translateexpand_more

Telangana National Highways News

Latest updates from Telugu Digital news sources.

Zee Telugu03 Jun, 12:11 pm
కరీంనగర్, జగిత్యాల, మంచిర్యాల రూట్లలో ప్రయాణించే వారికి గుడ్ న్యూస్.. కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది. Telangana National Highways: తెలంగాణకు కేంద్రం ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. ప్రస్తుతం ఉన్న జాతీయ రహదారి (NH)-63లోని ఆర్మూర్-జగిత్యాల-మంచిర్యాల విభాగాన్ని హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) పద్ధతిలో.. జాతీయ రహదారి (NH)-563లోని జగిత్యాల-కరీంనగర్ విభాగాన్ని బిల్డ్-ఆపరేట్-ట్రాన్స్‌ఫర్ (టోల్) పద్ధతిలో 4-లేన్ల ప్రమాణాలకు విస్తరించడానికి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు ఆమోదించింది. ఈ పనులు మూడు వర్క్ ప్యాకేజీల కింద మొత్తం 190.76 కిలోమీటర్ల పొడవుతో.. రూ.7597.16 కోట్ల మొత్తం వ్యయంతో జరగనున్నాయి. తెలంగాణలోని నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల జిల్లాల గుండా వెళ్లే ఆర్మూర్-జగిత్యాల-మంచిర్యాల ప్రాజెక్ట్ విభాగం, హైవే వెంబడి ఉన్న అంక్సాపూర్, కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి, లక్షెట్టిపేట, మంచిర్యాల వంటి అనేక నివాస ప్రాంతాల కారణంగా ప్రస్తుతం తీవ్రమైన రద్దీని ఎదుర్కొంటోంది. అదేవిధంగా జగిత్యాల-కరీంనగర్ విభాగం కూడా ఈ మార్గంలో ఉన్న జగిత్యాల, పోతారం, గంగాధర, కరీంనగర్ వంటి తీవ్రమైన రద్దీ, అధిక నివాస ప్రాంతాల గుండా వెళుతుంది. నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కరీంనగర్ జిల్లాల వ్యాప్తంగా, జనసాంద్రత గల ప్రాంతాలకు బైపాస్‌లతో కూడిన 4-లేన్ల రహదారి నిర్మాణం, ఓపెన్ టోలింగ్‌ను కలిగి ఉండేలా ఈ ప్రాజెక్టులు ప్రతిపాదించారు. ఇవి గంటకు 100 కిలోమీటర్ల డిజైన్ వేగాన్ని నిర్ధారించడంతో పాటు.. ప్రయాణ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఈ ప్రాజెక్ట్ ప్రాంతీయ రవాణాను మెరుగుపరచడంతో పాటు, సామాజిక-ఆర్థిక అభివృద్ధిని కూడా ప్రోత్సహిస్తుంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత ఆర్మూర్, మంచిర్యాల మధ్య ప్రయాణ సమయం సుమారు 1 గంట 30 నిమిషాలు, జగిత్యాల, కరీంనగర్ మధ్య సుమారు 45 నిమిషాలు తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో ప్రయాణికులకు, సరుకు రవాణా రెండింటికీ సురక్షితమైన, వేగవంతమైన ప్రయాణం అందిస్తుందని భావిస్తున్నారు. అదనంగా ఈ ప్రాజెక్ట్ వల్ల ఇంధన వినియోగం, కార్బన్ ఉద్గారాలు, వాహన నిర్వహణ ఖర్చులు (VOC) గణనీయంగా తగ్గుతాయని అధికారులు చెబుతున్నారు. ఆర్థిక కేంద్రాలు: సిద్దిపేట, వరంగల్ అర్బన్‌లోని రెండు ప్రత్యేక ఆర్థిక మండలాలు (SEZ), నిజామాబాద్, సిద్దిపేటలోని మెగా ఫుడ్ పార్కులు, రాజన్న సిరిసిల్లలోని ఫిషింగ్ అండ్ సీఫుడ్ క్లస్టర్లకు ఈ రహదారులు ప్రధాన రవాణా మార్గాలుగా మారనున్నాయి. సామాజిక, ఆధ్యాత్మిక కేంద్రాలు: ప్రముఖ పుణ్యక్షేత్రాలైన వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, కాళేశ్వరంతో పాటు చారిత్రక నగునూరు కోట, ఖిలా కోట, లోయర్ మానేరు డ్యామ్ వంటి పర్యాటక ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఈ కారిడార్ ద్వారా ప్రయాణ సమయం భారీగా తగ్గనుంది. రైల్వే అనుసంధానం: నిజామాబాద్, లింగంపేట/జగిత్యాల, పెద్దపల్లి, కోరుట్ల, మంథని, కరీంనగర్, గంగాధర వంటి ముఖ్యమైన రైల్వే స్టేషన్లకు ఈ రహదారులు అనుసంధానిస్తారు. భారీగా ఉపాధి అవకాశాలు: ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా తెలంగాణలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. రహదారుల నిర్మాణ సమయంలో ప్రత్యక్షంగా దాదాపు 34.43 లక్షల మ్యాన్-డేస్ (పనిదినాలు), పరోక్షంగా మరో 42.7 లక్షల మ్యాన్-డేస్ ఉపాధి లభిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Telangana National Highways News Keyword | Telugu Digital