ఫైనాన్షియర్ తో కమిట్మెంట్ అడిగారు.