translateexpand_more

Employment Guarantee Workers Face Recognition News

Latest updates from Telugu Digital news sources.

Samayam Telugu03 Jun, 04:38 pm
ఉపాధి కూలీలకు 'గుండు గండం'.. మనోళ్ల తెలివికి హ్యాట్సాఫ్

ఉపాధి కూలీలను కొత్త కష్టాలు వెంటాడుతున్నాయి. ఉపాధి హామీ పథకంలో పారదర్శకత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఫేసియల్ రికగ్నిషన్ యాప్ తీసుకువచ్చింది. ఈ యాప్ సాయంతో రెండు పూటలా హాజరు నమోదు చేస్తే గానీ.. పనికి వెళ్లినట్లు రిజిస్టర్ కాదు. దీంతో ఉపాధి కూలీలు అవస్థలు పడుతున్నారు. కొన్నిచోట్ల సిగ్నల్ రాక అవస్థలు పడుతుంటే.. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఉపాధి కూలీల కష్టాలు మాత్రం మరోలా ఉన్నాయి. గుండు కారణంగా అక్కడ కొంతమంది కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీర్నపల్లి మండలం ఎర్రగడ్డ తండాకు చెందిన నలుగురు వ్యక్తులు ఉపాధి కూలీలుగా పనిచేస్తున్నారు. అయితే ఇటీవల ఈ నలుగురు వేములవాడ రాజన్న ఆలయానికి వెళ్లారు. స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆ తర్వాత ఉపాధి పనులకు వెళ్తే మనోళ్లకు షాక్ తగిలింది. గుండుతో ఉన్న నలుగురిని ఫేస్ యాప్ గుర్తించలేదు. దీంతో వారి హాజరు నమోదు కాలేదు. ఇక ఈ సమస్యకు పరిష్కారం కోసం మనోళ్లు చూపించిన తెలివితేటలు నవ్వులు పూయిస్తున్నాయి. తలమీద నల్లటి సీట్ కవర్ కప్పుకుని, రంగుతో మీసాలు దిద్దుకుని ఫోటోలు దిగారు. వీరి ప్రయత్నం ఫలించి ఫేస్ యాప్ వీరిని గుర్తించినట్లు తెలిసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. గుండు వల్ల వీరిని గుర్తుపట్టని యాప్... మీసాలు గీస్తే మాత్రం గుర్తుపట్టిందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. నంద్యాల జిల్లాలోనూ ఇదే తీరు..అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లాలోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. నంద్యాల జిల్లా డోన్ మండలంలోని ధర్మవరం గ్రామంలోనూ ఉపాధి హామీ కూలీలకు ఫేస్ యాప్ కష్టాలు వెంటాడుతున్నాయి. హరిజన మద్దిలేటి అనే వ్యక్తి గుండు తీయించుకోవటంతో ఫేస్ యాప్‍లో హాజరు పడక ఇబ్బందులు పడ్డారు. అయితే తోటి కూలీలు అతనికి విగ్గు పెట్టిన తరువాత హాజరు నమోదైంది. ఈ తతంగాన్ని పక్కనున్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయటంతో.. వీడియో నవ్వులు పూయిస్తోంది. మరోవైపు ఫేస్ యాప్‌లో ఈ సమస్యను పరిష్కరించాలని అధికారులను ఉపాధి కూలీలు కోరుతున్నారు.