
దేశ అత్యున్నత న్యాయస్థానం విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నూతనంగా అయిదుమంది న్యాయమూర్తుల నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ ఆమోదముద్ర వేసింది. దీంతో సుప్రీంకోర్టుకు అయిదుమంది నూతన న్యాయమూర్తులు నియమితులయ్యారు.ఈ నియామకాలతో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 37కి పెరిగింది. మొత్తం మంజూరైన న్యాయమూర్తుల సంఖ్య 38. కాగా ఇప్పుడు ఒక్క ఖాళీ మాత్రమే మిగిలింది. కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ కొద్దిసేపటి కిందటే నోటిఫికేషన్లను ఇచ్చింది.సీనియర్ సుప్రీంకోర్టు న్యాయవాది వెంకిట సుబ్రహ్మణ్యం మోహన, బొంబాయి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రశేఖర్, పంజాబ్-హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ షీల్ నాగు, మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ సచ్‌దేవా, అలాగే జమ్మూకాశ్మీర్-లడఖ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ పల్లి.. సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నామినేట్ అయ్యారు.వీరి పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం కిందటి నెల 27న కేంద్రానికి సిఫారసు చేసింది. వీరందరూ బాధ్యతలు స్వీకరించిన తర్వాత సుప్రీంకోర్టులో మొత్తం జడ్జీల సంఖ్య 37కు పెరుగుతుంది. ప్రస్తుతం అక్కడ పని చేస్తోన్న జడ్జీల సంఖ్య 32. మొత్తం శాంక్షన్డ్ జడ్జీల సంఖ్య 38. ఈ సంఖ్య కంటే తక్కువగా ఉంటోండటం వల్ల కేసుల విచారణలో జాప్యం జరుగుతోందని కేంద్ర ప్రభుత్వం భావించింది.ఈ నేపథ్యంలో గత నెలలో ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా సుప్రీంకోర్టుకు ప్రధాన న్యాయమూర్తితో కలిపి మంజూరైన జడ్జీల సంఖ్యను 38కి పెంచింది. దీనికంటే ముందు రెండు ఖాళీలు ఉండేవి. జడ్జీల సంఖ్యాబలం పెరిగిన తర్వాత మొత్తం ఆరు పోస్టులు ఖాళీ అయ్యాయి. వీటిలో అయిదింటిని భర్తీ చేసింది కేంద్రం. ఇప్పుడు ఒకే ఖాళీ మాత్రమే మిగిలివుంది.