translateexpand_more

How To Keep Monkeys Away News

Latest updates from Telugu Digital news sources.

NTV Telugu03 Jun, 11:28 am
కోతులు ఇబ్బంది పెడుతున్నాయా..? శాశ్వతంగా తరిమికొట్టే అద్భుతమైన చిట్కాలు

Monkey Control Tips: రోజు రోజుకు అంతరించిపోతున్న పంటపొలాలు, అడవులతో కోతులు ఇప్పుడు సమీపంలోని పట్టణాలు, గ్రామాల్లోకి వచ్చేస్తున్నాయి.. ఇళ్ల పైకప్పులు, బాల్కనీలు, టెర్రస్‌లపై కోతుల సంచారం పెరుగుతుంది. ఇవి మొక్కలను ధ్వంసం చేయడమే కాకుండా, ఇంట్లోకి చొరబడి విలువైన వస్తువులను పాడుచేయడం కూడా సాధారణంగా కనిపిస్తోంది. కొన్నిసార్లు చిన్నపిల్లలు, వృద్ధులపై కూడా దాడి చేసే ప్రమాదం ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే, కోతులను ఎలాంటి హాని కలిగించకుండా దూరంగా ఉంచేందుకు కొన్ని శాస్త్రీయ, సులభమైన పద్ధతులు ఉన్నాయని అంతర్జాతీయ వన్యప్రాణి నిపుణులు సూచిస్తున్నారు. ఈ చిట్కాలను పాటించడం ద్వారా మీ బాల్కనీ, టెర్రస్‌ను కోతుల నుంచి రక్షించుకోవచ్చు. ఘాటైన వాసనలు కోతులకు అసహ్యం కోతులకు వాసన పసిగట్టే శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. కొన్ని రకాల ఘాటైన వాసనలను అవి అస్సలు ఇష్టపడవు. నిపుణుల సూచనల ప్రకారం, వెనిగర్ లేదా వెల్లుల్లి రసాన్ని బాల్కనీ, టెర్రస్ మూలల్లో చల్లడం వల్ల కోతులు ఆ ప్రాంతానికి రావడానికి వెనుకాడతాయి. అలాగే వెనిగర్‌లో నానబెట్టిన దూది గుడ్డలు లేదా జనపనార సంచులను రెయిలింగ్‌లకు కట్టడం ద్వారా కూడా కోతులను దూరంగా ఉంచవచ్చు. ఈ వాసన సహజ నివారిణిగా పనిచేస్తుంది. బొమ్మ పాములతో భయపెట్టండి కోతులకు పాములంటే సహజసిద్ధంగా భయం ఉంటుంది. ఈ లక్షణాన్ని ఉపయోగించుకుని మార్కెట్‌లో లభించే పెద్ద ప్లాస్టిక్ లేదా రబ్బరు పాములను టెర్రస్‌పై, బాల్కనీలో లేదా చెట్ల కొమ్మల వద్ద ఉంచితే కోతులు ఆ ప్రాంతానికి చేరువ కావడానికి భయపడతాయి. వన్యప్రాణి నియంత్రణ నిపుణుల అభిప్రాయం ప్రకారం, పాముల మాదిరిగా కనిపించే బొమ్మలు కోతులను భయపెట్టి దూరంగా ఉంచడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. మెరిసే, కదిలే వస్తువులు కూడా ఉపయోగకరం కోతులు ఆకస్మికంగా కదిలే లేదా మెరిసే వస్తువులను చూసి అసౌకర్యంగా భావిస్తాయి. అందుకే బాల్కనీలో పాత సీడీలు, రిఫ్లెక్టివ్ టేపులు లేదా అల్యూమినియం ఫాయిల్ ముక్కలను వేలాడదీయాలని నిపుణులు సూచిస్తున్నారు. గాలి వీచినప్పుడు ఇవి కదలడంతో పాటు కాంతిని ప్రతిబింబిస్తాయి. దీంతో కోతులు భయపడి ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లే అవకాశం ఉంటుంది. జాగ్రత్తలే ఉత్తమ పరిష్కారం కోతుల బెడద ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఆహార పదార్థాలను బయట ఉంచకపోవడం, చెత్తను మూత ఉన్న డబ్బాల్లో వేయడం, టెర్రస్‌లపై పండ్లు లేదా తినుబండారాలు వదిలేయకుండా ఉండటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ చర్యలతో పాటు పై చిట్కాలను పాటిస్తే కోతుల బెడదను గణనీయంగా తగ్గించుకోవచ్చు. కాగా, గత కొన్ని సంవత్సరాలుగా చాలా ఊళ్లలో.. సమీపంలోని పట్టణాల్లో కోతుల బెడద ఎక్కువైంది.. చివరకు ఎన్నికల్లో తమను గెలిపిస్తే.. కోతులను తరిమేస్తామంటూ హామీ ఇచ్చి ఎన్నికల్లో గెలిచినవారు కూడా లేకపోలేదు..

How To Keep Monkeys Away News Keyword | Telugu Digital