translateexpand_more

Ap Home Minister News

Latest updates from Telugu Digital news sources.

AP7AM02 Jun, 01:06 am
టీడీపీ కార్యకర్తలను వేధించిన సీఐపై వేటు తప్పదు

పాయకరావుపేట సర్కిల్ ఇన్‌స్పెపెక్టర్ (సీఐ) సాకేటి శంకర్ రావుపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. సీఐ శంకర్ రావు వ్యవహారశైలి, గతంలో ఆయనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఓ పత్రికలో వచ్చిన కథనంపై ఆమె స్పందించారు. సోమవారం అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ విషయం వెల్లడించారు.గత వైసీపీ ప్రభుత్వ హయాంలో శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ సీఐగా శంకర్ రావు పనిచేశారని, ఆ సమయంలో వందలాది మంది టీడీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించి, తీవ్రంగా వేధించారని జూన్ 1న ‘ఈనాడు’ పత్రికలో కథనం ప్రచురితమైంది. ప్రస్తుత పాయకరావుపేట ఎమ్మెల్యే గౌతు శిరీష వంటి నేతలను కూడా ఆయన లక్ష్యంగా చేసుకున్నారని ఆ కథనంలో ఆరోపించారు. ఇంతటి వివాదాస్పద నేపథ్యం ఉన్న అధికారిని హోంమంత్రి సొంత నియోజకవర్గమైన పాయకరావుపేటలో నియమించడంపై విమర్శలు వెల్లువెత్తాయి.ఈ విమర్శలపై మంత్రి అనిత స్పందిస్తూ ఆ సీఐ వల్ల పలాస ప్రాంత కార్యకర్తలు ఎదుర్కొన్న ఇబ్బందులపై తనకు ఫిర్యాదులు అందాయని తెలిపారు. "కార్యకర్తలు ఉంటేనే పార్టీ ఉంటుంది. వారిని గౌరవించుకోవడం నా ప్రథమ కర్తవ్యం. కార్యకర్తల వల్లే నేను నా నియోజకవర్గంలో పనిచేయగలుగుతున్నా" అని ఆమె అన్నారు. అధికారుల గత చరిత్రపై కొన్నిసార్లు ముందస్తు సమాచారం ఉండకపోయినా, ఈ విషయంలో మాత్రం కచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. మే 2న పాయకరావుపేట సీఐగా శంకర్ రావు బాధ్యతలు చేపట్టడం ఈ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది.

AP7AM27 May, 10:21 am
టీడీపీ ఆవిర్భావమే ఒక తిరుగులేని చరిత్ర

రికార్డులు సృష్టించడం తెలుగుదేశం పార్టీకి కొత్త కాదని, ఆ పార్టీ ఆవిర్భావమే ఒక తిరుగులేని చరిత్ర, సంచలనమని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న మహానాడు వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రస్తుతం హైబ్రిడ్ విధానంలో నిర్వహిస్తున్న ఈ మహానాడు ద్వారా గ్రామ గ్రామానికి, ప్రతి కార్యకర్త హృదయానికి పార్టీ చేరుతోందని హర్షం వ్యక్తం చేశారు. ఈ ఏడాది మహానాడును ‘స్త్రీశక్తి’ థీమ్‌తో నిర్వహించడం మహిళల ఆత్మగౌరవం, సాధికారత, భద్రత పట్ల టీడీపీకి ఉన్న సంకల్పానికి నిదర్శనమని అనిత పేర్కొన్నారు. మహిళలకు రాజకీయాల్లో సముచిత ప్రాతినిధ్యం కల్పించాలనే ఉద్దేశంతోనే నారా లోకేశ్ 33 శాతం సీట్ల కేటాయింపుపై భారీ ప్రకటన చేశారని గుర్తుచేశారు. ఇదే వేదికపై వైసీపీపై హోంమంత్రి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. "గతంలో ‘జై జగన్’ అనడానికి నిరాకరించి, ‘జై చంద్రబాబు.. జై తెలుగుదేశం’ అన్నందుకు బీసీ కార్యకర్త తోట చంద్రయ్యను గొడ్డలి పార్టీ రౌడీలు నడిరోడ్డుపై గొంతుకోసి చంపారు" అని మండిపడ్డారు. నాటి జగన్ ప్రభుత్వం ఆ కుటుంబానికి అన్యాయం చేస్తే.. నేడు చంద్రబాబు ప్రభుత్వం వారికి అండగా నిలిచిందని, మహానాడు పండుగ వేళ చంద్రయ్య కుమారుడు వీరాంజనేయులు ప్రభుత్వ ఉద్యోగిగా నియమితులయ్యారని అనిత వెల్లడించారు.