
AP EAPCET 2026 Results| ఇంటర్నెట్ డెస్క్: ఏపీలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు జేఎన్టీయూ కాకినాడ ఆధ్వర్యంలో జరిగిన ఎప్‌సెట్ (EAPCET 2026) ఫలితాల కోసం లక్షలాది మంది విద్యార్థులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమైతే నేడే (జూన్ 1) ఈ ఫలితాలు విడుదల కావాల్సి ఉన్నప్పటికీ.. ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఇంప్రూవ్‌మెంట్ రాసేందుకు అవకాశం ఇచ్చినందున ఎలాంటి గందరగోళం లేకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఆ ఫలితాలు వెల్లడయ్యాకే ఎప్‌సెట్ ఫలితాలను ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో జూన్ మూడో వారంలో ఈ రోజైనా ఎప్‌సెట్ ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఎప్‌సెట్‌లో ఇంటర్ మార్కులకు 25% వెయిటేజీ ఉంది. ఈ నేపథ్యంలో ర్యాంకుల్లో మార్పు, విద్యార్థుల్లో గందరగోళం తలెత్తకుండా చూసే ఉద్దేశంతో అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు వచ్చిన తర్వాత ఎప్‌సెట్ ఫలితాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. సాధ్యమైనంత త్వరగా ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల చేయాలని ఇంటర్మీడియట్ విద్యామండలికి పాఠశాల విద్య కార్యదర్శి కోన శశిధర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఇంప్రూవ్‌మెంట్ రాస్తున్నవారిలో ఒక్క గణితం సబ్జెక్టు వారే దాదాపు లక్ష మంది దాకా ఉన్నారు. జూన్ 5తో ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ముగియనుండటంతో మూల్యాంకన ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేసి ఫలితాలు విడుదల చేసే దిశగా విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 16-18 మధ్య ఎప్‌సెట్ ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోవైపు, గత నెల 12 నుంచి 20 వరకు జరిగిన ఎప్‌సెట్ పరీక్షకు దాదాపు 3.29లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరైన విషయం తెలిసిందే.