అనధికారికంగా చెరువుల తవ్వకం కోళ్ల వ్యర్థాలతో ఇష్టారీతిన పెంపకం మైలవరం రిజర్వాయర్‌ కింద అనధికారిక చెరువులో చేపలకు మేతగా వేస్తున్న కోళ్ల వ్యర్థాలు జమ్మలమడుగు గ్రామీణ, న్యూస్‌టుడే: జమ్మలమడుగు మండలం పొన్నతోట పంచాయతీ పరిధి మారెమ్మ దేవాలయం సమీపంలోని మైలవరం రిజర్వాయర్‌ కొందరు అక్రమార్కులకు వరంగా మారింది. ఎలాంటి అనుమతులు లేకుండా ఇక్కడ సుమారు 20 ఎకరాల్లో, గూడెంచెరువు పంచాయతీ ఆంజనేయపురం సమీపంలో దాదాపు 12 ఎకరాల్లో చెరువుల తవ్వకం చేపట్టారు. వాటిల్లో అనధికారికంగా చేపల పెంపకం సాగిస్తున్నారు. పులివెందుల, ముద్దనూరు, ప్రొద్దుటూరు తదితర ప్రాంతాల నుంచి కోళ్ల వ్యర్థాలను తెచ్చి మేతగా వేస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. సాధారణంగా చేపలకు తవుడు, సోయాబీన్, వేరుసెనగ చెక్క, మొక్కజొన్నతో తయారు చేసిన దాణాను ఆహారంగా ఇస్తుంటారు. ఇది మార్కెట్‌లో కిలో రూ. 40 నుంచి రూ.50 వరకు ఉంది. ఆరోగ్యవంతమైన దాణాతో ఒక చేప కిలో బరువు పెరగడానికి సుమారు రూ. 60 వరకు ఖర్చవుతుంది. అదే కోళ్ల వ్యర్థాలతో అయితే రూ. 20లోపే ఖర్చవుతుండటంతో పాటు త్వరగా చేపలు బరువు పెరుగుతాయి. దీంతో నిర్వాహకులు వీటిని ఎంచుకుంటున్నారు. కోళ్ల వ్యర్థాలను చేపలకు ఆహారంగా వేయడాన్ని 2016లోనే ప్రభుత్వం నిషేధించింది. ఉల్లంఘిస్తే జరిమానా విధించేలా ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయినా క్షేత్రస్థాయిలో అధికారులు పట్టించుకోక పోవడం, మామూళ్లకు అలవాటు పడటంతో వ్యర్థాలతో పెంపకం యథేచ్ఛగా సాగుతోంది. తింటే అనారోగ్యం - కె.వి.బ్రహ్మం, పశు సంవర్ధకశాఖ ఉపసంచాలకుడు, జమ్మలమడుగు కోళ్ల వ్యర్థాలతో పెంచిన చేపలను తింటే అనారోగ్యాన్ని కొనితెచ్చుకున్నట్లే. కాలేయ, జీర్ణకోశ సమస్యలతో పాటు గ్యాస్టిక్, కొన్ని రకాల చర్మవ్యాధులు వచ్చే అవకాశం ఉంది. మహిళలకు నెలసరి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కోళ్ల వ్యర్థాలను నిల్వ ఉంచితే పరిసర ప్రాంతాలకు పూర్తిగా ముప్పు తలెత్తుతుంది. చర్యలు తీసుకుంటాం.. - నాగయ్య, డిప్యూటి డైరెక్టర్‌ ఆఫ్‌ ఫిషరీస్, కడప జమ్మలమడుగు ప్రాంతంలోని మైలవరం రిజర్వాయర్‌ కింద ఎలాంటి అనుమతుల్లేకుండా చేపల చెరువులను నిర్వహిస్తున్నట్లు దృష్టికొచ్చింది. ఆ స్థలం ఇరిగేషన్‌ అధికారుల ఆధీనంలో ఉండటంతో సంబంధిత అధికారులకు, చేపల చెరువుల నిర్వాహకులకు ఇది వరకే నోటీసులు జారీ చేశాం. త్వరలోనే అక్రమ చేపల చెరువులను తొలగించి, నిర్వాహకులపై చర్యలు తీసుకుంటాం. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.