translateexpand_more

Preeclampsia Symptoms News

Latest updates from Telugu Digital news sources.

NTV Telugu03 Jun, 04:14 pm
లక్షణాలు లేకున్నా ప్రమాదమే.. గర్భధారణలో ఈ టెస్ట్ తప్పనిసరి

Pregnancy Care : గర్భధారణ సమయంలో కాబోయే తల్లులు సాధారణంగా మంచి పౌష్టికాహారం, తగినంత విశ్రాంతి, , కడుపులోని శిశువు ఎదుగుదలపైనే ఎక్కువ దృష్టి పెడుతుంటారు. అయితే, వీటన్నింటి మధ్య చాలామంది ఒక సాధారణ వైద్య పరీక్షను పెద్దగా పట్టించుకోరు. చేయడానికి కేవలం రెండు నిమిషాలు కూడా పట్టని ఆ పరీక్షే.. "రక్తపోటు (బీపీ) పరీక్ష". చాలా సందర్భాలలో అధిక రక్తపోటు ఉన్నప్పటికీ ఎలాంటి శారీరక అసౌకర్యం లేదా స్పష్టమైన లక్షణాలు కనిపించవు. అందుకే మహిళలు దీన్ని లైట్ తీసుకుంటారు. కానీ, ఈ చిన్న పరీక్షే తల్లి, బిడ్డ ఇద్దరి ప్రాణాలను కాపాడే ఒక సంజీవని లాంటిది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. గర్భధారణ సమయంలో బీపీ పరీక్ష ఎందుకు అంత ముఖ్యం? గర్భధారణ సమయంలో వచ్చే అధిక రక్తపోటు వల్ల గెస్టేషనల్ హైపర్‌టెన్షన్ , 'ప్రీఎక్లాంప్సియా' (Preeclampsia) వంటి తీవ్రమైన వైద్య సమస్యలు తలెత్తుతాయి. ప్రిఎక్లాంప్సియా అనేది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. దీనివల్ల రక్తపోటు అసాధారణంగా పెరిగిపోవడమే కాకుండా శరీరంలోని ఇతర అవయవాల పనితీరు కూడా దెబ్బతింటుంది. వైద్య నిపుణుల ప్రకారం.. ఈ పరిస్థితిని సకాలంలో గుర్తించకపోతే నెలలు నిండకుండానే ప్రసవం జరగడం, గర్భాశయంలో శిశువు ఎదుగుదల ఆగిపోవడం, ఉమ్మనీరు , ప్లాసెంటా (మాయ) సమస్యలు రావడం వంటి ఎన్నో సంక్లిష్టతలు ఎదురవుతాయి. సైలెంట్ కిల్లర్: లక్షణాలు లేకపోవడమే పెద్ద సమస్య! ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నివేదికల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ప్రసూతి మరణాలకు (గర్భిణుల మరణాలకు) గర్భధారణ సమయంలో వచ్చే అధిక రక్తపోటు సమస్యలే ప్రధాన కారణం. ఇందులో అత్యంత ఆందోళనకరమైన విషయం ఏంటంటే, ఈ సమస్య శరీరంలో అంతర్గతంగా పెరుగుతున్నా బయటకు ఎలాంటి సంకేతాలు కనిపించవు. గర్భిణి తాను పూర్తిగా ఆరోగ్యంగానే ఉన్నానని అనుకుంటుంది, కానీ లోపల ఒత్తిడి క్రమంగా పెరుగుతూ ఉంటుంది. కొంతమందిలో మాత్రం తీవ్రమైన తలనొప్పి, ముఖం , చేతులు వాపు రావడం, కంటిచూపు మసకబారడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తాయి. కానీ లక్షణాలు ఉన్నా లేకపోయినా క్రమం తప్పకుండా బీపీ చెక్ చేసుకోవడం ఒక్కటే దీనికి మార్గం. కేవలం రెండు నిమిషాల పరీక్ష.. ప్రాణాలకు రక్షణ! డిజిటల్ లేదా మాన్యువల్ బీపీ మిషన్ల ద్వారా సిస్టోలిక్, డయాస్టోలిక్ రక్తపోటు స్థాయిలను కొలవడం చాలా సులువు. దీనికి రెండు నిమిషాల కంటే తక్కువ సమయమే పడుతుంది. కానీ, గర్భధారణ వల్ల వచ్చే శారీరక మార్పులకు తల్లి శరీరం ఎలా స్పందిస్తోందో తెలుసుకోవడానికి వైద్యులకు ఇది కీలకమైన సమాచారాన్ని అందిస్తుంది. డేంజర్ బెల్స్ మోగించే "రోల్-ఓవర్ టెస్ట్" గర్భధారణ సమయంలో ముఖ్యంగా 28వ వారం నుండి 32వ వారం మధ్య కాలంలో వైద్యులు “రోల్-ఓవర్ టెస్ట్” (Roll-Over Test) అనే ప్రత్యేక పరీక్షను చేస్తుంటారు. ఈ పరీక్షలో భాగంగా గర్భిణిని మొదట ఎడమ వైపు తిరిగి పడుకోమని చెబుతారు, ఆ తర్వాత వెల్లకిలా (వీపు మీదకు) దొర్లి పడుకోమంటారు. ఇలా పొజిషన్ మార్చినప్పుడు ఒకవేళ డయాస్టోలిక్ రక్తపోటు 20 mmHg లేదా అంతకంటే ఎక్కువగా పెరిగితే, అది భవిష్యత్తులో రాబోయే ప్రమాదానికి హెచ్చరిక సంకేతం. రక్తనాళాలు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో తెలుసుకోవడానికి ఈ సింపుల్ టెస్ట్ ఎంతగానో సహాయపడుతుంది. శిశువుపై చూపే తీవ్ర ప్రభావం అధిక రక్తపోటు దుష్ప్రభావాలు కేవలం తల్లికే పరిమితం కావు, కడుపులోని బిడ్డపై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తాయి. బీపీ ఎక్కువగా ఉన్నప్పుడు ప్లాసెంటాకు (మాయకు) రక్తప్రసరణ తగ్గిపోతుంది. దీనివల్ల పుట్టబోయే బిడ్డకు అందాల్సిన ఆక్సిజన్, అవసరమైన పోషకాలు సరిగ్గా అందవు. ఫలితంగా తక్కువ బరువుతో శిశువు జన్మించడం, నెలలు నిండకుండానే డెలివరీ అవ్వడం, లేదా బిడ్డకు మూర్ఛలు (ఫిట్స్) రావడం వంటి ప్రాణాంతక సమస్యలు తలెత్తుతాయి. డాక్టర్లు చేసే "అత్యవసర త్రయం" పరీక్షలు కేవలం బీపీ పరీక్ష మాత్రమే కాకుండా, గర్భిణి ఆరోగ్యాన్ని పూర్తిగా అంచనా వేయడానికి వైద్యులు మూడు రకాల ముఖ్యమైన పరీక్షలు చేస్తారు. వీటిని "అత్యవసర త్రయం" (Emergency Triad) అని పిలుస్తారు. యూరిన్ ఆల్బుమిన్ పరీక్ష: మూత్రంలో ప్రోటీన్ లీక్ అవుతుందో లేదో చూసేందుకు. రక్త సూచికలు (యూరిక్ యాసిడ్ & క్రియాటినిన్): మూత్రపిండాల పనితీరును తెలుసుకోవడానికి. ప్లేట్‌లెట్ కౌంట్: రక్తంలో ప్లేట్‌లెట్స్ స్థాయిలను పర్యవేక్షించడానికి. ఈ పరీక్షల ద్వారా లోపల అవయవాలు ఎలా పనిచేస్తున్నాయో స్పష్టంగా తెలుస్తుంది కాబట్టి, ముందే జాగ్రత్త పడవచ్చు. గర్భధారణ సమయంలో ప్రతి చిన్న చెకప్ ఎంతో ముఖ్యం. రెండు నిమిషాల బీపీ పరీక్ష అనేది కేవలం ఒక లాంఛనం కాదు.. అది తల్లి, బిడ్డ ఇద్దరి సురక్షితమైన భవిష్యత్తుకు మార్గం. కాబట్టి, డాక్టర్ దగ్గరకు వెళ్లిన ప్రతిసారీ బీపీ చెక్ చేయించుకోవడం అస్సలు మర్చిపోకండి...