
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో దేశీయ ఇంధన సరఫరాల భద్రత దృష్ట్యా, రష్యా తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 30 వరకు ఏవియేషన్ ఫ్యూయల్ ఎగుమతులపై నిషేధం విధించింది. రిఫైనరీ ఉత్పత్తి తగ్గడం, ఇంధన మౌలిక సదుపాయాలపై ఒత్తిడి పెరగడం ఇందుకు కారణాలుగా తెలిపింది. దేశీయ ఇంధన మార్కెట్‌లో స్థిరత్వాన్ని నిర్ధారించడమే ఈ నిర్ణయం లక్ష్యం అని ప్రభుత్వం పేర్కొంది.ఉక్రెయిన్ దాడుల కారణంగా రష్యా ఇంధన సదుపాయాలపై ప్రభావం పడి, రిఫైనరీ ఉత్పత్తి రేట్లు గత కొన్ని సంవత్సరాల కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఈ నేపథ్యంలో డీజిల్, జెట్ ఫ్యూయల్ ఎగుమతులపై ఆంక్షలు విధించాలని మాస్కో యోచిస్తున్నట్లు వార్తలు వచ్చిన తర్వాత ఈ నిషేధం ప్రకటించారు. డిప్యూటీ ప్రధాని అలెగ్జాండర్ నోవాక్ అధ్యక్షతన జరిగిన సమావేశం అనంతరం.. ఆయిల్ కంపెనీలకు విదేశాలకు ఇంధన ఉత్పత్తుల విక్రయాలను తగ్గించుకోవాలని సూచించారు.ఉక్రెయిన్ ఇటీవల రష్యా ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులు తీవ్రతరం కావడంతో.. రిఫైనరీలు, పైప్‌ లైన్‌ లు దెబ్బతిన్నాయి. ఈ దాడులు రష్యా శుద్ధి సామర్థ్యాన్ని ప్రభావితం చేయడంతో.. అధిక డిమాండ్ సమయంలో దేశీయ సరఫరాలపై ఆందోళనలు పెరిగాయి. ఎనర్జీ అనలిటిక్స్ సంస్థ ఆయిల్‌ ఎక్స్ అంచనాల ప్రకారం.. ఏప్రిల్‌ లో రష్యా సగటు రిఫైనరీ ఉత్పత్తి రోజుకు సుమారు 4.69 మిలియన్ బ్యారెళ్లకు పడిపోయింది. గత 16 సంవత్సరాలకు పైగా చూస్తే ఇది అత్యల్ప స్థాయి. రిఫైనరీ కార్యకలాపాల్లో ఈ తగ్గుదల దేశీయ ఇంధన అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచింది.రష్యా ప్రపంచంలోనే అతిపెద్ద శుద్ధి చేసిన పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతిదారులలో ఒకటి. తన డీజిల్, ఏవియేషన్ ఫ్యూయల్‌ లో గణనీయమైన భాగాన్ని విదేశీ మార్కెట్‌ లకు విక్రయిస్తోంది. రష్యా ఇంధన ఎగుమతులపై ఆంక్షలు ప్రపంచ సరఫరాలను తగ్గించి, అంతర్జాతీయ ఇంధన ధరలపై ఒత్తిడిని పెంచుతాయని విశ్లేషకులు హెచ్చరించారు.దేశంలో ఇంధన సరఫరాలకు అంతరాయం కలగకుండా చూడటం రష్యాకు ప్రాధాన్యత. డిప్యూటీ ప్రధాని నోవాక్.. ఇంధన సరఫరాల నిరంతర పర్యవేక్షణ, ప్రభుత్వ ఏజెన్సీలు, ఇంధన సంస్థల మధ్య సమన్వయం అవసరమని స్పష్టం చేశారు. దేశీయ చమురు-ఉత్పత్తుల మార్కెట్‌ను నిరంతరం పర్యవేక్షించడం, సమాఖ్య ఏజెన్సీలు, కంపెనీల మధ్య సమన్వయం, అవసరమైతే సకాలంలో అదనపు ప్రతిస్పందన చర్యలు అవశ్యకం అని ఆయన పేర్కొన్నారు.