translateexpand_more

Orr Greenfield Expressway News

Latest updates from Telugu Digital news sources.

Samayam Telugu03 Jun, 08:18 am
ఫ్యూచర్ సిటీ ఎక్స్ ప్రెస్ వే భూసేకరణ.. రైతులకు రికార్డు పరిహారం, ఎకరాకు ఎన్ని కోట్లంటే

తెలంగాణ రాజధాని పరిసర ప్రాంతాలలో, ముఖ్యంగా కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో భూముల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇటీవల రాయదుర్గం ఏరియాలో ప్రభుత్వం నిర్వహించిన వేలంలో ఎకరాకు రికార్డు స్థాయిలో రూ.204 కోట్లు పలికింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వివిధ ప్రాజెక్టుల కోసం రైతుల నుంచి భూములను సేకరించడం పెద్ద సవాలుగా మారింది. దీంతో భూసేకరణ ప్రక్రియ సజావుగా.. ఎలాంటి వివాదాలు లేకుండా సాగడం కోసం రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రికార్డు స్థాయి పరిహారం చెల్లించాల్సి వస్తోంది. తాజాగా ప్రతిపాదిత ఫ్యూచర్ సిటీకి అనుసంధానంగా ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ వరకు నిర్మించనున్న గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన కొందరు రైతులకు ప్రభుత్వం రికార్డు స్థాయిలో పరిహారం అందించింది. ఎకరాకు ఏకంగా రూ.1.24 కోట్ల చొప్పున భారీ పరిహారాన్ని అందజేసింది.రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌కు ఆనుకుని, ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ఉన్న కొంగర కలాన్, కొంగర ఖుర్ద్ గ్రామాల్లో ప్రస్తుతం బహిరంగ మార్కెట్ ధర ఎకరాకు రూ.8 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు పలుకుతోంది. ఈ ప్రాంతంలో ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం కోసం 15 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించింది. మార్కెట్ రేట్లు భారీగా ఉండటంతో జిల్లా యంత్రాంగం రైతులతో పలుమార్లు చర్చలు జరిపింది. చివరకు కుదిరిన ఒప్పందం ప్రకారం ఎకరాకు రూ.1.24 కోట్ల రికార్డు స్థాయి పరిహారాన్ని చెల్లించి భూములను స్వాధీనం చేసుకున్నట్లు రంగారెడ్డి జిల్లా ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఎక్స్‌ప్రెస్‌వే వెళ్లే మార్గంలోని ఇతర లొకేషన్లను బట్టి రైతులకు ఎకరాకు రూ.30 లక్షల నుంచి రూ.98 లక్షల వరకు అందజేశారు. మారుమూల ప్రాంతాల్లో మాత్రం ఎకరాకు రూ.15 లక్షల చొప్పున చెల్లిస్తున్నారు.కాగా, రావిర్యాల్ ఓఆర్ఆర్ నుంచి మీర్‌ఖాన్‌పేట్ మీదుగా ఆమన్‌గల్ వరకు రెండు విడతల్లో దాదాపు రూ.4600 కోట్ల అంచనా వ్యయంతో 300 అడుగుల వెడల్పైన గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టు కోసం మొత్తం 1500 ఎకరాల భూమి అవసరం కానుంది. ఫేజ్-1 కింద 447 ఎకరాల భూసేకరణ ఇప్పటికే పూర్తయింది. ఫేజ్-2 కింద మరో 558 ఎకరాల భూసేకరణ ప్రక్రియ ప్రస్తుతం వేగంగా సాగుతోంది. ఈ భారీ ఎక్స్‌ప్రెస్‌వే రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, కందుకూర్, కడ్తాల్, ఆమన్‌గల్ మండలాల గుండా వెళ్తుంది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన మొత్తం 1500 ఎకరాల భూమిలో దాదాపు 300 ఎకరాలు అటవీ భూమి కాగా.. మరో 200 ఎకరాలు తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈ రహదారి అందుబాటులోకి వస్తే ఫ్యూచర్ సిటీకి రవాణా కనెక్టివిటీ మరింత అద్భుతంగా మారనుంది.

Orr Greenfield Expressway News Keyword | Telugu Digital