ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నెలా ఒకటో తేదీన ఎన్టీఆర్ భరోసా కింద పింఛన్ డబ్బుల్ని పంపిణీ చేస్తోంది. ఒకవేళ 1వ తేదీ పింఛన్ తీసుకోని వాళ్ల కోసం మరో రెండు రోజులు తీసుకునే అవకాశం కల్పించారు. అంతేకాదు వరుసగా మూడు నెలలు డబ్బులు తీసుకోకపోతే పింఛన్ రద్దు చేస్తారు. అలాగే మూడు నెలలకోసారి పింఛన్ తీసుకునే వెసులుబాటు కూడా కల్పించిన సంగతి తెలిసిందే. పింఛన్ లబ్ధిదారుడు వరుసగా రెండు నెలలు డబ్బులు తీసుకోకపోతే.. మూడో నెలలో కలిపి ఒకేసారి తీసుకునే అవకాశం కల్పించారు. పొరపాటున ఎవరైనా మూడు నెలలు తీసుకోకపోతే ఆ పింఛన్ రద్దు చేస్తారు. తలసీమియాతో బాధపడుతున్న ఓ బాలుడికి ఇలాంటి కష్టమే వచ్చింది.. అయితే అధికారులు స్పందించి బాలుడి పింఛన్ రద్దు కాకుండా కీలక నిర్ణయం తీసుకుని ప్రశంసలు అందుకున్నారు.ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం మాగల్లుకు చెందిన తమ్మిశెట్టి యశ్వంత్‌కుమార్ తలసీమియా వ్యాధితో బాధపడుతున్నారు. అతడికి బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో వైద్యం అందిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం తలసీమియా వ్యాధితో బాధపడేవారికి నెలకు రూ.10వేల చొప్పున పింఛన్ అందిస్తోంది. అయితే ఆ బాలుడు రెండు నెలలుగా ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న కారణంగా స్థానికంగా పింఛను డబ్బులు తీసుకోలేకపోతున్నారు. వరుసగా రెండు నెలల తీసుకోకపోవడంతో.. ఈ నెల కూడా తీసుకోకపోతే పింఛన్ రద్దవుతుంది.బాలుడి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ బాలుడి తల్లిదండ్రులు సచివాలయంలో వెటర్నరీ అసిస్టెంట్ గుంటి సైదులును కలిసి సమస్య గురించి వివరించారు. తమ కుమారుడు బెంగళూరులో ఉన్నాడని.. అక్కడికి వెళ్లి పింఛన్ అందించాలని కోరారు. ఒకవేళ పింఛన్ అందించకపోతే రద్దవుతుందని గుర్తుచేశారు. పెద్ద మనసుతో ఆలోచించిన వెటర్నరీ అసిస్టెంట్ సైదులు సోమవారం ఉదయానికి బెంగళూరు వెళ్లి ఆస్పత్రిలో బాలుడి బయోమెట్రిక్ తీసుకుని.. మూడు నెలల పింఛన్ డబ్బులు రూ.30 వేలు బాలుడి తండ్రికి అందజేశారు. బాలుడికి వైద్యం అందుతున్న ఈ సమయంలో ఈ డబ్బులు కూడా చాలా కీలకమని తల్లిదండ్రులు చెబుతున్నారు. తాము సమస్య చెప్పగానే స్పందించి బెంగళూరు వచ్చి పింఛన్ అందించిన సైదులుకు ధన్యవాదాలు తెలిపారు. సైదులు దాదాపు 14 గంటల పాటూ ప్రయాణించి బాలుడికి పింఛన్ బ్బుల్ని అందజేశారు. సైదుల్ని ఎంపీడీవో ప్రసాదరావు ప్రత్యేకంగా అభినందించారు. ఈ నెల కూడా డబ్బులు తీసుకోకపోతే నిబంధనల ప్రకారం పింఛన్ రద్దు చేస్తారు. అయితే సచివాలయ ఉద్యోగి మాత్రం మానవీయ కోణంలో ఆలోచించి పెద్ద మనసుతో ఆ బాలుడికి సాయం చేసి ప్రశంసలు అందుకున్నారు. వెటర్నరీ అసిస్టెంట్ సైదుల్ని అందరూ అభినందిస్తున్నారు.
Ntr Bharosa Pension Distributed In Bangalore News
Latest updates from Telugu Digital news sources.
Samayam Telugu02 Jun, 01:32 am
బెంగళూరు వెళ్లి బాలుడికి పింఛన్ డబ్బులు ఇచ్చారు.. ఈ ప్రభుత్వ ఉద్యోగిది ఎంత గొప్ప మనసు