2026 ఐపీఎల్ సీజన్ విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నిలిచింది. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు మీద ఆర్సీబీ ఏకపక్షంగా విజయం సాధించింది. కింగ్ విరాట్ కోహ్లీ సత్తా చాటటంతో లక్ష్యాన్ని అలవోకగా ఛేదించిన బెంగళూరు.. ఐపీఎల్ ట్రోఫీని వరుసగా రెండోసారి ముద్దాడింది. అయితే ఐపీఎల్ విజేతగా ఆర్సీబీ అవతరించిన అనంతరం దేశవ్యాప్తంగా ఆర్సీబీ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో రోడ్లపైకి చేరి చిందులు వేశారు. అయితే ఆర్సీబీ అభిమానుల సంబరాలు కొన్నిచోట్ల శ్రుతిమించటంతో పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. కర్నూలు నగరంలోనూ ఆదివారం రోజు రాత్రి ఆర్సీబీ ఫ్యాన్స్ వీరంగం సృష్టించారు. ఆదివారం రోజు అర్ధరాత్రి రాజ్ విహార్ సర్కిల్ వద్ద కొంతమంది ఆర్సీబీ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. అయితే ఈ సంబరాలు శ్రుతి మించి ప్రజల ఆస్తులను ధ్వంసం చేసే వరకూ వెళ్లాయి. కొంతమంది ఫ్యాన్స్ రోడ్డుపై ఉన్న బారికేడ్లను కిందపడేసి హంగామా సృష్టించారు. మరికొందరు మూడు ప్రైవేటు బస్సులపై దాడి చేసి.. వాటి అద్దాలను ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో స్థానికులు కొంతమంది ఈ విషయంపై పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న కర్నూలు పోలీసులు .. వెంటనే పరిస్థితిని చక్కదిద్దారు. ఈ దాడికి పాల్పడిన ఆకతాయిలను సీసీ కెమెరాలను పరిశీలించి పోలీసులు గుర్తించారు. పక్కా ఆధారాలతో 18 మంది ఆకతాయిలను అదుపులోకి తీసుకున్నారు. ప్రజా ఆస్తులకు నష్టం కలిగించిన ఈ 18 మంది యువకులకు కర్నూలు పోలీసులు వినూత్న రీతిలో గుణపాఠం నేర్పించారు. ఆకతాయిలకు తగిన రీతిలో బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో అదుపులోకి తీసుకున్న అనంతరం కర్నూలు పోలీసులు వారిని పోలీసు స్టేషన్ నుంచి మున్సిఫ్ కోర్టు వరకు నడిపించారు. నడిరోడ్డుపై నడిపిస్తూ వెళ్లటం ద్వారా ఇలాంటి ఆకతాయి పనులు చేస్తే కఠిన చర్యలు తప్పవనే వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు హైదరాబాద్‌లోనూ ఆర్సీబీ ఫ్యాన్స్ మీద పోలీసులు లాఠీఛార్జి చేసిన సంగతి తెలిసిందే.
Kurnool Rcb Fans News
Latest updates from Telugu Digital news sources.
Samayam Telugu01 Jun, 04:41 pm
రచ్చ రచ్చ చేసిన ఆర్సీబీ ఫ్యాన్స్.. నడిరోడ్డుపై నడిపించిన పోలీసులు