translateexpand_more

Logistics Hub Khammam News

Latest updates from Telugu Digital news sources.

Samayam Telugu02 Jun, 01:45 am
డీమార్ట్ తరహాలో మహిళా శక్తి సూపర్ బజార్లు.. 9 జిల్లాల్లో ఏర్పాటు, సర్కార్ ఆదేశాలు జారీ

తెలంగాణలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక బలోపేతమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ప్రణాళికలను అమలు చేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు.. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా మహిళా సూపర్‌ బజార్లు, లాజిస్టిక్స్‌ హబ్‌లు, ఆధునిక రైస్‌మిల్లులను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్‌ వేగంగా అడుగులు వేస్తోంది. మహిళా సంఘాల ద్వారానే వీటిని సమర్థవంతంగా నిర్వహించి, వారిని వ్యాపారవేత్తలుగా మార్చాలనేది ప్రభుత్వ ప్రధాన సంకల్పం.ఈ బృహత్తర ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో వేగవంతం చేసేందుకు సెర్ప్‌ సీఈవో దివ్యా దేవరాజన్‌ సోమవారం రెవెన్యూ, పౌరసరఫరాల శాఖల ఉన్నతాధికారులతో అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో తొలి దశ కార్యాచరణపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అన్ని నియోజకవర్గాల్లో ఒకేసారి కాకుండా.. ప్రాథమికంగా తొమ్మిది ఉమ్మడి జిల్లా కేంద్రాలైన హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్, సంగారెడ్డిలలో ఒక్కొక్కటి చొప్పున మహిళా శక్తి సూపర్‌ బజార్లను స్థాపించాలని ప్రతిపాదించారు. ప్రముఖ రిటైల్ సంస్థ డీమార్ట్ తరహాలోనే ఈ సూపర్ బజార్లలో ప్రజలకు అవసరమైన అన్ని రకాల నిత్యావసర సరకులు, గృహోపకరణాలు, వివిధ రకాల పరికరాలను తక్కువ ధరలకే విక్రయించేలా ఖమ్మంలో మొదటి పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్నారు.ఈ సూపర్ బజార్ల నిర్మాణానికి జనాభా సాంద్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో సుమారు 5 వేల గజాల స్థలం అవసరమని సెర్ప్ అధికారులు గుర్తించారు. అనువైన ప్రభుత్వ భూముల సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ ఆయా జిల్లాల కలెక్టర్లకు తక్షణమే లేఖలు రాయాలని నిర్ణయించారు. మరోవైపు.. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం జిల్లాలో లాజిస్టిక్స్‌ హబ్, రైస్‌మిల్లు ఏర్పాటుకు అవసరమైన పూర్తి సహకారం అందిస్తామని, ప్రభుత్వ స్థలాన్ని కేటాయిస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఖమ్మం జిల్లాలో భారీ గోదాం, లాజిస్టిక్స్ హబ్, రైస్ మిల్లుల స్థాపన కోసం దాదాపు 20 ఎకరాల భూమిని కేటాయించాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌కు ప్రత్యేక ప్రతిపాదనలు పంపేందుకు సెర్ప్ సిద్ధమైంది.ఈ మెగా ప్రాజెక్టుల విజయవంతమైన నిర్వహణకు గానూ.. ఆయా జిల్లాల్లో సమర్థవంతంగా పనిచేస్తున్న మహిళా సమాఖ్యలను ఎంపిక చేయాలని క్షేత్రస్థాయి అధికారులకు సెర్ప్ ఆదేశాలు జారీ చేసింది. ఖమ్మంలో నిర్మించబోయే లాజిస్టిక్స్ హబ్, రైస్ మిల్లులకు సంబంధించి ఏ మండలంలో అయితే భూమిని ఎంపిక చేస్తారో అదే మండలానికి చెందిన మహిళా సమాఖ్యకే పూర్తి నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించాలని అధికారులు భావిస్తున్నారు. భవిష్యత్తులో మిగిలిన జిల్లాల్లోనూ ఇదే తరహా ప్రాజెక్టులు రానున్నందున.. రాష్ట్రంలోని అన్ని మహిళా సమాఖ్యలు ఆర్థిక నిర్వహణకు, వ్యాపార బాధ్యతలకు సిద్ధంగా ఉండాలని సెర్ప్ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో తెలంగాణ మహిళా లోకంలో సరికొత్త ఉపాధి విప్లవం రానుంది.

Logistics Hub Khammam News Keyword | Telugu Digital