translateexpand_more

Pak Vs Aus Highlights News

Latest updates from Telugu Digital news sources.

Samayam Telugu03 Jun, 03:05 am
పాకిస్తాన్ తుప్పు వదిలించిన ఆస్ట్రేలియా.. సొంతగడ్డపై చిత్తుచిత్తుగా ఓటమి

సొంతగడ్డపైనే పాకిస్తాన్‌ను ఆస్ట్రేలియా చిత్తుచిత్తుగా ఓడించింది. పాకిస్తాన్ వేదికగా జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలో పాకిస్తాన్ విజయం సాధించగా, రెండో వన్డేలో ఆస్ట్రేలియా గెలిచింది. మొదటి వన్డేలో ఆస్ట్రేలియాను 200 పరుగులకే ఆలౌట్ చేయగా.. రెండో వన్డేలో పాకిస్తాన్‌ను 190 పరుగులకే ఆలౌట్ చేసింది. సొంతగడ్డపై ఇంత దారుణంగా ఓడిపోవడంతో పాక్‌పై ఆ దేశ నెటిజన్లే ట్రోల్స్ చేస్తున్నారు. లాహోర్‌లోని గఢాఫీ స్టేడియం వేదికగా జరిగిన రెండో వన్డేలో టాస్ గెలిచిన పాకిస్తాన్ కెప్టెన్ షాహీన్ షా అఫ్రిది బౌలింగ్ ఎంచుకుని, ఆసీస్‌ను బ్యాటింగ్‌కి ఆహ్వానించాడు. మొదటి బంతికే షాహీన్ అఫ్రిది అలెక్స్ క్యారీని గోల్డెన్ డక్‌గా పెవిలియన్‌కు పంపాడు. మరో ఓపెనర్ మాథ్యూ షార్ట్ కూడా 15 పరుగులకే అవుటవ్వగా.. మొదటి వన్డేలో డకౌట్ అయిన మార్నస్ లబుషేన్, ఈ మ్యాచ్‌లో 5 పరుగులకే వికెట్ కోల్పోయాడు. దాంతో ఆస్ట్రేలియా 51 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. జట్టు కష్ట సమయంలో ఉండటంతో కెప్టెన్ జోస్ ఇంగ్లిస్, కామెరూన్ గ్రీన్ ఆదుకున్నారు. ఈ ఇద్దరూ హాఫ్ సెంచరీలు చేయడంతో ఆసీస్ గట్టున పడింది. ఇంగ్లిస్ 51, గ్రీన్ 53 పరుగులు చేసి అవుటయ్యారు. మ్యాట్ రెన్షా 43, ఒలీవర్ పీక్ 31 చేయడంతో ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. సొంతగడ్డపై ఈజీ టార్గెట్‌తో బరిలోకి దిగిన పాకిస్తాన్‌కు ఆస్ట్రేలియా బౌలర్లు షాక్ ఇచ్చారు. ఆసీస్ జట్టులో క్యారీ గోల్డెన్ డకౌట్ కాగా.. పాక్‌లో మాజ్ సదాఖత్ తొలి బంతికే అవుటయ్యాడు. షాహిబ్‌జాదా ఫర్హాన్ రెండో ఓవర్‌లో, బాబర్ ఆజామ్ ఐదో ఓవర్, సల్మాన్ అలీ అఘా 8వ ఓవర్‌లో అవుటవ్వడంతో పాకిస్తాన్ 44 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. అబ్దుల్ సమ్మద్, ఘాజీ ఘోరీ కూడా వెంటవెంటనే అవుటవ్వడంతో 78 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. 120 పరుగుల లోపే ఆలౌట్ అవుతారని అనుకున్న సమయంలో షాదాబ్ ఖాన్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. షాదాబ్‌కి తోడు ఆరాఫత్ మిన్హాస్ కూడా నిలబడటంతో పాక్ ఘోర ఓటమిని తప్పించుకుంది. షాదాబ్ 104 బంతుల్లో 71, అరాఫత్ 43 బంతుల్లో 33 పరుగులు చేసి అవుటవ్వడంతో పాకిస్తాన్ కథ ముగిసింది. 44 ఓవర్లకే 190 పరుగులకు ఆలౌట్ అయింది. దాంతో ఆసీస్ 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. నాలుగు వికెట్లు తీసుకున్న నాథన్ ఎలీస్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. మూడు వన్డేల సిరీస్‌లో చెరొక మ్యాచ్ గెలిచి సిరీస్ సమం చేశాయి.

Pak Vs Aus Highlights News Keyword | Telugu Digital