translateexpand_more

India Us Trade Deal News

Latest updates from Telugu Digital news sources.

Samayam Telugu02 Jun, 12:32 pm
ట్రంప్ సరికొత్త అస్త్రం.. భారత్- అమెరికా వాణిజ్య చర్చల్లో తెరపైకి 'సెక్షన్ 301' మోదీ సర్కార్ కు టెన్షన్

India US Trade Deal: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. గతంలో భారత్‌పై భారీగా దిగుమతి సుంకాల్ని విధించిన సంగతి తెలిసిందే. ముందుగా అమెరికా ఉత్పత్తులపై భారత్ భారీగా సుంకాల్ని విధిస్తుందని ఆరోపిస్తూ.. ట్రంప్ తొలుత భారత్‌పై సుంకాల్ని ఒకేసారి 25 శాతానికి పెంచారు. తర్వాత రష్యాతో చమురు కొనుగోలు చేస్తుందన్న కారణంతో దీనిని రెట్టింపు చేసి 50 శాతానికి చేర్చారు కూడా. ఆ 25 శాతం సుంకాల్ని.. ప్రతీకార సుంకాలుగా పేర్కొన్నారు. ఆ తర్వాత రెండు దేశాల మధ్య చర్చలతో ప్రతీకార సుంకాల్ని తొలగించి.. మొత్తం సుంకాల్ని 18 శాతానికి తగ్గించారు. ఇక ట్రంప్ భారత్ సహా పలు దేశాలపై దిగుమతి సుంకాల్ని విధించగా.. అవి చెల్లవంటూ అమెరికా సుప్రీం కోర్టు గతంలో తీర్పు వెలువరించగా.. ట్రంప్ కొత్త అస్త్రాన్ని తెరపైకి తీసుకొచ్చారు.అదే సెక్షన్ 301. దీని కింద.. తమ వాణిజ్య భాగస్వాములపై అమెరికా దర్యాప్తు చేసేందుకు వీలు కల్పిస్తుంది. అప్పుడు దానికి అనుగుణంగా టారిఫ్స్ విధించే వీలుంటుంది. దీనిని ఎవరూ అడ్డుకోలేరు. ఇప్పుడు భారత్- అమెరికా మధ్య చర్చలు తుది దశకు వచ్చి ఒప్పందానికి చేరువైన నేపథ్యంల ో సెక్షన్ 301 మళ్లీ తెరపైకి వచ్చింది. ఇదే భారత్‌ను ఆందోళనకు గురి చేస్తోంది. అసలు ఈ సెక్షన్ 301 ఏంటి.. అమెరికా ఏం చేస్తుందనేది తెలుసుకుందాం.భారత్- అమెరికా చర్చలు.. భారత్ అమెరికా చాలా కాలంగా వాణిజ్య ఒప్పందానికి సంబంధించి చర్చలు జరుపుతున్నాయి. ఇప్పుడు కూడా న్యూఢిల్లీలో కీలక చర్చలు కొనసాగుతున్నాయి. యూఎస్ ప్రధాన వాణిజ్య చర్చల ప్రతినిధి బ్రెండన్ లించ్ నేతృత్వంలోని బృందం జూన్ 1- 4 వరకు భారత్‌లోని అధికారులతో సమావేశం అవుతోంది. ఈ చర్చల్లోనే మధ్యంతర వాణిజ్య ఒప్పందం సహా విస్తృత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపైనా చర్చలు జరుగుతున్నాయి.సెక్షన్ 301 తోనే అసలు చిక్కు.. అసలిదేంటి? అయితే ఈ చర్చలన్నింటికీ ఇప్పుడు సెక్షన్ 301 అనేది కేంద్ర బిందువుగా మారింది. ఇది అమెరికా ట్రేడ్ యాక్ట్ - 1974 కింద ఉంటుంది. ఇప్పుడు ఇదే భారత ప్రభుత్వాన్ని కొత్త ఆందోళనకు గురిచేస్తోంది. సెక్షన్ 301 ప్రకారం.. అమెరికా వ్యాపార ప్రయోజనాలకు ఇతర దేశాల వాణిజ్య విధానాలు నష్టాల్ని కలిగిస్తున్నాయా లేదా అని దర్యాప్తు చేసే వీలుంటుంది. సుప్రీం కోర్టు కూడా ఆపలేదు.. అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్.. ఇక్కడ విచారించే అధికారం కలిగి ఉంటుంది. విచారణలో అమెరికా వాణిజ్య భాగస్వామ్య దేశం అన్యాయ వాణిజ్య పద్ధతులు అనుసరిస్తుందని తేలితే మాత్రం అమెరికా.. ఎవరి అనుమతి లేకుండా.. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ సహా అమెరికా సుప్రీం కోర్టు ఆదేశాలతో పని లేకుండా అదనపు సుంకాలు లేదా ఇతర వాణిజ్య పరిమితుల్ని విధించే వీలు పడుతుంది. గతంలో చైనాపై ప్రయోగం.. 2018లో అమెరికా.. చైనాపై భారీ సుంకాల్ని విధించేందుకు ఇదే సెక్షన్ 301 ను ఉపయోగించింది. దీంతో అప్పటి నుంచే ఈ చట్టం.. ప్రపంచ వాణిజ్య రంగంలోనే అత్యంత ప్రభావవంతమైన ఆయుధంగా గుర్తింపు పొందింది. ఈ క్రమంలోనే అమెరికా సుప్రీం కోర్టు తీర్పు తర్వాత.. సెక్షన్ 301 కింద అదనపు సుంకాల్ని విధిస్తానని ట్రంప్ పలుమార్లు బహిరంగంగానే చెబుతూ వస్తున్నారు. భారత్‌పై ఇప్పుడు ఎందుకు దృష్టి? 2026 మార్చిలోనే అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం.. భారత్ సహా చైనా, సౌత్ కొరియా, జపాన్, యూరోపియన్ యూనియన్ తదితర దేశాలపై సెక్షన్ 301 విచారణ ప్రారంభించినట్లు తెలుస్తోంది. అమెరికా ఆరోపణల ప్రకారం కొన్ని రంగాల్లో భారత్.. అధిక ఉత్పత్తి సామర్థ్యం సృష్టిస్తోంది. ప్రధానంగా స్టీల్, సోలర్ మాడ్యూల్స్, రసాయనాలు, పెట్రోకెమికల్స్, టెక్స్‌టైల్స్, ఆటోమొబైల్ భాగాలు వంటి రంగాల్లో దేశీయ అవసరాలకు మించి ఉత్పత్తి సామర్థ్యం పెంచుతోందని ట్రంప్ సర్కార్ భావిస్తోంది. భారత్‌ ఎందుకు ఆందోళన చెందుతోంది? అమెరికా- భారత్ ట్రేడ్ డీల్ ద్వారా భారత ఎగుమతులకు అమెరికా మార్కెట్లో ప్రాధాన్యం పెరగాలని మోదీ సర్కార్ భావిస్తోంది. అయితే ట్రేడ్ డీల్ కుదిరిన తర్వాత కూడా సెక్షన్ 301 కింద అమెరికా అదనంగా కొత్త సుంకాలు విధిస్తే.. ఆ ఒప్పందం కలిగే ప్రయోజనాలు చాలా వరకు తగ్గిపోతాయని చెప్పొచ్చు. ఈ క్రమంలోనే.. ట్రేడ్ డీల్ తర్వాత సెక్షన్ 301 కింద భారత ఉత్పత్తులపై అదనపు సుంకాలు విధించబోమని అమెరికా నుంచి హామీ కోరుకుంటోంది. 99 శాతం పూర్తయిన చర్చలు.. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకారం.. భారత్- అమెరికా వాణిజ్య చర్చలు దాదాపు 99 శాతం పూర్తయ్యాయి. జులై చివరి నాటికి అమెరికా.. భారత్‌పై తగ్గించిన సుంకాల గడువు పూర్తవుతుంది. అందుకే.. ఆలోపు మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని రెండు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ప్రస్తుతం న్యూఢిల్లీ చర్చలు రెండు దేశాల వాణిజ్య సంబంధాల భవిష్యత్తును నిర్ణయించనున్నట్లు తెలుస్తోంది. ఇక్కడే సెక్షన్ 301 పేరుతో కొత్త సుంకాల ముప్పు లేకుండా రక్షణ పొందాలని చూస్తోంది.