
తపాలాశాఖ ఫ్రాంచైజీ 2.0తో విస్తృత ఉపాధి అవకాశాలు విద్యార్థులు, నిరుద్యోగులు, చిరుద్యోగులందరికీ లబ్ధి ఈనాడు డిజిటల్, హైదరాబాద్: మారుతున్న కాలానికి అనుగుణంగా తన సేవల్ని మరింత వేగవంతం చేసే దిశగా తపాలాశాఖ అడుగులు వేస్తోంది. ఈ-కామర్స్ రంగంలో పెరుగుతున్న పోటీని తట్టుకుంటూ, ప్రజలకు మరింత చేరువయ్యేందుకు కొత్తగా ‘ఫ్రాంచైజీ పథకం 2.0’ను అందుబాటులోకి తెచ్చింది. కొరియర్, ఎక్స్‌ప్రెస్, పార్సిల్ విభాగంలో సేవల్ని బలోపేతం చేయడానికి ఈ పథకానికి రూపకల్పన చేసింది. అడ్వాన్స్ పోస్టల్ టెక్నాలజీ (ఏపీటీ 2.0)ని ఉపయోగించి ఆధునిక, పారదర్శక, పౌర కేంద్రిత సేవలను అందించడమే దీని లక్ష్యం. విద్యార్థులు, నిరుద్యోగులు, చిరుద్యోగులు, మహిళలు, వర్తకులు.. ఎవరైనా పోస్టల్ ఫ్రాంచైజీలుగా మారి ఆదాయాన్ని ఆర్జించవచ్చు. స్పీడ్ పోస్ట్ డాక్యుమెంట్ బుకింగ్, స్పీడ్ పోస్ట్ పార్సిల్ బుకింగ్, ఇండియా పోస్ట్ పార్సిల్ సేవలు, ఇంటర్నేషనల్ ఈఎమ్ఎస్, ఐటీపీఎస్ సేవలు, క్లిక్ అండ్ బుక్, పిక్-అప్ సేవలు, క్యాష్ ఆన్ డెలివరీ, ఇంటివద్ద నుంచే పార్సిల్ సేకరణ.. ఇలా రకరకాల సేవలు అందించవచ్చు. ఫ్రాంచైజీదారులు తమ సౌలభ్యాన్ని బట్టి బుకింగ్ మాత్రమే, డెలివరీ మాత్రమే, పికప్ మాత్రమే, అన్ని సేవలు కలిపి.. అనే నాలుగు రకాల సర్వీసుల్ని ఎంచుకోవచ్చు. డెలివరీ సేవల కోసం వాహనం ఉంటే సరిపోతుంది. బుకింగ్ సేవలకు చిన్న స్థలం, స్మార్ట్‌ఫోన్ లేదా కంప్యూటర్, ఇంటర్నెట్, ప్రింటర్ వంటి మౌలిక సదుపాయాలు అవసరం. ఫ్రాంచైజీ కార్యకలాపాల ప్రకారం భద్రతా డిపాజిట్ నిర్ణయించారు. డెలివరీ, పికప్ సేవలకు రూ.5వేలు, బుకింగ్ సేవలకు రూ.10వేలు, అన్ని సేవలకు రూ.15వేలు చెల్లించాలి. నిబంధనల ప్రకారం ఈ మొత్తం తిరిగి చెల్లిస్తారు. ప్రతి బుకింగ్, పికప్, డెలివరీపై కమీషన్ లభిస్తుంది. వ్యాపారం పెరిగేకొద్దీ కమీషన్ శాతం పెరుగుతుంది. క్యాష్ ఆన్ ఫ్రాంచైజీ కార్యకలాపాల ప్రకారం భద్రతా డిపాజిట్ నిర్ణయించారు. డెలివరీ, పికప్ సేవలకు రూ.5వేలు, బుకింగ్ సేవలకు రూ.10వేలు, అన్ని సేవలకు రూ.15వేలు చెల్లించాలి. నిబంధనల ప్రకారం ఈ మొత్తం తిరిగి చెల్లిస్తారు. ప్రతి బుకింగ్, పికప్, డెలివరీపై కమీషన్ లభిస్తుంది. వ్యాపారం పెరిగేకొద్దీ కమీషన్ శాతం పెరుగుతుంది. క్యాష్ ఆన్ డెలివరీ సేవలకు అదనపు కమీషన్ ఉంటుంది. ఈ కొత్త విధానం, ఆర్జనకు సంబంధించిన లావాదేవీలన్నీ డిజిటల్ విధానంలో నిర్వహిస్తారు. కొత్తగా తీసుకువచ్చిన ఏపీటీ 2.0 మొబైల్ యాప్, సెల్ఫ్ సర్వీస్ పోర్టల్ ద్వారా బుకింగ్‌లు నిర్వహించవచ్చు. డిజిటల్ వ్యాలెట్ ద్వారా పోస్టేజ్ చెల్లింపులు చేయవచ్చు. ప్రతి బుకింగ్‌కు సంబంధించిన సమాచారం వెంటనే సిస్టమ్‌లో నమోదవుతుంది. ఈ ఇండియా పోస్ట్ ఫ్రాంచైజీ నోటిఫికేషన్ ప్రతి సంవత్సరం జనవరి, ఏప్రిల్, జులై, అక్టోబరు నెలల్లో విడుదల చేస్తారు. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి శిక్షణ ఇచ్చి, ఒప్పందం కుదుర్చుకున్న 30 రోజుల్లోపు కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం కల్పిస్తారు. అందరికీ అవకాశం.. - ఎన్.ఆర్.విశాలాచ్చి, పోస్ట్‌మాస్టర్ జనరల్, తెలంగాణ పోస్టల్ సర్కిల్ ప్రస్తుతం ఆన్లైన్ వ్యాపారం, ఇంటర్నేషనల్ షిప్మెంట్లు, పార్సిల్ సేవలకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ-కామర్స్ విక్రేతలు, చిన్న వ్యాపారులు, విద్యార్థులు, ఇంట్లోనే ఉండి పని చేసుకునేవారికి ఈ పథకం ఆర్థికంగా చేయూతనిస్తుంది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.