translateexpand_more

Jamieson Greer News

Latest updates from Telugu Digital news sources.

Oneindia Telugu03 Jun, 05:16 am
భారత్ పై అమెరికా టారిఫ్ బాంబ్.. 12.5శాతం అదనపు సుంకాల విధింపు

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని సర్కారు అంతర్జాతీయ వాణిజ్యంలో మరోసారి అత్యంత కఠినమైన నిర్ణయానికి తెరలేపింది. ఇండియాతో సహా ప్రపంచవ్యాప్తంగా సుమారు 60 దేశాలపై అదనపు వాణిజ్య సుంకాలు విధించేందుకు అమెరికా సిద్ధమైంది. వివిధ రంగాల్లో వెట్టిచాకిరి నిర్మూలనలో, అటువంటి శ్రమతో తయారైన వస్తువుల దిగుమతులను అడ్డుకోవడంలో ఆయా దేశాలు విఫలమయ్యాయనే నెపంతో యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ ఈ ప్రతిపాదనలను ముందుకు తెచ్చింది. ఈ పరిణామం ప్రపంచవ్యాప్తంగా సరికొత్త వాణిజ్య యుద్ధానికి దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ ప్రతిపాదనలపై యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ అంబాసిడర్ జెమీసన్ గ్రీర్ స్పందిస్తూ కీలక కామెంట్స్ చేశారు. వెట్టిచాకిరి చేసే కార్మికులతో వస్తువులను తయారు చేయించి, వాటి దిగుమతులపై నిషేధాన్ని సరిగ్గా అమలు చేయకపోవడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. తమ అత్యంత ముఖ్యమైన వాణిజ్య భాగస్వామ్య దేశాలు కూడా ఈ విషయాన్ని అరికట్టలేకపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి చట్టవిరుద్ధమైన చర్యల కారణంగా అంతర్జాతీయ లేబర్ మార్కెట్‌లో అమెరికా కార్మికులకు తీవ్రమైన, అసమానమైన పోటీ ఎదురవుతోందని, ఈ విధమైన అసమానతలను అమెరికా ఇకపై ఎంతమాత్రం సహించబోదని ఆయన ఓ అధికారిక ప్రకటనలో వెల్లడించారు.ఈ వివాదానికి సంబంధించి యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ మొత్తం 60 దేశాలపై సుదీర్ఘమైన దర్యాప్తు జరిపింది. ఈ విచారణ అనంతరం నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించిన 54 దేశాలపై ఏకంగా 12.5 శాతం అదనపు సుంకాలను విధించాలని ప్రతిపాదించింది. ఈ జాబితాలో ఇండియాతో పాటు చైనా, జపాన్, బ్రెజిల్, ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్‌డమ్, సౌదీ అరేబియా వంటి పెద్ద ఆర్థిక వ్యవస్థలు ఉన్నాయి. ఈ దేశాలన్నీ కూడా వెట్టిచాకిరి ద్వారా వచ్చే దిగుమతులను నిషేధించడంలో పూర్తిగా విఫలమైనట్లు యూఎస్‌టీఆర్ తన నివేదికలో పేర్కొంది.మరోవైపు కెనడా, ఈక్వెడార్, యూరోపియన్ యూనియన్, ఇండోనేసియా, మెక్సికో, పాకిస్థాన్ వంటి దేశాలు ఈ దిగుమతులపై చట్టపరంగా నిషేధం విధించినప్పటికీ.. క్షేత్రస్థాయిలో వాటిని సమర్థవంతంగా అమలు చేయలేకపోయాయని అమెరికా ఆరోపించింది. నిబంధనల అమలులో అలసత్వం వహించినందుకు గానూ ఈ దేశాలపై 10 శాతం మేర అదనపు సుంకాలు విధించాలని యూఎస్‌టీఆర్ సూచించింది. అయితే ఈ సుంకాల విధింపుపై సదరు దేశాలకు తమ వాదనలను వినిపించేందుకు అమెరికా ఒక అవకాశం ఇచ్చింది. ఈ సుంకాలపై చర్చలు జరిపేందుకు ఆయా దేశాలు జూన్ 22, 2026 లోగా తమను సంప్రదించవచ్చని డెడ్‌లైన్ విధించింది.అమెరికా చేసిన ఈ తీవ్రమైన ఆరోపణలను ఇండియా చాలా గట్టిగా ఖండించింది. వెట్టిచాకిరి జరుగుతోందంటూ యూఎస్‌టీఆర్ చేసిన వాదనల్లో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేసింది. ఇరు దేశాల మధ్య ఇప్పటికే ద్వైపాక్షిక వాణిజ్య చర్చలు జరుగుతున్న తరుణంలో, ఇలాంటి సున్నితమైన అంశాలను ఆ చర్చల వేదికపైనే పరిష్కరించుకోవాలి తప్ప, ఇలా ఏకపక్షంగా ఆంక్షలు విధించడం సరికాదని భారత్ హితవు పలికింది. అంతేకాకుండా ఇండియాను లక్ష్యంగా చేసుకుని అమెరికా చేపట్టిన ఈ దర్యాప్తును తక్షణమే నిలిపివేయాలని భారత ప్రభుత్వం గట్టిగా డిమాండ్ చేసింది.