
సరికొత్త మోసానికి తెరలేపిన సైబర్ మోసగాళ్లు డూప్లికేట్ ఈ-సిమ్‌తో.. బ్యాంకు లావాదేవీలు ఈనాడు, అమరావతి: విజయవాడ నగరానికి చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి సిమ్‌ను స్వాప్ చేయడంతో పాటు అతని ఖాతా నుంచి సైబర్ మోసగాళ్లు డబ్బు మళ్లించారు. అంతటితో ఆగకుండా ఆ ఖాతాలను వివిధ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించిన నగదు జమ, బదిలీలకు ఉపయోగించారు. బాధితుడి ప్రమేయం లేకుండా ఇది జరగడంతో పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. దీనిపై సైబర్ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. విజయవాడకు చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి గత నెల 20న రాత్రి ఫోన్‌లో మాట్లాడుతుండగా.. హఠాత్తుగా మొబైల్‌లో సిగ్నల్ పోయింది. మరుసటి రోజు జియో కార్యాలయానికి వెళ్లారు. అక్కడ.. ఆధార్‌ను అప్‌డేట్ చేసుకోవాలని సూచించారు. ఆధార్‌పై పాత ఫొటో ఉండడంతో అప్‌డేషన్ సాధ్యం కాలేదు. తర్వాత రోజు ఆధార్ సెంటర్‌కు వెళ్లి.. తాజా ఫొటోతో మార్చుకున్నారు. అనంతరం 25న మళ్లీ జియో కార్యాలయానికి వెళ్లి ఆధార్ అప్‌డేట్ చేసుకుని కొత్త సిమ్ తీసుకున్నారు. ఆ సిమ్‌ను మొబైల్‌లో వేసుకుని యాక్టివేట్ చేసుకున్న తర్వాత.. వచ్చిన ఎస్‌ఎంఎస్‌లు చూసి నిర్ఘాంతపోవడం అతని పనైంది. తన బ్యాంకు ఖాతా నుంచి విడతల వారీగా రూ.2.50 లక్షలు మరో ఖాతాకు బదిలీ అయ్యాయి. అంతేకాకుండా తన రెండు ఖాతాల్లో తన ప్రమేయం లేకుండానే.. రూ.లక్షల్లో లావాదేవీలు జరిగాయి. కేవలం ఐదు రోజుల్లోనే పెద్ద మొత్తంలో నగదు పలు దఫాలుగా జమైంది. ఆ సొమ్ము వేరే ఖాతాలకు కూడా మళ్లింది. ఫిర్యాదుదారు సిమ్‌కు గుర్తు తెలియని వ్యక్తి ఒకరు తప్పుడు ఆధారాలతో ఈ-సిమ్‌ను తీసుకున్నారు. దీనికి సంబంధించిన సమాచారం ఎస్‌ఎంఎస్‌లో బాధితుడికి గత నెల 19వ తేదీనే వచ్చింది. ఈ ఎస్‌ఎంఎస్‌ను అతను చూడకపోవడంతో అప్రమత్తం కాలేకపోయారు. దీంతో మరుసటి రోజు అతని మొబైల్‌లో సిగ్నల్ పోయి.. మోసగాడి ఫోన్‌లో ఈ-సిమ్ యాక్టివేట్ అయింది. దీంతో ఆ సిమ్‌కు లింక్ అయిన బ్యాంకు ఖాతాల వివరాలు తీసుకుని అందులోని రూ.2.50 లక్షలను వేరే ఖాతాకు బదిలీ చేశారు. సిమ్ పోయిందని, పాడైందని చెప్పి టెలికాం ఆపరేటర్ల వద్దకు వెళ్లి మోసగాళ్లు.. ఆ నంబరుతో డూప్లికేట్ సిమ్ తీసుకుని యాక్టివేట్ చేసుకుంటున్నారు. దీంతో ఇక మన సిమ్ పనిచేయడం ఆగిపోతుంది. మన సిమ్ నుంచి వివరాలు మరో దానికి బదిలీ అవుతాయి. ఓటీపీ వివరాలు మోసగాళ్ల సిమ్‌కు వెళ్తాయి. దీంతో బ్యాంకు ఖాతా నుంచి డబ్బును తమ ఖాతాలకు మళ్లించుకుంటున్నారు. దీనికోసం అనేక మార్గాల్లో వివరాలు సేకరిస్తున్నారు. మాల్‌వేర్, ఫిషింగ్, తదితర పద్ధతుల్లో సేకరించి.. బోగస్ పత్రాల ద్వారా ఆపరేటర్ల నుంచి సిమ్‌లు తీసుకుంటున్నారు. ఫలితంగా మన వద్ద ఉన్న అసలు సిమ్‌ను బ్లాక్ చేసి.. మోసగాడికి మంజూరు చేసిన సిమ్‌ను యాక్టివేట్ చేస్తారు. దీంతో అప్పటి నుంచి సిమ్‌కు వచ్చే ఓటీపీ, బ్యాంకుకు సంబంధించిన ఎస్‌ఎంఎస్‌లు వెళ్తాయి. దీని ఆధారంగా డబ్బు కొట్టేస్తారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.